Saudi లో ‘Boy Cut’ ట్రెండ్.. మగాళ్ల లాగా జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు.. కారణమేంటని కొందరిని అడిగితే..

ABN , First Publish Date - 2022-06-24T01:29:10+05:30 IST

సౌదీ అరేబియా అంటే ముందుగా గుర్తొచ్చేది చమురు నిల్వలు.. కట్టుబాట్లకు ప్రాధాన్యమిచ్చే సంప్రదాయిక సమాజం! అయితే..ఇప్పుడు అక్కడ కూడా కొత్త పోకడలు దర్శనమిస్తున్నాయి. సౌదీ మహిళలు ప్రస్తుతం అబ్బాయిల్లాగా క్రాఫ్ చేయించుకుంటున్నారు.

Saudi లో ‘Boy Cut’ ట్రెండ్.. మగాళ్ల లాగా జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు.. కారణమేంటని కొందరిని అడిగితే..

ఎన్నారై డెస్క్: సౌదీ అరేబియా అంటే ముందుగా గుర్తొచ్చేది చమురు నిల్వలు.. కట్టుబాట్లకు ప్రాధాన్యమిచ్చే సంప్రదాయిక సమాజం! అయితే..ఇప్పుడు అక్కడ కూడా కొత్త పోకడలు దర్శనమిస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఓ ట్రెండ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది! అదేంటంటే.. సౌదీ మహిళలు ప్రస్తుతం అబ్బాయిల్లాగా క్రాఫ్ చేయించుకుంటున్నారు. బాయ్ కట్‌గా(Boy cut) పేరు పడ్డ ఈ ట్రెండ్ పాపులారిటీ రోజురోజుకూ పెరిగిపోతోంది!  పొట్టి జుట్టుతో ఉన్న మహిళలు అక్కడి వీధుల్లో కనిపించడం ఇప్పుడు ఓ సాధారణ దృశ్యమైపోయింది. ఈ ట్రెండ్‌కు గల కారణమేంటని పరిశీలిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానాలే వినిపిస్తున్నాయి. 


ఒకప్పటి సంప్రదాయిక సంకెళ్ల నుంచి సౌదీ మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇప్పుడు వారు కారు డ్రైవింగ్ చేయవచ్చు. ఉద్యోగాలు చేయవచ్చు. క్రీడలు, మ్యూజిక్ ఈవెంట్లలోనూ పాల్గొనవచ్చు. అంతేకాకుండా.. కుటుంబాల్లోని పురుషుల అనుమతుల అవసరం లేకుండానే విదేశాల్లో పర్యటించవచ్చు. 2030 నాటి కల్లా సౌదీని ఆధునిక ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో సౌదీ అధినేత మహ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలు అక్కడి మహిళలకు స్వేచ్ఛనిస్తున్నాయి. ఇలా తమకు దొరికిన కొద్ది పాటి స్వేచ్ఛతో అక్కడి వనితలు తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి బాయ్ కట్ ట్రెండ్.. 


బాయ్ కట్‌కు ఉపయోగాలెన్నో..

తమను ఇబ్బంది పెట్టే పురుషుల చూపుల నుంచి ఈ హెయిర్ కట్ కాపాడుతుందని ఓ సౌదీ వైద్యురాలు పేర్కొన్నారు. ‘‘మహిళల దుస్తుల్లో స్త్రీత్వం కనిపించాలని ప్రజలు కోరుకుంటారు. కానీ.. పురుషుల అవాంఛిత ఆసక్తి నుంచి ఈ స్టైల్ నన్ను రక్షిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ హెయిర్ కట్ వల్ల తనకు బోలెడంత సమయం ఆదా అవుతోందని మరో మహిళ చెప్పారు. ఆమె స్థానికంగా ఓ దుస్తుల దుకాణం నిర్వహిస్తారు. ‘‘నా జుట్టు పొడవైనదే కాకుండా రింగులు కూడా తిరుగుతుంది. కాబట్టి.. పొద్దున్నే జడేసుకోవడం నాకో ప్రహసనంగా మారింది. చాలా సమయం వృథా అవుతోంది. కానీ.. ఈ హెయిర్ కట్‌తో నాకో పెద్ద సమస్య తీరినట్టు ఉంది ’’ ఆమె చెప్పుకొచ్చారు. 


పురుషులపై ఆధారపడకుండా మహిళలు స్వతంత్రంగా జీవించగలరనే భావనకు ఈ హెయిర్ కట్ చిహ్నమని మరో యువతి రోజ్ చెప్పారు. ‘‘దీని వల్ల నేను మరింత కాన్ఫిడెంట్‌గా ఫీలవుతున్నా. ఇది నాకు మానసిక దృఢత్వాన్ని ఇస్తోంది. మరొకరి సంరక్షణ లేకుండానే నేను స్వతంత్రంగా నా పని చేసుకోగలన్న విశ్వాసం కలిగిస్తోంది.’’ అని రోజ్ చెప్పుకొచ్చారు. ఇదే హెయిర్ స్టయిల్‌తో కనిపించే అక్కడి మహిళా పాప్ స్టార్లు కూడా ఈ ట్రెండ్ పట్ల మహిళల్లో ఆసక్తి పెంచుతున్నారని ఓ హెయిర్ స్టయిలిస్ట్ వ్యాఖ్యానించారు. తన వద్దకు కటింగ్ కోసం వచ్చే ప్రతి 30 మంది కస్టమర్లలో ఎనిమిది మంది ఈ హెయిర్ స్టైల్ కావాలని కోరుకుంటున్నట్టు రియాద్‌లోని ఓ కటింగ్ షాపు యజమాని తెలిపారు. ఇక ఈ ఒరవడి భవిష్యత్తులో మరింతగా పెరుగుతుందని ఫ్యాషన్ రంగ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


అయితే..సౌదీ పూర్తిగా మారిపోయిందా అంటే కాదనేది విశ్లషకుల అభిప్రాయం. తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహిళలను జైళ్లలో పెడుతున్న ఉదంతాలు సౌదీలో అనేకం వెలుగుచూస్తున్నాయని వారు అంటున్నారు. ముఖ్యంగా..సౌదీ అధినేత పట్ల అసమ్మతి నొక్కేయాలనే ఇదంతా జరుగుతోందంటున్నారు. 

Updated Date - 2022-06-24T01:29:10+05:30 IST