Britain pm elections: రిషి సునాక్ కోసం ప్రవాసీ భారతీయుల హోమం..!
ABN , First Publish Date - 2022-08-10T05:00:08+05:30 IST
బ్రిటన్ ప్రధాని పదవి(Britain pm elections) కోసం పోటీపడుతున్న రిషి సునాక్(Rishi Sunak) గెలుపు కోసం బ్రిటన్లోని కొందరు ప్రవాసీ భారతీయులు తాజాగా హోమం జరిపించారు.

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని పదవి(Britain pm elections) కోసం పోటీపడుతున్న రిషి సునాక్(Rishi Sunak) గెలుపు కోసం బ్రిటన్లోని కొందరు ప్రవాసీ భారతీయులు తాజాగా హోమం జరిపించారు. ఆయన సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ భగవంతుడిని ప్రార్థించారు. అయితే..సునాక్ సాటి భారత సంతతి వ్యక్తి అన్న కారణంతో ఈ హోమం చేయలేదని నిర్వహకులు తెలిపారు. ఆర్థిక సమస్యల నుంచి బ్రిటన్ను బయటపడేయగలిగిన వ్యక్తిగా ఆయన కోసం ఈ క్రతువు నిర్వహించామన్నారు. బ్రిటన్ ప్రజానీకంతో మమేకమవుతూ దేశ అభ్యున్నతి కూడా తోడ్పాటునందిస్తున్నామని భారత సంతతి వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక.. రిషి తన సమస్యలను హుందాగా ఎదుర్కొన్నారని, ఎన్నికల రేసులో ఉన్నవారిలో ఆయన మెరుగైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. బ్రిటన్లో జీవన వ్యయాలను తగ్గించగల నేర్పు రిషి సొంతమని మరో భారత సంతతి వ్యక్తి చెప్పారు.
మరోవైపు.. బ్రిటన్లోని రిపబ్లిక్ హిందూ కొయెలిషన్ రిషికి మద్దతుగా నిలిచింది. అయితే..రిషి హిందూ అయినందుకే తాము మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. తమ విలువలకు కట్టుబడిన వ్యక్తిగా సునాక్కు మద్దతు ఇస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రిషి ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్(Lizz Truss) రేసులో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే..తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా మద్దతు లభిస్తోందని రిషి, ఆయన బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు.