వామ్మో.. ఇది అమెరికాలో ఉన్నట్టు లేదు.. పెళ్లి ఊరేగింపుతో న్యూయార్క్ రోడ్లు బ్లాక్ చేసిన ఎన్నారైలు..!

ABN , First Publish Date - 2022-10-22T19:43:29+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌ విధుల్లో ఓ పెళ్లి ఊరేగింపు సందర్భంగా భారతీయ అమెరికన్లు చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వామ్మో.. ఇది అమెరికాలో ఉన్నట్టు లేదు.. పెళ్లి ఊరేగింపుతో న్యూయార్క్ రోడ్లు బ్లాక్ చేసిన ఎన్నారైలు..!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌ విధుల్లో ఓ పెళ్లి ఊరేగింపు సందర్భంగా భారతీయ అమెరికన్లు చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికా అయినా.. అమీర్‌పేట్ అయినా తగ్గేదేలే అన్నట్టుగా మనోళ్లు ఆ వివాహ ఊరేగింపు సందర్భంగా చేసిన హంగామాతో ఏకంగా న్యూయార్క్ నగర రోడ్లు బ్లాక్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మాజీ యూఎస్ కాంగ్రెస్ అభ్యర్థి సురజ్ పటేల్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం పేజీలో షేర్ చేశారు. తన సోదరుడి పెళ్లి సందర్భంగా తీసిన వీడియోగా సూరజ్ పేర్కొన్నాడు. "మా కుటుంబ సభ్యులందరినీ ఇలా ఒకే దగ్గర, అదీ ఇంత ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా ఉండడం చూసి నా మనసు నిండిపోయింది. నా సంతోషాన్ని తెలియజేసేందుకు మాటలు రావడం లేదు. నా సోదరుడి పెళ్లి వేడుక దీనికి వేదికైంది. న్యూయార్క్ వీధుల్లో ఇలా ఊరేగింపు నిర్వహించడంతో మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. కొద్దిసేపు న్యూయార్ వీధుల రోడ్లు బ్లాక్ అయ్యాయి. మీరే చూడండి" అంటూ సూరజ్ వీడియోను పోస్ట్ చేశారు.

ఇక ఈ ఊరేగింపులో చాలామంది పింక్ కలర్ తలపాగతో సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. పంజాబీ పాటలపై దేశీ స్టేప్పులతో హోరెత్తించారు. ఈ ఊరేగింపు జరిగిన కొద్దిసేపు న్యూయార్ వీధులు పెళ్లివారి కోలహాలంతో నిండిపోయాయి. ఒక్క నిమిషం మనం అమెరికాలో ఉన్నామా? లేక ఇండియాలో ఉన్నామా? అనిపించేలా ఈ పెళ్లి ఊరేగింపు కొనసాగినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'మనీ పవర్' అని ఒకరంటే.. 'ఏదైమైనా ఇది గర్వించాల్సిన విషయమని' మరోకరు కామెంట్ చేశారు. 'ఎందుకు మీరు మీ ఊరేగింపు కారణంగా రోడ్లు బ్లాక్ చేసి ప్రజలను అసౌకర్యానికి గురి చేశారు?' అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు.

Updated Date - 2022-10-22T19:43:31+05:30 IST