అన్యాయంగా నా భర్తను ఉరేసి చంపారు.. శవాన్ని అయినా చూపిస్తారా లేదా!
ABN , First Publish Date - 2022-03-18T14:36:08+05:30 IST
‘‘బిడ్డలను బాగా చదివించుకుందామని చెప్పి నన్నూ కువైట్ తీసుకుపోయావు. కనీసం మూడు సంవత్సరాలు కూడా ఉండలా. నన్ను ఒక్కదాన్నే ఇంటికి పంపించావా.. నేను ఇంటికి రాగానే చావు కబురు పంపించావా... నువ్వు అక్కడే ఉండిపోయావా స్వామి.. ఇక నా బిడ్డలకు నాకు దిక్కెవరు.. నేను ఎలా బతకాలి..

నాకు, నా పిల్లలకు దిక్కెవరు
వెంకటేశ్ భార్య ఆవేదన
భౌతికకాయం కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
కడప, మార్చి17: ‘‘బిడ్డలను బాగా చదివించుకుందామని చెప్పి నన్నూ కువైట్ తీసుకుపోయావు. కనీసం మూడు సంవత్సరాలు కూడా ఉండలా. నన్ను ఒక్కదాన్నే ఇంటికి పంపించావా.. నేను ఇంటికి రాగానే చావు కబురు పంపించావా... నువ్వు అక్కడే ఉండిపోయావా స్వామి.. ఇక నా బిడ్డలకు నాకు దిక్కెవరు.. నేను ఎలా బతకాలి.. నిన్ను ఇండియాకు రప్పించాలని పోలీసులను, అధికారులు వేడుకున్నా.. చివరకు నా భర్త శవాన్ని పంపిస్తున్నారు. మోడీ సారూ... జగన్సారూ.. ఎవరిని వేడుకొన్నా ఫలితం లేకపోయింది.. నా భర్తను అన్యాయంగా ఉరివేసి చంపేశారు. అందరూ కలసి నాకూ, నా బిడ్డలకు అన్యాయం చేశారు.. చివరకు నా భర్త శవాన్ని అయినా చూపిస్తారా లేదా’’ అంటూ వెంకటేశ్ భార్య స్వాతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కువైత్‌లో ముగ్గురిని హత్య చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేశ్ అక్కడి జైలులో ఉరివేసుకున్నాడని సమాచారం అందింది. దీంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాలు ఇలా..
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన శ్రీరాములు, రవణమ్మకు కొడుకు పిల్ల వెంకటేశ్(35), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. వెంకటేశ్, స్వాతి దంపతులకు జయవర్ధన్ (5), విష్ణువర్ధన్ (3) కొడుకులున్నారు. వెంకటేశ్ మూడు సంవత్సరాల క్రితం బతుకు దెరువుకోసం కువైత్ వెళ్లాడు. అక్కడ డ్రైవర్‌గా పని చేసుకుంటూ నెలనెలా ఇంటికి డబ్బు పంపించేవాడు. పిల్లలను బాగా చదివించాలని తన భార్య స్వాతిని కూడా రెండేళ్ల క్రితం కువైత్ రప్పించుకున్నాడు. ఇద్దరూ వేర్వేరు ఇంట్లో ఉంటూ నెల నెలా వచ్చే డబ్బును ఇంటికి పంపిస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం తనకు ఆశ్రయం ఇచ్చిన సేఠ్‌ను, ఆయన భార్య, కుమార్తెను వెంకటేశ్ కత్తితో గొంతుకోసి చంపాడని ఈ నెల 8వ తేదీన సోషల్ మీడియాలో వచ్చింది. ఈ మేరకు అతని తల్లిదండ్రులకు సైతం అక్కడి పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. ఈ ఘటన వెలుగుచూసిన వారం రోజులకే వెంకటేశ్ భార్య స్వాతి (30)స్వస్థలానికి చేరుకున్నారు.
హత్యలు జరిగిన మూడు రోజులకు తన భర్తను అక్కడి పోలీసులు అరెస్టు చేశారని, తన భర్త నిర్దోషి అని, అతనికి ఒక కాలు విరిగిందని, ఎలా ముగ్గురిని హత్య చేయగలడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు గురైన సేఠ్‌కు అతని అన్నదమ్ములకు ఆస్థి గొడవలున్నాయని, వారే హత్యలు చేసి తన భర్తను ఇరికించారని అన్నారు. ఈమేరకు ఈ నెల 11వ తేదీన కలెక్టర్ వి.విజయరామరాజును, జాయింట్ కలెక్టర్ గౌతమిని కలసి తన భర్తను కాపాడాలంటూ ఆమె వేడుకున్నారు. తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలంటూ జేసీ గౌతమి కాళ్లు పట్టుకుని మరీ అడుక్కున్నారు. నిజంగా తన భర్తే దోషి అయితే కువైత్ అధికారులు తనను ఇండియాకు పంపించేవారు కారని అన్నారు. అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తిరిగి స్వాతి 14వ తేదీన స్పందన కార్యక్రమంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌ను కలసి తన భర్తను తప్పుడు కేసులో ఇరికించారని, అతడికి ప్రాణభిక్ష పెట్టాలని ఆమె విన్నవించారు. ఈ నేపథ్యంలో కువైత్‌లోని సెంట్రల్ జైలులో ఉన్న వెంకటేశ్ బుధవారం తెల్లవారుజామున రెండువరుసల మంచానికి గుడ్డతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ అక్కడి అధికారులు గురువారం స్వాతికి సమాచారం పంపారు. దీంతో ఆమె కుప్పకూలిపోయారు. తనకూ తన బిడ్డలకు దిక్కెవరంటూ విలపిస్తున్నారు. కనీసం తన భర్త కడచూపు అయినా లభిస్తుందో లేదోనంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. తన భర్త భౌతిక కాయాన్ని ఎలాగైనా ఇండియాకు రప్పించేలా అఽధికారులు సహకరించాలని వేడుకుంటున్నారు. వెంకటేశ్ మరణవార్త వినగానే దిన్నెపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.