విమాన టికెట్ల ధరల పరిమితిపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-08-11T13:12:58+05:30 IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ విమానయాన చార్జీలపై విధించిన కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఆగస్టు 31వ తేదీ నుంచి తొలగిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

విమాన టికెట్ల ధరల పరిమితిపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన

ఆగస్టు 31 నుంచి అమలు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ విమానయాన చార్జీలపై విధించిన కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఆగస్టు 31వ తేదీ నుంచి తొలగిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 27 నెలల విరామం అనంతరం తాజా పరిస్థితిని సమీక్షించి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో విధించిన రెండు నెలల లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం విమాన సర్వీసులను 2020 మే 25న పునరుద్ధరించిన సమయంలో విమానయాన ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు విధించారు. ఆ నిర్ణయం ప్రకారం 40 నిమిషాల కన్నా తక్కువ ప్రయాణ దూరం ఉండే ప్రాంతాలకు కనిష్ఠ ధర రూ.2,900, గరిష్ఠ ధర రూ.8,800 మించి వసూలు చేయరాదని ఆ శాఖ ప్రకటించింది. ఆర్థికంగా బలహీన వర్గాలను కాపాడేందుకు ధరలపై కనిష్ఠ పరిమితి, అధిక ధరల నుంచి కాపాడేందుకు గరిష్ఠ పరిమితి ఉపయోగపడ్డాయి. 


‘‘రోజువారీ డిమాండును, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఆగస్టు 31 నుంచి ఈ పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించాం’’ అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక ట్విట్టర్‌ సందేశంలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయ విపణిలోను, దేశీయ విపణిలోను ఏటీఎఫ్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. అవి పతాక స్థాయిలకు చేరిన అనంతరం గత కొద్దివారాలుగా తగ్గుముఖం పట్టాయి. విమాన సర్వీసులకు డిమాండ్‌ సాధారణ స్థితికి రావడంతో ధరలపై పరిమితులు ఎత్తివేసినప్పటికీ విమానయాన సంస్థలు కరోనా సంబంధిత నియమావళిని, కరోనా వాప్తి నిరోధక చర్యలను కఠినంగా పాటించాల్సిందేనని పౌర విమానయాన శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

Updated Date - 2022-08-11T13:12:58+05:30 IST