Green Card-Fraud: బిజినెస్‌మ్యాన్‌కు భారీ షాక్.. కూతురికి అమెరికా గ్రీన్ కార్డు వస్తుందంటే నమ్మి..

ABN , First Publish Date - 2022-09-17T22:06:59+05:30 IST

అమెరికాలో ఉద్యోగం, గ్రీన్‌కార్డు పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, నిబంధనలపై అవగాహన ఎంతో ముఖ్యం. లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకుపోక తప్పదు.

Green Card-Fraud: బిజినెస్‌మ్యాన్‌కు భారీ షాక్.. కూతురికి అమెరికా గ్రీన్ కార్డు వస్తుందంటే నమ్మి..

ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA) ఉద్యోగం, గ్రీన్‌కార్డు(Green Card) పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, నిబంధనలపై అవగాహన ఎంతో ముఖ్యం. లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకుపోక తప్పదు. కూతురికి అమెరికాలో ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నించిన ఓ ముంబై వ్యాపారి చివరకు భారీగా నష్టపోవాల్సి(Fraud) వచ్చింది. నేరగాళ్ల మాయలోపడి ఆయన ఏకంగా రూ.8.33 కోట్లు నష్టపోయారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..


జయేష్ ఠాకూర్ అనే వ్యాపారి ఘట్కోపర్ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఆయన కుమార్తె శ్రియా 2015లో అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తండ్రీకూతుళ్లు వివిధ జాబ్ పోర్టల్‌లలో శ్రియ రెజ్యూమేను అప్‌లోడ్ చేశారు. ఈ క్రమంలో వారికి ఓ వెబ్‌సైట్ ద్వారా జై షా, నిషా దుసారా పరిచయమయ్యారు. అనంతరం వారందరూ ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. అమెరికాలో తమకు చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయని జై, నిషా చెప్పుకొచ్చారు. తమ పలుకుబడిని ఉపయోగించి శ్రియాకు జాబ్‌, వర్క్ పర్మిట్ ఇప్పిస్తామని బుకాయించారు. అంతేకాకుండా.. గ్రీన్‌కార్డు కూడా తెచ్చిపెడతామంటూ  నమ్మకంగా చెప్పారు. 


ఇక ఆ తరువాత..అమెరికాలో ఉద్యోగం పేరుతో బాధితుడి నుంచి విడతల వారీగా 8.33 కోట్లు దండుకున్నారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు చెల్లించినా తన కూతురికి అమెరికాలో ఉద్యోగం రాకపోవడంతో.. జయేష్ తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని వారిని డిమాండ్ చేశారు. ఇందుకు అంగీకరించినట్టు నటించిన నిందితులు ఆయనను మోసగించేందుకు నకిలీ చెల్లింపుల రసీదులు, బ్యాంకు స్టేట్‌ మెంట్‌లను చూపించారు. వారి నుంచి డబ్బు వెనక్కు తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయిన బాధితుడు గురువారం తిలక్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. జయేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. జై షా, నిషాలపై సెక్షన్ 420తో పాటూ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు లభించాయని, త్వరలో బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 

Updated Date - 2022-09-17T22:06:59+05:30 IST