హాంగ్‌కాంగ్‌లో వైభవంగా దసరా - సద్దుల బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-10-05T21:57:32+05:30 IST

హాంగ్‌కాంగ్‌లో వైభవంగా దసరా - సద్దుల బతుకమ్మ సంబరాలు

హాంగ్‌కాంగ్‌లో వైభవంగా దసరా - సద్దుల బతుకమ్మ సంబరాలు
హాంగ్‌కాంగ్‌లో దసరా, సద్దుల బతుకమ్మ వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎంతో ఇష్టంగా ఎదురుచూసే  పండుగ దసరా శరన్నవరాత్రులు. ఈ వేడుకల్లో భాగంగా జరిగే లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలు, గర్భాలు, దాండియా ఆటలతో పాటు బతుకమ్మ సంబరాలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రులు - దసరా(విజయ దశమి), బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు. 


శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటూ , ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, ఎవరిoటీలో వారు లలితా పారాయణం చేస్తారంటూ, ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేద్యం పెట్టాలి.. వంటి వివరాలతో ఒక పట్టికను హాంగ్ కాంగ్ లాంటావ ద్వీపంలోని తుంగ చుంగ్ 'లలిత సహస్రనామం చాంటింగ్ గ్రూప్' తయారు చేస్తారు. ఆ ప్రకారంగా వారు ప్రతి ఇంటా ఘనంగా అమ్మవారిని అందంగా అలంకరించి, మనసారా కొలిచి, అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు పెడతారు. విచ్చేసిన ఆడపడుచులందరు పారాయణానికి వెళ్తూ, పూలు పండ్లే కాకుండా వారి శక్తికొలది ఒక డొనేషన్ బాక్స్‌లో ధనాన్ని వేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఆ డబ్బులని మన దక్షిణ రాష్ట్రాలలోని ఏదైనా ఒకటి రెండు వృద్ధాశ్రమాలకు లేదా అనాధ పిల్లల ఆశ్రమానికి విరాళంగా ఇస్తారు. ఈ గ్రూప్‌ను ప్రారంభించిన శ్రీమతి సంధ్య గోపాల్ మాట్లాడుతూ ఇలా తామందరు కలసి మానవ సేవ - మాధవ సేవ చేసుకోగల్గుతున్నందుకు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తోందని అన్నారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. అంటే బెంగాలీ వారు దుర్గాష్టమి నాడు ఘనంగా వేడుక చేసుకున్నట్లు, తెలుగింటి ఆడపడుచులు సద్దులబతుకమ్మ వేడుకలు జరుపుకొంటారు. 


ఈ శుభకృత నామ సంవత్సరం, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆడపడుచులు, స్థానికంగా ఉన్న కఠినమైన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎంతో ఉత్సాహంగా సద్దుల అమ్మవారిని ఆరాధించి బతుకమ్మ ఆడారని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తెలిపారు. తమ సమాఖ్య మహిళా విభాగం "సఖియా" సంయుక్త కార్యదర్శి కొండ నాగ మాధురి, జెఖ అశ్విని రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి రమాదేవి సారంగా, హర్షిణీ పచ్ఛంటి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారని తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సద్దుల బతుకమ్మ పండుగ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్‌లో బతుకమ్మ సంబరాలు ఎంతో వైభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం తనకి మరింత ఉత్సాహాన్నిచ్చిందని, తన బంధు మిత్రులతో కలిసి ఆనందంగా బతుకమ్మ ఆడారని, అందమైన బొమ్మల కొలువులు చూశానని, లలిత దేవి పారాయణం - పేరంటాలకి వెళ్లానని చెప్పారు. చాలా కాలం తరువాత హైద్రాబాద్‌లో ఈ పండుగ చేసుకోవడం ఒక మరపురాని మధుర జ్ఞాపకంగా ఉంటుందని ఆనందoగా తెలిపారు. త్వరలో తమ సమాఖ్య దీపావళి వేడుకలని ఘనంగా చేసే ఏర్పాట్లు చేస్తోందని సంతోషంగా ప్రకటించారు.

Read more