పనిమనిషిపై వేధింపులు.. అరబ్ యజమానికి 15ఏళ్ల జైలు.. దేశ బహిష్కరణ!

ABN , First Publish Date - 2022-03-13T17:58:52+05:30 IST

పనిమనిషిపై వేధింపులకు పాల్పడి ఆమె మృతికి కారణమైన అరబ్ యజమానికి దుబాయ్ న్యాయస్థానం తాజాగా 15ఏళ్ల జైలు శిక్ష విధించింది.

పనిమనిషిపై వేధింపులు.. అరబ్ యజమానికి 15ఏళ్ల జైలు.. దేశ బహిష్కరణ!

దుబాయ్: పనిమనిషిపై వేధింపులకు పాల్పడి ఆమె మృతికి కారణమైన అరబ్ యజమానికి దుబాయ్ న్యాయస్థానం తాజాగా 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు తన వద్ద పని చేసిన ఆసియాకు చెందిన మహిళను ఓ గదిలో నిర్బంధించాడు. అనంతరం ఆమెను చనిపోయేవరకు శారీరకంగా హింసించాడు. ఇష్టానుసారంగా కొట్టడం, ఆహారం ఇవ్వకపోవడంతో పనిమనిషి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. దాంతో 2020 సెప్టెంబర్‌లో సదరు యజమాని ఆమెను దుబాయ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. 


తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత ఆమె ఆస్పత్రిలోనే చనిపోయింది. పోస్టుమార్టంలో తీవ్రంగా హింసించడం వల్ల ఏర్పడిన గాయాలతోనే ఆమె చనిపోయినట్లు వచ్చింది. దాంతో పోలీసులు యజమానిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. మొదట న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది. తాజాగా ఆ శిక్షను దుబాయ్ కోర్టు 15ఏళ్లకు తగ్గించింది. అలాగే శిక్షకాలం పూర్తికాగానే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని అరబ్ యజమానిని ఆదేశించింది. 

Updated Date - 2022-03-13T17:58:52+05:30 IST