Kuwait: ప్రవాసులకు కువైత్ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే..

ABN , First Publish Date - 2022-10-28T12:57:26+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Kuwait: ప్రవాసులకు కువైత్ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హింసాత్మక ఘటనలతో పాటు ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తామని (Deported) ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) వార్నింగ్ ఇచ్చింది. బహిష్కరణ కేసులకు మంత్రిత్వశాఖ లేదా అండర్ సెక్రెటరీ ఆమోదం కూడా అవసరం లేదని, హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వలసదారులను నేరుగా దేశం నుంచి బహిష్కరించవచ్చని చట్టం చెబుతోందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు గుర్తు చేశారు. అంతేగాక ఈ చర్యలు మానవ హక్కులకు విరుద్ధం కావని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇటీవల హవల్లి, మహబౌలా, సాల్మియా, అల్-రెగ్గే తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు పెరగడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. బహిష్కరణలో కువైత్ (Kuwait) సందర్శించకుండా పూర్తి నిషేధం ఉంటుంది. అలాగే బహిష్కరణకు గురైన వారు దోషులుగా తేలితే జరిగిన నష్టాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాదచారుల వంతెనను ఉపయోగించే మోటార్‌సైకిల్‌లను కూడా బహిష్కరించాలని నిర్ణయించింది. ద్విచక్రవాహనదారులు చట్టవిరుద్ధంగా పాదచారుల వంతెనను ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా పాదాచారుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని మంత్రిత్వశాఖ మండిపడింది. ఇకపై ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించింది.

Updated Date - 2022-10-28T13:35:46+05:30 IST