Elon Musk: మస్క్ ఫొటోలను వేలం వేసిన మాజీ గర్ల్‌ఫ్రెండ్.. ఎంత డబ్బు వచ్చిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-18T23:21:06+05:30 IST

మస్క్ ఫొటోలను వేలం వేసిన మాజీ గర్ల్‌ఫ్రెండ్.. ఎంత డబ్బు వచ్చిందో తెలిస్తే..

Elon Musk: మస్క్ ఫొటోలను వేలం వేసిన మాజీ గర్ల్‌ఫ్రెండ్.. ఎంత డబ్బు వచ్చిందో తెలిస్తే..

ఎన్నారై డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ఏది చేసినా ఓ సంచలనమే. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఎందరో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ ఆసక్తే పెట్టుబడిగా ఆయన మాజీ గర్ల్‌ఫ్రెండ్ జెన్నిఫర్ గ్వెయిన్(Jennifer Gwyne) ఇటీవల రూ. 1.3 కోట్లు సంపాదించింది. అదెలా అంటారా..? కాలేజీ రోజుల్లో మస్క్‌తో డేటింగ్‌ చేస్తున్నప్పటి ఫొటోలు, ఆయనకు సంబంధించిన ఇతర వస్తువులను ఆమె వేలం వేసింది. ఇంకేముంది.. మస్క్ అంటే అభిమానం చూపేవారు వాటిని భారీ ధరకు కొనుగోలు చేశారు. 


మస్క్ ఫొటోలనే కాకుండా.. అప్పట్లో ఆయన  తనకు ఇచ్చిన బహుమతులను కూడా జెన్నిఫర్ అమ్మకానికి పెట్టింది. బోస్టన్‌లోని ఆర్ఆర్ ఆక్షన్ హౌస్ అనే సంస్థ సాయంతో వీటిని వేలం వేసింది. అమ్మకానికి పెట్టిన వస్తువుల్లో.. మస్క్ సంతకం ఉన్న గిఫ్ట్ కార్డు, ఓ గొలుసు ఉన్నాయి. మస్క్, జెన్నిఫర్ కలిసి జంటగా దిగిన ఫొటో 1,765 డాలర్లలకు(రూ.1.40 లక్షలు) అమ్ముడుపోయింది. గిఫ్ట్ కార్డేమో రూ.14 లక్షలకు, గొలుసు రూ.40 లక్షలకు అమ్ముడుపోయాయట. మొత్తం 18 ఫొటోలను వేలం వేసినట్టు జెన్నిఫర్ తెలిపింది. ఈ వేలంపై మస్క్ తనదైన శైలిలో స్పందించారు. ట్విటర్‌లో తన ప్రొఫైల్ పిక్‌ను తొలగించి ఆ స్థానంలో వేలానికి వచ్చిన తన ఫొటోల్లో ఒకదాన్ని పెట్టారు. 


1994లో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో విద్యార్థులుగా ఉన్నప్పుడు మస్క్, జెన్నిఫర్‌ల మనసులు కలిశాయి. అయితే చదువు పూర్తయిన అనంతరం మస్క్ కాలిఫోర్నియాకు వచ్చేశాక ఇద్దరూ విడిపోయారట. ఇక.. మస్క్ రాసిన ఆన్సర్ పేపర్లు వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయిన విషయం తెలుసుకున్నాకే.. తానూ వేలం వేయాలని నిర్ణయించుకున్నట్టు జెన్నిఫర్ చెప్పింది.  వేలంలో వచ్చిన సొమ్మును తన పిల్లల చదువు కోసం ఉపయోగిస్తానని పేర్కొంది. ఇక ట్విటర్‌ను కొనుగోలు చేస్తానన్న మస్క్.. ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడంతో ట్విటర్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ట్విటర్‌ అకౌంట్లలో బాట్స్(Bots) నిర్వహించే అకౌంట్లు ఎన్ని ఉన్నాయనే విషయంలో.. ట్విటర్ తనను తప్పుదోవ పట్టించిందని మస్క్ అప్పట్లో ఆరోపించారు.

Updated Date - 2022-09-18T23:21:06+05:30 IST