Mahzooz draw: అదృష్టం అంటే ఇదేనేమో.. దుబాయ్‌లో కార్ వాషర్గా పనిచేసే ఇతడికి.. ఏకంగా రూ.28కోట్ల జాక్‌పాట్!
ABN , First Publish Date - 2022-09-22T14:15:03+05:30 IST
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కానీ అది వచ్చిందంటే మాత్రం అప్పటి వరకు ఉన్న దరిద్రాలన్నీ కొట్టుకుపోతాయి.

దుబాయ్: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కానీ అది వచ్చిందంటే మాత్రం అప్పటి వరకు ఉన్న దరిద్రాలన్నీ కొట్టుకుపోతాయి. కూటికి గతిలేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అదృష్టం అంటే అదే మరి. కాగా ఈ అదృష్టాన్ని చాలా మంది నమ్మరు. కానీ ఇప్పుడు మేం చెప్పేది వింటే మాత్రం నిజంగా అదృష్టం అంటే ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు. ఈ నేపాలీ వ్యక్తి విషయంలో అదే జరిగింది. ఉపాధి కోసం దుబాయ్‌లో ఉంటున్న అతడు.. కారు వాషర్గా పని చేస్తుంటాడు. దాంతో అతడికి నెలకు వచ్చే శాలరీ 1300 దిర్హమ్స్(రూ.28వేలు). దాంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గత కొంతకాలంగా మహజూజ్ రాఫెల్లో (Mahzooz draw) పాల్గొంటున్నాడు. ఇప్పుడిదే అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇంకేముంది రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. తాజాగా తీసిన లక్కీ డ్రాలో అతడు ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్(రూ.21.84కోట్లు) గెలుచుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కు చెందిన భరత్ బీకే(31) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ నెలకు 1300 దిర్హమ్ల (రూ.28వేలు) జీతానికి కారు వాషర్గా పని చేస్తున్నాడు. అతడి తమ్ముడు బ్రెయిన్ ట్యూమర్(Brain tumour)తో బాధపడుతున్నాడు. దాంతో సోదరుడి చికిత్స కోసం కావాల్సిన డబ్బు సంపాదనే తన మొదటి లక్ష్యంగా దుబాయ్‌లో కాలు పెట్టాడు. కానీ, అతనికి వచ్చే జీతం స్వదేశంలో ఉన్న కుటుంబ పోషణకే సరిపోయేది. చాలా తక్కువ మొత్తం మాత్రమే మిగిలేది. దాంతో స్నేహితుల సూచన మేరకు గత కొంతకాలంగా మహజూజ్ రాఫెల్లో పాల్గొనడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతడు ఇద్దరు స్నేహితుల కలిసి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అదే టికెట్‌కు తాజాగా నిర్వహించిన లక్కీ డ్రాలో 10 మిలియన్ల దిర్హమ్ల జాక్‌పాట్ తగిలింది. దీంతో భరత్ ఆనందానికి అవధుల్లేవు.
మూడేళ్ల క్రితం దుబాయ్ వచ్చినప్పుడు 25 ఏళ్ల తమ్ముడికి చికిత్స కోసం డబ్బు సంపాదించడమే తన లక్ష్యంగా ఉందన్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన తనకు స్వదేశంలో వచ్చే సంపాదన సరిపోకపోవడంతో దుబాయ్ వచ్చినట్లు తెలిపాడు. కారు వాష్ చేసే పనిచేసే తనకు నెలకు రూ.28వేల వస్తాయని, వాటిలో తన ఖర్చులుపోను.. కొంత మొత్తం స్వదేశంలోని కుటుంబానికి పంపిస్తుంటానని చెప్పాడు. ఇక సోదరుడి చికిత్సకు డబ్బు కూడబెట్టడం గగనంగా తోచిందన్నాడు. దాంతో మిత్రుల సలహా మేరకు గత కొంతకాలంగా మహజూజ్ లాటరీలో పాల్గొంటున్నట్లు తెలిపాడు.
ఈ క్రమంలో ఈ నెల 27న స్వదేశానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్న తాను.. చివరిసారిగా ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇటీవల మళ్లీ రాఫెల్లో పాల్గొన్నట్లు చెప్పాడు. అదే తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందన్నాడు. ఇంత భారీమొత్తం గెలుచుకోవడం ఇంకా కలగానే ఉందన్నాడు. ఇప్పుడు తాను గెలిచిన భారీ నగదుతో సోదరుడికి చికిత్స చేయించడంతో పాటు తన ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు వినియోగించనున్నట్లు తెలిపాడు. ఇక మహజూజ్‌లో భారీ నగదు బహుమతిని గెలుచుకున్న మొదటి నేపాలీ కూడా భరతే. అంతేగాక మహజూజ్ డ్రా హిస్టరీలో అతి తక్కువ సంపాదన కలిగిన విజేతలలో ఒకరు కావడం విశేషం.