ఇంగ్లండ్‌లో ఆలయంపై దాడి.. 3 వేల మందితో దుర్గాభవన్‌ ముట్టడి

ABN , First Publish Date - 2022-09-22T12:59:39+05:30 IST

పరమశక్తి పీఠం, వాత్సల్యగ్రామ్‌ వ్యవస్థాపకురాలు సాధ్విరితంభర పర్యటనకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు చెందిన హిందూ వ్యతిరేక గ్రూపులు మంగళవారం బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో హిందూ ఆలయం (దుర్గాభవన్‌)పై దాడికి పాల్పడ్డాయి.

ఇంగ్లండ్‌లో ఆలయంపై దాడి.. 3 వేల మందితో దుర్గాభవన్‌ ముట్టడి

పాక్‌ హిందూ వ్యతిరేక గ్రూపుల దుశ్చర్య

లండన్‌, సెప్టెంబరు 21: పరమశక్తి పీఠం, వాత్సల్యగ్రామ్‌ వ్యవస్థాపకురాలు సాధ్విరితంభర పర్యటనకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు చెందిన హిందూ వ్యతిరేక గ్రూపులు మంగళవారం బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో హిందూ ఆలయం (దుర్గాభవన్‌)పై దాడికి పాల్పడ్డాయి. సుమారు 3 వేల మందితో చుట్టుముట్టి ఆలయంలోకి నీళ్ల బాటిళ్లు విసిరారు. టపాసులు కాల్చి విసిరారు. సాధ్వి రితంభర ముస్లిం వ్యతిరేకి అని, బాబ్రీ మసీదు కూల్చివేతలో ప్రధాన పాత్రధారి అని నిందించారు. ఆలయ సిబ్బందిని దుర్భాషలాడారు. ఆమె పర్యటనను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘అప్నా ముస్లిమ్స్‌’ అనే సంస్థ శాంతియుత ఆందోళనకు పిలుపునివ్వగా, భారీగా ఆందోళనకారులు చేరుకోవడంతో హింసాత్మకంగా మారింది. లండన్‌లోని పాకిస్థాన్‌ ఐఎ్‌సఐ అధికారుల ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లు ఓ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ పేర్కొంది. 


సాధ్వి బుధవారం ఇంగ్లండ్‌కు రావాల్సి ఉండగా, ముందే ఆమె పర్యటన రద్దైందని అధికారులు చెప్పినప్పటికీ, ఆందోళనకారులు వినిపించుకోలేదు. కాగా, గతనెల 28న భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా లీసెష్టర్‌ షైర్‌లో మతఘర్షణలు జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఘర్షణలను హిందూ, ముస్లింల నేతలు ఖండించిన తర్వాతి రోజే తాజాగా దుర్గాభవన్‌పై దాడి జరగడం గమనార్హం. లీసెష్టర్‌షైర్‌లో ఓ మసీదు ఎదుట సమావేశమైన ఇరుమతాల నేతలు హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మరోవైపు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నామని లీసెష్టర్‌షైర్‌ పోలీసులు ప్రకటించారు. ఘర్షణల నేపథ్యంలో హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ బుధవారం బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌కు లేఖ రాశారు. హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నా, అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు. 

Read more