బ్రిటన్‌‌లో NRIల విజయాలకు కారణాలు ఇవే.. తేల్చి చెప్పిన తాజా నివేదిక

ABN , First Publish Date - 2022-03-15T22:34:03+05:30 IST

బ్రిటన్‌లో NRIల విజయాలకు కారణాలేంటో తెలుసుకునేందుకు అధ్యయనం చేపట్టిన లండన్ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.

బ్రిటన్‌‌లో NRIల విజయాలకు కారణాలు ఇవే.. తేల్చి చెప్పిన తాజా నివేదిక

ఎన్నారై డెస్క్: విదేశాల్లో భారతీయుల ప్రతిభాపాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో భారతీయులు ఆర్థికంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ అంతర్జాతీయ టెక్ కంపెనీల అధిపతుల్లో అధిక శాతం భారతీయులేనన్న విషయం తెలిసిందే. అయితే.. బ్రిటన్‌లో NRIల విజయాలకు కారణాలేంటో తెలుసుకునేందుకు అధ్యయనం చేపట్టిన లండన్ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ‘ఇండియా ఇన్ ది యూకే: ద డాయాస్పొరా ఎఫెక్ట పేరిట ఈ నివేదికను సదరు సంస్థ ఫిక్కీ(FICCI)తో కలిసి ఇండియన్ హైకమిషన్‌లో శుక్రవారం విడుదల చేసింది.


కుటుంబ మద్దతు, విజయాన్ని అందుకోవాలన్న దృఢసంకల్పం, వృత్తిపరమైన విలువలకు కట్టుబడి ఉండటం, ఆశావహదృక్పథం వంటివి.. భారతీయుల విజయాలకు ముఖ్య కారణాలని గ్రాంట్ థార్న్‌టన్ తన నివేదికలో పేర్కొంది. బ్రిటన్‌లో అద్భుత విజయాలు అందుకుని, ఇరు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తున్న పలువురు భారతీయ వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఇంటర్వ్యూలను కూడా ఈ నివేదికలో పొందుపరిచింది. 


కాగా.. బ్రిటన్‌లోని భారతీయులు ఇరు దేశాల మధ్య సజీవ వారధిగా ఉన్నారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా భారత్ హైకమిషనర్ గాయత్రీ ఇస్సార్ కుమార్ ప్రస్తావించారు. ఆరోగ్యం, ఫుడ్స్ అండ్ బెవరేజెస్, రియల్ ఎస్టేట్, ఆతిథ్య రంగం, ఫార్మాసిటికల్స్ టెక్నాలజీ, మీడియా టెలికాం వంటి కీలక రంగాల్లో భారతీయుల ముద్ర ఉందని ఈ నివేదిక తేల్చింది. అయితే.. భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాల పగ్గాలు మొదటి తరం నుంచి రెండో తరానికి బదిలీ అవుతున్న తరుణంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్న విషయాన్ని కూడా ఈ నివేదికలో ప్రస్తావనకు తెచ్చారు. 

Updated Date - 2022-03-15T22:34:03+05:30 IST