Elon Musk: సెలబ్రిటీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మస్క్..

ABN , First Publish Date - 2022-12-02T18:39:08+05:30 IST

ప్రముఖ అమెరికా ర్యాపర్ యేకు(కాన్యే వెస్ట్‌) ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ దిమ్మతిరిగే షాకిచ్చారు. ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు యే అకౌంట్‌పై నిషేధం విధించారు.

Elon Musk: సెలబ్రిటీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మస్క్..

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ అమెరికా ర్యాపర్ యేకు(కాన్యే వెస్ట్‌‌- Kanye West) ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) దిమ్మతిరిగే షాకిచ్చారు. హింసను ప్రేరేపించే వ్యాఖ్యలతో ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ యే అకౌంట్‌ను సస్పెండ్( Account Suspended) చేశారు. మస్క్ చేతుల్లోకి ట్విటర్ చేరకమునుపు.. ఓమారు నిషేధానికి గురైన యే అకౌంట్‌ను రెండు నెలల క్రితమే పునరుద్ధరించారు. మస్క్ అప్పట్లో ఈ చర్యను స్వాగతించారు. ఇంతలోనే అతడు కట్టుతప్పాడంటూ ఎకౌంట్‌ను సస్పెండ్ చేశాడు.

నిషేధానికి మూలం ఇదీ..

అమెరికా ర్యాపర్ యే చేసే వ్యాఖ్యలు తరచూ వివాదానికి దారితీస్తుంటాయి. అతడు తన ర్యాప్ పాటలకంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతుంటాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలనేది అతడి కోరిక. ఇదిలా ఉంటే.. జర్మనీ నియంత హిట్లర్‌ పట్ల యే ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యే మాట్లాడుతూ హిట్లర్‌ను పొగిడాడు. ‘‘హిట్లర్‌లో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అతడు జాతీయ రహదారులను నిర్మించాడు. నేను వాడే మైక్రోఫోన్ కూడా అతడు కనిపెట్టిందే. కానీ..హిట్లర్ చేసిన మంచి గురించి బహిరంగంగా మాట్లాడే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఈ ధోరణి భరించడం ఇకపై నా వల్లకాదు. ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది. హిట్లర్‌లో కూడా..’’ అని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగక హిట్లర్ అంటే నాకు ఇష్టమంటూ ఓ సంచలన స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు.

1.jpg

జర్మనీ నియంత హిట్లర్(Hitler) యూదులపై ద్వేషంతో రగిలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జర్మనీ నాజీ సైన్యం చేతిలో రెండో ప్రపంచయుద్ధ సమయంలో యూదులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6 మిలియన్ల మంది యూదులను హిట్లర్ పొట్టనపెట్టుకుని ఉంటాడని అనేక మంది విశ్వాసం. అయితే.. వాస్తవ సంఖ్య అంతకంటే తక్కువే ఉండొచ్చంటూ యే చేసిన వ్యాఖ్యలూ తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో యే..తాజాగా ట్విటర్‌లో తన రాజకీయ పార్టీకి చెందిన గుర్తును ట్వీట్ చేశాడు. హిట్లర్ నాజీ పార్టీకి చెందిన హాకెన్‌క్రజ్‌‌ను గుర్తును(స్వస్తికాను పోలి ఉంటుంది) గుర్తుకు తెచ్చే చిత్రాన్ని ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని మస్క్ దృష్టికి తెచ్చిన ఓ నెటిజన్.. యేను ఎలాగైనా బాగు చేయాలని సూచించాడు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. ‘‘అతడిలో మార్పు కోసం ప్రయత్నించా..కానీ మళ్లీ ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించాడు. అకౌంట్ సస్పెండ్ చేస్తాం’’ అని ట్వీట్ చేశాడు. ఆ తరువాత కొద్ది క్షణాలకే యే అకౌంట్‌పై వేటు పడింది.

Updated Date - 2022-12-02T18:39:29+05:30 IST