ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు.. భయాందోళనల్లో తల్లిదండ్రులు!

ABN , First Publish Date - 2022-02-24T15:16:36+05:30 IST

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో వైద్య విద్య తదితర కోర్సుల కోసం ఆ దేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు.. భయాందోళనల్లో తల్లిదండ్రులు!

స్వదేశానికి తరలించేందుకు విదేశాంగశాఖ కసరత్తు

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో వైద్య విద్య తదితర కోర్సుల కోసం ఆ దేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉక్రెయిన్‌పై తాజాగా రష్యా దాడులకు పాల్పడిన నేపథ్యంలో స్వదేశంలోని వారి కుటుంబాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్లో సుమారు 350 మంది వరకు తెలుగు వారు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దాదాపు 400 వరకు తెలుగు విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులు తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాల్సిందిగా అభ్యర్థనలు అందాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాల్సిందిగా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) పేర్కొంది. 


ఈ మేరకు ఎంఈఏ అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు మాట్లాడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థుల నివాస చిరునామాలకు సంబంధించి తెలంగాణ ఎన్నారై సెల్ అధికారుల నుండి సమాచారాన్ని కూడా కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయని ఎంఈఏ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం భారత్ నుంచి ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులు నడిపిస్తోంది ఒక్క ఎయిరిండియా మాత్రమే. ఇక అక్కడ చిక్కుకుపోయిన మనోళ్లను తరలించేందుకు ఈ నెల 22, 24, 26 తేదీల్లో భారత ప్రభుత్వం మూడు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగానే బుధవారం కొంతమంది భారత విద్యార్థులను అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత్‌ తటస్థంగా వ్యవహరిస్తుండటాన్ని స్వాగతిస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఇదిలాఉంటే.. గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా వార్ మొదలెట్టింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే రష్యా బలగాలు కీవ్‌ విమానాశ్రయాన్ని అక్రమించినట్లు తెలుస్తోంది. అటు రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు తిప్పి కొడుతున్నాయి.     

Updated Date - 2022-02-24T15:16:36+05:30 IST