శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థపై పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ప్రశంసలు
ABN , First Publish Date - 2022-10-17T22:13:26+05:30 IST
ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికీ సంస్కృతే ఒరవడి అని, సువిశాల దృక్పథం, ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికకి దిశానిర్దేశం చేయగలదని గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు(Muppavarapu Venkaiah Naidu) ఆకాంక్షించారు.
సింగపూర్‌లో తెలుగు కళలు, సంస్కృతికి పెద్ద పీట వేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆశయం అభినందనీయం-- ముప్పవరపు వెంకయ్యనాయుడు
సింగపూర్(16 అక్టోబర్ 2022): ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికీ సంస్కృతే ఒరవడి అని, సువిశాల దృక్పథం, ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికకి దిశానిర్దేశం చేయగలదని గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు(Muppavarapu Venkaiah Naidu) ఆకాంక్షించారు. ప్రస్తుతం మలేసియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన, ఈరోజు సింగపూర్ లో తెలుగు కళలు, సంస్కృతిని కాపాడుకుని ముందు తరాలకు అందజేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శ్రీ సాంస్కృతిక కళాసారధి ద్వితీయ వార్షికోత్సవంలో ప్రసంగించారు. సంస్థ ఆశయం అభినందించదగినదన్న ఆయన, దేశపు ఎల్లలు దాటి పరాయి దేశంలో మన భాష, సంస్కృతి, కళలు గౌరవాన్ని అందుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. గత రెండేళ్ళ కాలంలో సంగీత, నృత్య, సాహిత్య, ఆధ్యాత్మిక, నాటక, సంప్రదాయ కళారంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సంస్థ నిర్వాహకులకు, ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు.
మన భాషా సంస్కృతులను పరిరక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న సంస్థలు ఒకే వేదిక మీదకు రావాలని పిలుపునిచ్చిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, నలుగురి ఆలోచనల సంగమం గొప్ప విజయాలను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ దిశగా శ్రీ సాంస్కృతిక కళాసారథి లాంటి సంస్థలు చొరవ తీసుకోవాలని సూచించిన ఆయన, యువతలో ఈ చొరవ మరింత పెరగాలని ఆకాంక్షించారు.
దసరా దీపావళి పండుగలు సందర్భంగా సింగపూర్ తెలుగు వారందరితో కలిసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను సంతరింప చేస్తూ భారత పూర్వ ఉపరాష్ట్రపతివర్యులు గౌరవనీయులు ఎం వెంకయ్య నాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరై సింగపూర్ తెలుగు ప్రజలకు, నిర్వాహక బృందానికి తమ అభినందనలు తెలియజేశారు. ఆత్మీయ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి కోశాధికారి వామరాజు సత్యమూర్తి హాజరయ్యారు. సింగపూర్ గాయని గాయకులచే సంప్రదాయక భక్తి గీతాలు, సాయి తేజస్వి మరియు అభినయ నృత్యాలయ వారి నృత్య ప్రదర్శనలు , తేటతెలుగు పద్యాలాపన ప్రేక్షకులందరినీ అలరించాయి.
శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "తమ సంస్థ 2020లో ప్రారంభమై గత రెండు సంవత్సరాలుగా సుమారు 40 కి పైగా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంస్థల సమన్వయంతో నిర్వహించిందని, తమ ద్వితీయ వార్షికోత్సవం వేడుకలను గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జరుపుకోవాలని జూలై నుండి ఎదురు చూస్తున్నామని ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని" ఆనందం వ్యక్తం చేశారు.
సంస్థ యొక్క ప్రధాన కార్యనిర్వాహకవర్గం రాధిక మంగిపూడి, రామాంజనేయులు చామిరాజు, భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కలసి వెంకయ్య నాయుడు గారిని అభిమానపూర్వకంగా సత్కరించారు.
సింగపూర్ తెలుగు ప్రజలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు గారు ఇచ్చిన అందించిన ప్రసంగం చక్కటి చేలోక్తులతో, మన భాష, సంప్రదాయ, సంస్కృతులను కాపాడుకునేందుకు పిలుపునిస్తూ, ఆలోచనాత్మకమైన సందేశంతో అందరిని అలరించింది. ఈ కార్యక్రమములో సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంస్థ సభ్యులు హాజరై శ్రీ సాంస్కృతిక కళాసారథి ని అభినందించారు.
గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం యూట్యూబ్ ఫేస్బుక్ మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని ఈ లింక్‌పై క్లిక్ చేయండి: https://fb.watch/gcMp92bw5U/
ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
