టెస్లా టీంలో తొలి ఉద్యోగి భారతీయుడే.. Elon Musk వైరల్ ట్వీట్..!

ABN , First Publish Date - 2022-01-03T01:58:54+05:30 IST

టెస్లా సంస్థలోని ఆటోపైలట్ విభాగంలో మొదటగా చేరింది అశోకే అంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

టెస్లా టీంలో తొలి ఉద్యోగి భారతీయుడే.. Elon Musk వైరల్ ట్వీట్..!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భారతీయ సంతతి వారు తమ వృత్తి జీవితాల్లో ఎన్నో విజయాలను అందుకుంటూ భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యా్ప్తం చేస్తున్నారు. ముఖ్యంగా..టెక్ రంగంలో అగ్రగాములుగా నిలుస్తూ ఎన్నో విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్నారు. సత్య నాదేళ్ల(మైక్రోసాఫ్ట్ సీఈఓ), సుందార్ పిచాయ్(ఆల్ఫబెట్ సీఈఓ),  పరాగ్ అగర్వాల్(ట్విటర్ సీఈఓ) ఈ కోవకు చెందిన వారే..! ఈ లిస్టులోకి తాజాగా మరో భారతీయ వ్యక్తి వచ్చి చేరింది. ఆయనే.. ఎల్లుస్వామి అశోక్..! టెస్లా సంస్థలోని ఆటోపైలట్ విభాగంలో మొదటగా చేరింది అశోకే అంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. పూర్తి విషయంలోకి వెళితే.. 


టెస్లాకు చెందిన కార్లకు తమంతట తాముగా, డ్రైవర్ సహాయం అంతగా తీసుకోకుండానే ప్రయాణించే సామర్థ్యం ఉంది. దీన్ని ఆటోపైలట్ సాంకేతికత అని పిలుస్తారు. ఈ టెక్నాలజీకి కృత్రిమ మేథ ఎంతో కీలకం.  ఈ ఆటోపైలట్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన టీంలోని సభ్యులను ఎలాన్ మస్క్ 2015లో ట్విటర్ ద్వారా ఎంపిక చేసుకున్నారు. మా సంస్థలో పని చేయాలనుకుంటున్న వారు..వివరాలు మాకు పంపించండి అంటూ మస్క్ అప్పట్లో ట్వీట్ చేయడంతో ఎంతో మంది రిప్లై ఇచ్చారు. వారిలో అశోక్ కూడా ఒకరు.  అయితే..ఈ విషయయాన్నే ఎలాన్ మస్క్ తాజాగా వెల్లడించారు.  ‘‘ఆటో పైలట్ ఇంజినీరింగ్ విభాగానికి ఆశోక్ నేతృత్వం వహిస్తున్నారు. ఆ విభాగం డైరెక్టర్ ఆండ్రేజ్! అయితే.. టీం సొంతం చేసుకున్న విజయాలకు నేను, ఆండ్రెజ్ కారణమని చాల మంది అనుకుంటుంటారు. మా టీంలో అత్యుత్తమ ప్రతిభగలవాళ్లు ఎందరో ఉన్నారు’’ అంటూ మస్క్ తెలిపారు. అంతేకాకుండా..  తమ ఆటోపైలట్ టీంలో మొదట ఉద్యోగిగా చేరింది ఆశోక్ అని కూడా వెల్లడించారు. 


చెన్నై నగరంలో ఇంజినీరింగ్(ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్) చేసిన అశోక్ ఆ తరువాత.. కార్నెగీ మెలన్ యూనివర్శిటీ నుంచి రోబోటిక్స్‌లో మాస్టర్స్ చేశారు. టెస్లాలో చేరక మునుపు  ఆయన ఫోక్స్ వ్యాగన్ సంస్థలోని రోబోటిక్స్ డెవలెప్‌మెంట్ విభాగంలో.. ఆ తరువాత..WABCO సంస్థలో పనిచేశారు. 

Updated Date - 2022-01-03T01:58:54+05:30 IST