USA: ఏ టీచర్ అయినా ఇలా అంటారా.. అందుకే ఈ గతి పట్టింది..

ABN , First Publish Date - 2022-11-19T18:57:56+05:30 IST

విద్యార్థులకు మంచిచెడు విడమరిచి చెప్పాల్సిన ఓ టీచర్ పద్ధతి తప్పి ప్రవర్తించి చివరకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

USA: ఏ టీచర్ అయినా ఇలా అంటారా.. అందుకే ఈ గతి పట్టింది..

టెక్సాస్: విద్యార్థులకు మంచిచెడు విడమరిచి చెప్పాల్సిన ఓ టీచర్ పద్ధతి తప్పి ప్రవర్తించి చివరకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. క్లాసులోని ఓ విద్యార్థి.. ఆయన తీరును ఫోనులో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో సదరు టీచర్ బండారం మొత్తం బయటపడింది. అమెరికాలో(USA) టెక్సాస్(Texas) రాష్ట్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బోల్స్ మిడిల్ స్కూల్‌లో(Bohls Middle School) శ్వేతజాతీయుడైన ఓ టీచర్(White Teacher) కొద్ది రోజుల క్రితం విద్యార్థులతో చర్చ మొదలెట్టారు. ఈ క్రమంలోనే జాత్యాహకారం(Racism) ప్రస్తావన వచ్చింది . ఈ క్రమంలో దీనిపై..ఆ టీచర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మిగతావారికంటే తెల్లవారే కాస్తంత గొప్పవారని తాను నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు. దీన్ని ఎథ్నోసెంట్రిక్ అని అంటారని వివరించిన ఆయన.. ప్రపంచంలో ఎవరైనా సరే తమ వర్గం గురించి ఇలాగే ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు. తాను జాత్యాహంకారిని కానని స్పష్టం చేసిన ఆయన తన వర్గం ప్రత్యేకమైనదని మాత్రం భావిస్తానని ఏదో సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

అయితే.. ఆయన మాటలు విన్న నల్ల జాతి విద్యార్థులు కొందరు ఒక్కసారిగా షాకైపోయారు. ఆయన తీరును పూర్తిగా ఖండించారు. అన్ని జాతులు సమానమని తాము భావిస్తామని విద్యార్థుల్లో కొందరు ఖరాఖండీగా చెప్పేశారు. మీరంటే ఇప్పటివరకూ గౌరవం ఉండేది. ఇప్పుడు అదంతా పోయింది అని మరో స్టూడెంట్ ఘాటుగా విమర్శించాడు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో.. తల్లిదండ్రుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. విషయం జిల్లా విద్యాధికారుల దృష్టికి వెళ్లడంతో నవంబర్ 14న ఆ టీచర్‌ను విధుల నుంచి తొలగించారు(Suspension). అనంతరం.. విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. అతడి తీరు తమ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు.

Updated Date - 2022-11-19T18:58:11+05:30 IST