Kuwaitization: ప్రభుత్వ రంగంలో గడిచిన 5ఏళ్లలో 13వేల మంది ప్రవాసుల తొలగింపు

ABN , First Publish Date - 2022-04-05T13:55:38+05:30 IST

గత కొన్నాళ్లుగా కువైత్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వలసదారుల ప్రాబల్యం అంతకంతకు పెరుగుతుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని భావించిన కువైత్.. 2017లో కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చింది.

Kuwaitization: ప్రభుత్వ రంగంలో గడిచిన 5ఏళ్లలో 13వేల మంది ప్రవాసుల తొలగింపు

కువైత్ సిటీ: గత కొన్నాళ్లుగా కువైత్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వలసదారుల ప్రాబల్యం అంతకంతకు పెరుగుతుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని భావించిన కువైత్.. 2017లో కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా గడిచిన ఐదేళ్లలో వివిధ రంగాల్లోని నియామకాల్లో కువైటీలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. అదే సమయంలో భారీ సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రవాసులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇలా గత 5ఏళ్లలో ప్రభుత్వ రంగానికి చెందిన వివిధ సంస్థలు ఏకంగా 13వేల మంది వలసదారులను తొలగించాయి. ఈ విషయాన్ని సివిల్ సర్వీస్ కమిషన్ తెలియజేసింది. 


దీంతో ఐదేళ్ల ముందు ప్రభుత్వ రంగ సంస్థల్లో 79వేలుగా ఉన్న ప్రవాస ఉద్యోగుల సంఖ్య 66వేలకు పడిపోయింది. ఇక ఉద్వాసనకు గురైన ఉద్యోగుల్లో అత్యధికంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలకు చెందిన వారని సమాచారం. కాగా, 2017లో కువైటైజేషన్‌కు సంబంధించి సివిల్ సర్వీస్ కమిషన్ తీసుకువచ్చిన తీర్మానం నం. 11/2017కు ఈ ఏడాది ఆగస్టుతో ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఈలోపు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని సంస్థలు, కంపెనీలు వీలైనంత ఎక్కువ సంఖ్యలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. అందుకే భారీ సంఖ్యలో ప్రవాసులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇక ఇప్పటికే ప్రైవేట్ రంగంలోనూ అనేక కంపెనీలు భారీ మొత్తంలో వలసదారులను తొలగించాయి.     

Updated Date - 2022-04-05T13:55:38+05:30 IST