భారతీయుల చూపంతా ఆ ఐదు అమెరికా రాష్ట్రాలపైనే...!

ABN , First Publish Date - 2022-06-22T01:35:04+05:30 IST

విదేశీ చదువులంటే భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది అమెరికానే..! అయితే.. అమెరికాలోని ఓ ఐదు రాష్ట్రాల్లోనే భారతీయు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని తాజాగా తేలింది.

భారతీయుల చూపంతా ఆ ఐదు అమెరికా రాష్ట్రాలపైనే...!

ఎన్నారై డెస్క్: విదేశీ చదువులంటే భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది అమెరికానే..! అయితే.. అమెరికాలోని ఓ ఐదు రాష్ట్రాల్లోనే భారతీయు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని తాజాగా తేలింది. అమెరికాలో విదేశీ విద్యార్థులపై ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఇలినాయ్ రాష్ట్రంలో భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ రాష్ట్రంలోని విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ల వాటా ఏకంగా 27 శాతం!  ఆ తరువాతి స్థానంలో టెక్సాస్(22శాతం) ఉంది. ఇక న్యూయార్క్ రాష్ట్రంలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 18 శాతం, కాలిఫోర్నియాలో 13.7 శాతంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ల వాటా దాదాపు 20  శాతం. అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీల్లో.. హార్వర్డ్,  ఎమ్‌ఐటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కార్నెల్ యూనివర్శిటీ, యూటీ ఆస్టిన్, యూనివర్శిటీ ఆఫ్ చికాగో, నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ పట్ల ఇండియన్ విద్యార్థులు అధిక ఆసక్తి కనబరుస్తున్నారు. సర్వే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కాలిఫోర్నియా:  ఈ రాష్ట్రంలో మొత్తం భారతీయ విద్యార్థుల సంఖ్య 18,180కిపైనే..! అయితే..రాష్ట్రంలోని విదేశీ విద్యార్థుల్లో చైనీయుల వాటానే అత్యధికం. యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లాస్ ఏంజిలిస్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాండియేగో, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా-బెర్క్‌లీ..రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలుగా పేరు పొందాయి. విదేశీ విద్యార్థుల ద్వారా కాలిఫోర్నియాకు 2020-21 సంవత్సరంలో 4.83 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 


టెక్సాస్: ఇక్కడ మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 67,428. ఇందులో భారతీయుల వాటా 21.8 శాతం కాగా.. చైనీయుల వాటా 18.9 శాతం. యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, యూటీ ఆస్టిన్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్-ఆర్లింగ్టన్‌లలో భారతీయ విద్యార్థులు అధిక సంఖ్యలో చదువుతున్నారు. 


న్యూయార్క్: ఈ రాష్ట్రంలో భారతీయ విద్యార్థుల సంఖ్య సుమారు 18,600. రాష్ట్రంలో మొత్తం 106,894 విదేశీ విద్యార్థులు ఉన్నారు. భారతీయ విద్యార్థులతో పాటూ కెనడా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల వారూ ఇక్కడ చదువుకుంటున్నారు. న్యూయార్క్ యూనివర్శిటీ, కొలంబియా యూనివర్శిటీ, కార్నెల్ యూనివర్శిటీలు రాష్ట్రంలోని టాప్ విశ్వవిద్యాలయాలుగా పేరు పొందాయి. 


మసాచుసెట్స్: ఇక్కడ సుమారు 66,273 ఉండగా.. వారిలో భారతీయ విద్యార్థులు సుమారు 19.9 శాతంగా ఉన్నారు. ప్రపంచస్థాయిలో పేరు పొందిన హార్వర్డ్, ఎమ్‌ఐటీ యూనివర్శిటీలు ఈ రాష్ట్రంలోనివే! ఇక బోస్టన్ యూనివర్శిటీ, బోస్టన్ కాలేజ్, నార్త్ ఈస్ట్రెన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ ఆమ్‌హెర్స్ట్‌ల్లోనూ విదేశీ విద్యార్థులు అధిక సంఖ్యలో చదువుకుంటుంటారు. 


ఇల్లినాయ్: ఈ రాష్ట్రంలో విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు  44,000 కాగా.. వారిలో భారతీయుల వాటా 27.4 శాతం. యూనివర్శిటీ ఆఫ్ చికాగో, నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీల్లో చేరేందుకు భారతీయులు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అన్నట్టు.. యూనివర్శిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్‌ ఆఫ్  మేనేజ్‌మెంట్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఫైనాన్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.  వీటితో పాటూ అరిజోనా రాష్ట్రంలోనూ భారతీయ విద్యార్థులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 21 వేలకు పైగా ఉంటే..అందులో భారతీయుల వాటా దాదాపు 32 శాతం. 

Updated Date - 2022-06-22T01:35:04+05:30 IST