విటమిన్‌ సప్లిమెంట్లు ఎవరికి?

ABN , First Publish Date - 2022-07-05T08:29:44+05:30 IST

ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఆహారం ద్వారా, అంతర్గతంగా ఉత్పత్తవడం ద్వారా విటమిన్లు శరీర జీవక్రియలకు తోడ్పడుతూ ఉంటాయి.

విటమిన్‌ సప్లిమెంట్లు ఎవరికి?

కొవిడ్‌ పాండమిక్‌ సమయంలో విటమిన్‌ డి, జింక్‌లతో రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చనే విషయం ప్రచారంలోకి వచ్చిన తర్వాత, అవసరం ఉన్నా, లేకపోయినా విటమిన్‌ సప్లిమెంట్ల వాడకం ఊపందుకుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే అదనపు సప్లిమెంట్లు అవసరమవుతాయి. 


ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఆహారం ద్వారా, అంతర్గతంగా ఉత్పత్తవడం ద్వారా విటమిన్లు శరీర జీవక్రియలకు తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టే ప్రతి ఒక్కరూ సమతులాహారం తీసుకోవాలని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే అదనంగా విటమిన్లను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కేన్సర్లు, జ్ఞాపకశక్తి క్షీణించడం లాంటి దీర్ఘకాలిక రుగ్మతల నుంచి రక్షణ పొందే అవకాశం ఉండదనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా వ్యాధి నుంచి కోలుకుంటున్న క్రమంలో వైద్యులు సూచించిన మేరకు మాత్రమే విటమిన్‌ సప్లిమెంట్లను వాడుకోవాలి. అయితే పోషకాహార లోపానికి గురయ్యే కొందరు వ్యక్తులకు ఈ సప్లిమెంట్ల అవసరం ఉంటుంది. వాళ్లు ఎవరంటే...


పెద్దలు: సరిగా భోంచేయలేని వాళ్లు, అజీర్తి కలిగి ఉండేవాళ్లు, పోషక శోషణ శక్తి తగ్గిన పెద్దలు సప్లిమెంట్లు తీసుకోవాలి.

గర్భిణులు: గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా, ఎటువంటి అవయవ లోపాలు లేకుండా ఆరోగ్యంగా పెరగడం కోసం...

పిల్లలు, టీనేజర్లు: పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు, టీనేజర్లు

మందుల వాడకం: యాంటిబయాటిక్స్‌, రక్తపోటు, ఛాతీలో మంట, పార్కిన్‌సన్స్‌ వ్యాధికి మందులు వాడుతున్న వాళ్లు.

వెయిట్‌ లాస్‌: ఏదైనా సర్జరీ తదనంతరం లేదా వెయిల్‌ లాస్‌లో భాగంగా పరిమిత ఆహారం తీసుకునేవాళ్లు.

ఆరోగ్య సమస్యలు: అల్సరేటివ్‌ కొల్లైటస్‌ లేదా సిలియాక్‌ డిసీజ్‌ ఉన్నవాళ్లు.

Updated Date - 2022-07-05T08:29:44+05:30 IST