48 ఏళ్ల క్రితం నాటి Rajnigandha Movie లో చూపించిందేంటి..? నేటి పరిస్థితులేంటి..? తేడా వస్తే తెంచేస్తున్నారుగా..!

ABN , First Publish Date - 2022-07-16T21:16:52+05:30 IST

ఆడవారిలో పేరుకుపోయిన సర్దుకుపోయేతనం, పిరికితనం, మరో అవకాశం వస్తుందోరాదోననే అనుమానం ఇలా చాలా భయాలమధ్య స్త్రీ నలిగిపోయిన సందర్భాలను కుడా సినిమాలుగా తెరకెక్కించారు.

48 ఏళ్ల క్రితం నాటి Rajnigandha Movie లో చూపించిందేంటి..? నేటి పరిస్థితులేంటి..? తేడా వస్తే తెంచేస్తున్నారుగా..!

ఇద్దరు కలిసి మొదలు పెట్టిన ప్రేమ ప్రయాణాన్ని తేడావస్తే అప్పటికప్పుడు తెంచుకోవడంలో వెనకాడటం లేదు ఇప్పటి అమ్మాయిలు. ఎంచుకున్న భాగస్వామి వాళ్ళ మనస్థత్వానికి సరిపడే వాడు కాదు అనే నిర్ణయానికి రాగానే ఆ బంధంలోంచి ఇట్టే బయటపడుతున్నారు. అమ్మాయిలు వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం లోనూ ఇంతే ఖచ్చితత్వాన్ని పాటిస్తున్నారు. తనకు ఎక్కడ స్వేచ్ఛతో కూడిన ప్రేమ లభిస్తుందో, ఆర్థిక భద్రత ఉంటుందో వారితోనే ఉంటామన్న ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు.


ఒకప్పటి రోజులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. పెద్దలు తెచ్చిన వరుణ్ణి తలవంచుకుని వివాహమాడి అదే జీవితంగా వాళ్లతోడితే ప్రపంచంగా బ్రతికేసిన ఆడవారు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితులకు తగినట్టుగా అప్పట్లో ఎన్నో సినిమాలు వచ్చాయి కూడా.. వాటితో పాటు ఆడవారిలో పేరుకుపోయిన సర్దుకుపోయేతనం, పిరికితనం, మరో అవకాశం వస్తుందోరాదోననే అనుమానం ఇలా చాలా భయాలమధ్య స్త్రీ నలిగిపోయిన సందర్భాలను కుడా సినిమాలుగా తెరకెక్కించారు. ఈ కోవకు చెందిందే 1974లో బసు ఛటర్జీ(Basu Chatterjee) చిత్రించిన రజినీగంధ(Rajinigandha) చిత్రం. అదే ఇప్పటి స్త్రీలు అలా కాదు. ఖచ్చితంగా తమకు ఏం కావాలన్న విషయంలో పూర్తి అవగాహనతో ఉంటున్నారు. ఇక రజినీగంధ సినిమా విషయానికి వస్తే..


రజనిగంధ 1974లో బసు ఛటర్జీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం. దీనిని ప్రముఖ హిందీ రచయిత "మన్ను భండారి"(Mannu Bhandari) రచించిన "యహీ సచ్ హై"(Yahi sach hai) అనే చిన్న కథ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో అమోల్ పాలేకర్(Amol Palekar), విద్యా సిన్హా (Vidya Sinha) , దినేష్ ఠాకూర్(Dinesh Thakur) ప్రధాన పాత్రలు పోషించారు. 1970 హిందీ సినిమాలకు డైనమిక్ దశాబ్దం. సామాన్యుడు ఎదుర్కొంటున్న సరళమైన సమస్యలను భావోద్వేగ స్థాయిలో విశ్లేషించి బసు ఛటర్జీ చాలా సినిమాలను నిర్మించారు. 


రజనిగంధ సినిమా మొదట్లోనే దీపా (విద్య సిన్హా ) జీవితంలో ఒంటరితనాన్ని మోస్తూ ఉన్న పాత్రలో మనకు కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నాననే భయంతోపాటు, తనకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడంలోనూ, తన సహచరుడిని ఎన్నుకునే క్రమంలోనూ కాస్త డైలమాలో ఉన్న పాత్రలో కనిపిస్తుంది. వీటితో పాటు దీపాలో, పిహెచ్‌డి పూర్తి చేస్తున్న ఒక చదువుకున్న మహిళను కలుస్తాము. దీపా ప్రియుడైన అమోల్ పాలేకర్ పోషించిన సంజయ్ పాత్ర కాస్త స్వార్థపూరితంగా ఉంటుంది. దీపాలో ఉన్న ప్రేమ సంజయ్ లో కనిపించదు. తనకంటే ఎక్కువ చదువుకున్న స్త్రీతో తనకు వివాహమంటే నా తండ్రి ఒప్పుకోకపోవచ్చని సంజయ్ చెపుతాడు. అప్పటి సమాజంలో భర్తకన్నా భార్య ఉన్నత విద్యను అభ్యసించడం సంఘంలో అభ్యంతరంగానే ఉండేది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో దీపా ఎందుకు సన్నిహితంగా ఉంటుంది అనే సందేహం, కాస్త జాలీ ప్రేక్షకుడి మనసులో మొదలకపోదు. సంజయ్ నవ్వుతూ చెప్పినా ఇలాంటి ఆలోచనను మనసులో పెట్టుకుంటాడు. దీపాతో  ప్రేమలో ఉన్నా వివాహ బంధం తనని కట్టి పడేస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు. 


దీపకు లెక్చరర్ గా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు కూడా సంజయ్ నువ్వు సాధించింది పెద్ద విషయం కాదు అన్నట్టు లెక్కచేయకుండా వెళిపోతాడు. ఇదే సమయంలో దీపాకు మాజీ ప్రియుడు నవీన్ ( దినేష్ ఠాకూర్) ఎదురవుతాడు. అతను అన్ని విధాలా సంజేయ్ కు వ్యతిరేకమైన మనస్థత్వం కలవాడు. నవీన్ ప్రవర్తనలో ఎప్పుడూ తేడా చూడలేదు దీపా. ఆమెంటే అమితమైన ప్రేమను, అనురాగాన్ని కలిగినవాడు. తనే దూరం చేసుకుంది కానీ నవీన్ ఎప్పుడూ దూరం కాలేదు. మంచివ్యక్తిగా ఉండే అతని సాధారణ ప్రవర్తనకు మళ్ళీ ఒకసారి దీపా ఆకర్షితురాలు అయినట్టు కనిపిస్తుంది. ఈ సమయంలో దీపాలో ఓ సంఘర్షణ మొదలవుతుంది. తను ఎవరిని ప్రేమిస్తున్నాను..ఎవరికి దగ్గరవుతున్నాను.. సంజయ్ నా? నవీన్ నా? అనే డైలమాలో ఉంటుంది. 


అప్పటి హిందీ చిత్రాలలో స్త్రీలను చిత్రీకరించే పద్దతికి కాస్త భిన్నంగా, దీపా ఎవరిని ప్రేమిస్తుందనే కోణంలో అయోమయంలో పడినట్టు బసు చూపించారు. ఆమె సంజయ్‌ ప్రేమకు కట్టుబడి ఉంది, కానీ నవీన్‌తో సంబంధాన్ని కొనసాగిస్తున్నానా అన్న ఆలోచన, దీపా ఆలోచనలలో, అనైతికంగా కనిపించదు. అది ఆదర్శవంతమైన దృశ్యం అయితే, సినిమాల్లో మహిళల విషయానికి వస్తే అది అలా కాదని ప్రేక్షకులందకీ తెలుసు. ఇక్కడే "కయీ బార్ యున్ భీ దేఖా హై" నేపథ్య గీతం, "మన్ కీ సీమా రేఖ" సందర్భానికి సరిగ్గా సరిపోయినట్టు అనిపిస్తుంది. 


దీపా పాత్ర ఆధునిక మహిళగా చూపించినప్పటికీ, అప్పటి కథానాయికలు పోషించిన పాత్రలకు చాలా భిన్నంగా చూపించారు. ఆమె ప్రేమ వివాహం చేసుకుంటుందా లేక ఉద్యోగంలో మంచి అవకాశాన్ని పొంది వేరే నగరంలో స్థిర పడుతుందా? అనేది చూపించడానికి బసు చేసిన ప్రయత్నం రజినిగంధలో చూడాలి. బసు తన సినిమాల్లో స్త్రీ పాత్రలను చిత్రీకరించడంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. రజినిగంధ చిత్రంలో కూడా దీపా చర్యలన్నింటినీ ఆమె తీసుకునే నిర్ణయాలను బసు యాంగిల్ లో నుంచి సమర్థించడం మనం గమనిస్తాము. 


1975లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రజనీగంధ ఉత్తమ చిత్రంగా నిలిచింది, పాపులర్ అవార్డు,  క్రిటిక్స్ అవార్డ్‌లను గెలుచుకుంది. 1974లో ఈ సినిమా నగరపు మధ్యతరగతి వాస్తవిక ప్రభావం(perspective) కలిగి ఉంది, ఆ తర్వాత దీనిని మిడిల్ క్లాస్ సినిమా అని కూడా అన్నారు. ఈ చిత్రం విద్యా సిన్హా  , అమోల్ పాలేకర్ మొదటి హిందీ చిత్రం, వీరిద్దరూ చాలా సినిమాల్లో బసు ఛటర్జీతో కలిసి పనిచేశారు. రజనిగంధని 2012లో బెంగాలీలోకి హోతాత్ షెడిన్ పేరుతో రీమేక్ చేసారు.


కాబట్టి ఇప్పటి ప్రేక్షకులు 2022లో కనక ఈ సినిమాను చూస్తే, దీపా మరింత మంచి స్థాయికి చేరి సంజయ్ నుంచి విడిపోయి స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటారు.  ప్రేమించిన వాడు తనతో ఎప్పటికీ ఉండాలన్న స్వార్థం, జీవితంలో పేరుకున్న ఒంటరితనం, ఇతన్ని ఒదులుకుంటే మళ్ళీ ఇంకొకరితో చక్కని జీవితాన్ని  పొందలేనేమోననే సంధిగ్ధం ఇలా చాలా కారణాలతో  అతనితోనే జీవితాన్ని ప్రారంభించిన స్ర్తీ మనోవేదనను రజనిగంధలో చూపించారు. తన జీవితంలో ఉన్న ఇద్దరి వ్యక్తుల్లోనూ ఎవరిని ఎంచుకోవాలనే సంఘర్షణ నుంచి సినిమాలోని దీపా పాత్ర తనతో ఎప్పుడూ ఉండే పార్టనర్ చాలని తన స్వభావానికి సరిపడని వాడైనా అతన్నే ఎంచుకుంటుంది. ఇప్పటి పరిస్థితులకు భిన్నంగా అనిపించినా రజనీగంధ 48 సంవత్సరాల క్రితం రూపొందించిన చిత్రం. 



Updated Date - 2022-07-16T21:16:52+05:30 IST