గల్ఫ్ దేశాల్లో భారతీయుల మరణాలు.. విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం..

ABN , First Publish Date - 2022-03-05T22:43:54+05:30 IST

గల్ఫ్ దేశాల్లో భారతీయుల మరణాలకు సంబంధించి తాజాగా విదేశాంగ శాఖ గణాంకాలను విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం.. కొన్ని గల్ఫ్ దేశాల్లో భారతీయుల మరణాల సంఖ్య పెరిగితే మరికొన్ని దేశాల్లో ఈ సంఖ్య తగ్గింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గల్ఫ్ దేశాలన్నిటిలోకి యూఏఈలో అత్యధికంగా 35 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే..

గల్ఫ్ దేశాల్లో భారతీయుల మరణాలు.. విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం..

ఎన్నారై డెస్క్: గల్ఫ్ దేశాల్లో భారతీయుల మరణాలకు సంబంధించి తాజాగా విదేశాంగ శాఖ గణాంకాలను విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం.. కొన్ని గల్ఫ్ దేశాల్లో భారతీయుల మరణాల సంఖ్య పెరిగితే మరికొన్ని దేశాల్లో ఈ సంఖ్య తగ్గింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గల్ఫ్ దేశాలన్నిటిలోకి యూఏఈలో అత్యధికంగా 35 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే.. 2017 నుంచి 2021 మధ్య కాలంలో అక్కడ సగటున రోజుకు ఐదుగురు ప్రవాసీ భారతీయులు మృత్యువాత పడ్డారు. 2020లో యూఏఈలో 2454 మంది భారతీయులు మరణించగా.. 2021 నాటికి ఈ సంఖ్య 2714కు చేరింది. ఇక..2021  జనవరి 31 వరకూ యూఏఈలో 193 మంది భారతీయులు మరణించారు.


ఖతార్‌లో 2020లో 385 మంది ఎన్నారైలు మరణించగా.. 2021లో 420 మంది అసువులు బాసారు. ఓమన్‌లో గత ఐదేళ్ల కాలంలో భారతీయుల మరణాలు రెట్టింపయ్యాయి. 2017లో అక్కడ 495 మంది మరణించగా.. 2021 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపై 913కి చేరుకుంది. ఇక బహ్రెయిన్‌లో 2020లో 303 మరణాలు, 2021లో 352  మరణాలు సంభవించాయి. అయితే.. సౌదీ అరేబియాలో మాత్రం మరణాల సంఖ్య తగ్గింది. 2020లో అక్కడ ఏకంగా 3723 మంది ఎన్నారైలు మృత్యువాత పడ్డారు. అంతకుమునుపు ఐదేళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం. అయితే.. 2021  వచ్చే సరికి ఈ సంఖ్య 2328కు పరిమితమైంది. సౌదీ అరేబియాలో దాదాపు 25 లక్షల మంది ప్రవాసీ భారతీయులు ఉన్న విషయం తెలిసిందే.  కువైత్‌లో భారతీయుల జనాభా దాదాపు పది లక్షలు కాగా.. 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఏటా మరణించిన భారతీయుల సంఖ్య 700 లోపే. కానీ.. 2019లో మాత్రం ఈ సంఖ్య  రెట్టింపయ్యింది. 2020లోనూ 1279 మంది ఎన్నారైలు కువైత్‌లో మరణించారు. ఇక 2021లో మరణాల సంఖ్య 1201కు తగ్గింది. 


ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్..2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం  ప్రవాసీయుల్లో అత్యధిక శాతం గుండె పోటు, ఇతర హృదయ సంబంధిత సమస్యల కారణంగా మరణిస్తున్నారు. ఎత్తుపై నుంచి పడిపోవడం, నీటిలో మునిగిపోవడం, ఆత్మహత్యయత్నాలు, స్ట్రోక్, అంటువ్యాధులు వల్ల కూడా గల్ఫ్ దేశాల్లోని అనేక భారతీయులు మృత్యువాత పడుతున్నారు. జీవన శైలి, కఠినమైన పనివాతావరణం కారణంగానే కువైత్‌లోని అనేక మంది భారతీయులు మరణిస్తున్నట్టు అక్కడి భారతీయు ఎంబసీ పేర్కొంది. శారీరక, మానిసిక ఒత్తిళ్లకు, వైద్య చికిత్సలు, జాగ్రత్తల పట్ల అవగాహన లేమి కూడా తోడై భారతీయుల్లో మరణాలకు దారి తీస్తోందని అక్కడి ఎన్నారైల్లో కొందరు అభిప్రాయపడ్డారు.

Read more