నాకు కిక్‌ ఇచ్చేవి... ప్రేక్షకుల ప్రశంసలే

ABN , First Publish Date - 2022-09-11T09:16:05+05:30 IST

జయాపజయాల చింత లేకుండా మంచి సినిమాలు చేయాలనే నటులలో శర్వానంద్‌ ఒకరు.

నాకు కిక్‌ ఇచ్చేవి... ప్రేక్షకుల ప్రశంసలే

జయాపజయాల చింత లేకుండా మంచి సినిమాలు చేయాలనే నటులలో శర్వానంద్‌ ఒకరు. భావోద్వేగాలుండే బరువైన పాత్రలను సునాయాసంగా పోషిస్తాడనే పేరున్న శర్వా నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలై విజయం సాధించింది. ఈ సందర్భంగా తన భావాలను శర్వ ‘నవ్య’తో పంచుకున్నారు. ఆ విశేషాలలోకి వెళ్తే...


‘ఒకే ఒక జీవితం’ ఫలితంతో రిలాక్స్‌ అయ్యారా? 

అవును. హిట్‌ కొట్టి మూడు నాలుగేళ్లయింది. ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 

ఈ సినిమాతో మీకు దక్కిన ప్రశంస?

సినిమా అయిపోగానే ప్రేక్షకులు అందరూ లేచి నిలబడి ఐదు నిమిషాల పాటు కరతాళధ్వనులతో ప్రశంసించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు కిక్‌ ఇచ్చేవి వారి ప్రశంసలే. హిట్‌ చిత్రాలు, మంచి వసూళ్లు దక్కించుకున్న చిత్రాలు చేయడం ఒకెత్తయితే  గౌరవం సంపాదించి పెట్టే ఇలాంటి చిత్రాలు నాకు దక్కిన అదృష్టం. 

కరోనా సమయంలో వ్యవసాయం చేశానని చెప్పారు?

ప్రకృతి అన్నా, మొక్కలన్నా నాకు బాగా ఇష్టం. ఆ సమయంలో మా ఫామ్‌హౌ్‌సలో ఒక చిన్న పాక వేసుకొని మూడు నెలలు ఉన్నాను. కంచె వెంబడి 600 వరకూ మొక్కలు నాటాను. 

సినిమాల్లోకి రావడానికి మీకు ప్రేరణ?

నటుణ్ణి కావడం వెనుక నా మీద ఎలాంటి బాహ్య ప్రభావాలూ లేవు. ఊహ తెలియని వయసు నుంచే సినిమాలు చూసి హీరోని అవుతాను అనేవాణ్ణి అని మా అమ్మ చెప్పేవారు. స్కూల్లో ఉన్నప్పుడు  చూసిన నాటకాల ప్రభావం కొంత ఉంది. కాలేజీకి వచ్చాక కుటుంబ వ్యాపారాలు చూసుకోవడానికి తగ్గ చదువుల వైపు వెళ్లమన్నారు. కానీ నాకు ఇష్టం లేదు. అప్పుడే ‘చిత్రం’, ‘నువ్వేకావాలి’ సినిమాలతో బయటవాళ్లు కూడా ఓ ప్రయత్నం చేయవచ్చు అనే నమ్మకం కలిగింది. అయితే అప్పట్లో ఒక ప్రకా్‌షరాజ్‌లాగా మంచి నటుణ్ణి అయితే చాలనుకున్నాను. 

ఈ స్థాయికి రావడానికి మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు? 

హీరోగా మనకంటూ ఒక మార్కెట్‌ను స్థిరపరుచుకోవడం, మధ్యలో ఒడుదొడుకులు, ఎలాంటి సినిమాలు చేయాలి... లాంటి లెక్కలు ఇక్కడ ఉంటాయి. కొన్ని చోట్ల ఎదురుదెబ్బలు తిన్నా వాటివల్ల అంతిమంగా మంచే జరిగింది. మొదట్లో అపజయాలు వచ్చినప్పుడు బాగా బాధపడేవాణ్ణి. బాగా నమ్మకం పెట్టుకున్న సినిమా ఫ్లాప్‌ అయితే మెహం చాటేసేవాణ్ణి. గత నాలుగేళ్లుగా ఫ్లాప్‌లు వస్తుండడంతో వాటి ప్రభావం బాగా తగ్గిపోయింది. ‘మన ప్రయత్నం చేద్దాం, ఏదయితే అదవుతుంది’ అనే పరిపక్వత వచ్చింది. 

సినిమా ఫ్లాప్‌ అవుతోందని తెలియగానే మీలో ఎలాంటి సంఘర్షణ ఉంటుంది?

కొత్తల్లో అయితే చాలా కష్టంగా ఉండేది. నాకు పరిశ్రమ కొత్త. ఇలా చే స్తే బాగుంటుందని చెప్పేవారు లేరు. ఇప్పటిదాకా నా ప్రతి  సినిమాకూ నేనే బాధ్యత తీసుకున్నాను. బయట వ్యక్తుల నుంచి ఎలాంటి సలహాలూ తీసుకోలేదు. అపజయాన్ని విశ్లేషించుకంటే నేను ఎక్కడ ఫెయిల్‌ అయ్యానో తెలిసేది. తర్వాత ఆ తప్పు పునరావృతం చేయలేదు. పొరపాటు జరిగాక వేరెవరినో బాధ్యులను చేసి చేతులు దులుపుకునే బదులు అది జరగకుండా చూడాలనేది నా ప్రయత్నం. అందులో ఎంత మేర విజయం సాధించానో నాకు తెలియదు. కానీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. 

హిట్‌ కథను పట్టుకోవడం అంత కష్టమా?

మనం వంద కథలు వింటే ఒకటో రెండో మన అంచనాలకు అందుతాయి. అయితే నేను ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా మంచి కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కథలు సిద్ధం చేయించడం అనే ప్రక్రియ పైన నాకు నమ్మకం లేదు. దర్శకులని నమ్ముతాను. కొత్త దర్శకులతో ఎక్కువ చిత్రాలు చేయడం నా కెరీర్‌కు చాలా లాభించింది. 


నేను దర్శకుల నటుణ్ణి. కథలో శర్వా పాత్ర ఎలా ఉందని చూడను. అందులో నటనకు ఎంత ఆస్కారముందనేది ముఖ్యం. షాట్‌ బాగా రావడానికి అవసరమైతే 40 టేక్‌లు అయినా తీసుకుంటాను. దాన్ని తప్పుగా భావించను. ‘సీన్‌ అనుకున్న విధంగా వచ్చిందా’ అని ఒకటికి రెండు సార్లు దర్శకుడిని అడుగుతాను. హీరోలు ఏమైనా అనుకుంటారేమో అని  కొందరు దర్శకులు మళ్లీ చేయమని అడగలేరు. నా దర్శకులకు మాత్రం ఎన్నిసార్లయినా అలా అడిగే వాతావరణాన్ని కల్పిస్తాను. 


కష్ట కాలంలో మీకు వెన్నుదన్ను ఎవరు?

చిన్న విషయాలకే నేను చాలా ఎమోషనల్‌ అవుతాను. ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మ సర్దిచెబుతుంది. అమ్మే నాకు అన్నీ. 

ఈ సినిమా కథ అమ్మ చుట్టూ తిరుగుతుంది.  మీ అమ్మగారు ఏమన్నారు?

వాళ్లు లోపల ఎంత సంతోషంగా ఉన్నా బయటకు ప్రదర్శించరు. ‘బావుంది నాన్నా, బాగా చేశావ్‌’ అని మామూలుగా చెబుతారు. ఇరగదీశావ్‌ లాంటి కామెంట్లు ఇవ్వరు. 

ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని కథను ఓకే చేస్తారు?

మంచి కథను ఎంచుకోవడం అనేది చాలా పెద్ద సవాల్‌. దర్శక నిర్మాతల్లో కొంతమంది కాంబినేషన్లు గురించి చెబితే, మరికొందరు అప్పటి ట్రెండ్‌ను బట్టి పోదాం అంటారు. దానికి నేను వ్యతిరేకం. కథ నచ్చితే ముందు ఆ దర్శకుడి దృష్టి ఏమిటనేది చూస్తాను. అతను ఎందుకు ఆ సినిమా చేస్తున్నాడు? ఎవరికోసం చేస్తున్నాడు? ప్రేక్షకులకు తను చెప్పాలనుకున్న దానికోసం సినిమా తీస్తున్నాడా? లేదా నేనొక స్టార్‌ని కాబట్టి నాతో చేయాలనుకుంటున్నాడా?.. ఇలా పలురకాలుగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటాను. 


నాకంటూ కథల ఎంపికలో ఎలాంటి ఫార్ములా లేదు. సొంత కథలతో వచ్చే దర్శకుల మీద కొంచెం గురి ఎక్కువ. గతంలో అయితే నేను తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌. ఇప్పుడు సొంత నిర్ణయం కాకుండా మా టీమ్‌తో మాట్లాడి ఒక అవగాహనకు వస్తున్నాను. దీనివల్ల మనం నమ్మిందే సరైనది అనుకోం. అందులో మంచి చెడులు తెలుస్తున్నాయి. కొన్ని స్ర్కిప్టుల సత్తా దర్శకుడు రాసుకున్నప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు స్ర్కిప్టు కూడా పక్కాగా తయారు చేసుకున్నాకే షూటింగ్‌కి వెళ్లాలనేది నా ప్రయత్నం. 


మీ అంచనాలను తల్లకిందులు చేసిన సినిమాలు ఉన్నాయా?

చాలా ఉన్నాయి. హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ... ఇలా ఎవరో ఒకరి వైపు నుంచి పొరపాటు జరగాల్సిందే తప్ప సినిమా అపజయంలో ప్రేక్షకుల తప్పు ఎప్పుడూ ఉండదు. 

మీ లోపాలను నిష్కర్షగా చెప్పేవారు ఎవరు?

నా స్నేహితులు, కుటుంబ సభ్యులు. ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తారు. వాళ్లసలు నన్ను ఒక యాక్టర్‌లానే చూడరు. 

ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి ఎలా కలిగింది?

మన చుట్టూ ఏదో తెలియని శక్తి ఉంది. దాన్ని విశ్వసిస్తాను. అందరు దేవతలనూ గౌరవిస్తాను. స్నానం చేశాక మనసులో ధ్యానిస్తాను. అయ్యప్పస్వామి మాల ధరించినప్పుడు తప్ప రోజూ పూజలు చేయను. మన ఆలోచనలే వాస్తవాలుగా మన జీవితాల్లోకి వస్తాయని గట్టిగా నమ్ముతాను. 

ఇండస్ట్రీలో మీ స్నేహితుల గురించి చెప్పండి?

రామ్‌చరణ్‌, యూవీ క్రియేషన్స్‌ విక్కీ, వంశీ... ప్రభాస్‌, రానా చిన్నప్పటి నుంచి తెలుసు. మంచి స్నేహితులం. చరణ్‌తో బాగా కలుస్తా. సినిమా గురించి మాత్రం మాట్లాడుకోం. చరణ్‌ ఎక్కువ పార్టీలు ఇస్తాడు. నేను వెళ్తాను. నా సినిమా రిలీజవుతుంటే ఫలితం ఎలా ఉంటుందోనని వాళ్లే ఎక్కువ కంగారు పడతారు. 

హీరోల మధ్య పోటీ వాతావరణం ఉందా?

నేనైతే అస్సలు ఆ ఆలోచనే రానివ్వను. మరొకరిని నాకు పోటీగా భావించను. నటుడిగా నా ప్రయాణం భిన్నమైనది. నా కథల ఎంపిక ఇతర హీరోలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మూస ధోరణిలో  పోవడం నాకు ఇష్టం లేదు. నాది స్టార్‌డమ్‌ మైండ్‌సెట్‌ కాదు. 

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?

ఇంట్లోవాళ్లు, స్నేహితులు అడుగుతున్నారు కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాను. టైమ్‌ దొరకలేదు. టైమ్‌ వచ్చినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఒక్క సినిమా చేయాలనే నియమం పెట్టుకున్నాను. నా జోడీని వెతుక్కునే ప్రయత్నం ఫలించవచ్చు. 

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లపై మీ అభిప్రాయం? 

నాకు సదభిప్రాయమే ఉంది. పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా చేసుకుంటాను. కానీ నేను ప్రేమ వివాహమే చేసుకుంటాననుకుంటున్నాను. 

మీరు ఏ తరహా చిత్రాలను ఎక్కువ ఇష్టపడతారు?

సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలంటే చాలా ఇష్టం. సూపర్‌హీరో మూవీస్‌ కూడా ఎక్కువ చూస్తాను. అయితే నా నుంచి మాత్రం సూపర్‌హీరో చిత్రాలు ఆశించవద్దు. 

మీరు అభిమానించే హీరోయిన్లు ఎవరు?

నిత్యా మీనన్‌, సాయి పల్లవి, దీపికా పదుకొనే అంటే ఇష్టం. పాత తరంలో సౌందర్యగారు. 

ఓటీటీల ప్రభావం సినిమాలపై ఎలా ఉంది?

ఓటీటీలు వచ్చాక  సినిమా పరిధి పెరిగింది. ఏదో ఒకటి తీస్తాం అంటే కుదరదు. ప్రేక్షకులకు ఒక కొత్త తరహా అనుభూతినిచ్చేలా సినిమా ఉండాలి. లేదంటే అసలు థియేటర్‌ గడప కూడా తొక్కరు. అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథలు కుదరడం లేదు. కథల్లో కూడా ఓటీటీ, థియేటర్‌ కంటెంట్‌ అని విభజన వచ్చింది. ఏదో ఒక అద్భుతం చేస్తే తప్ప ప్రేక్షకుడు సంతృప్తిపడడం లేదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం సానబెట్టుకోవాల్సిన అవసరం కల్పించింది. 

మీరు భోజన ప్రియులా? 

అవును. రకరకాల రుచులను ఆస్వాదిస్తాను. యాక్సిడెంట్‌ అయ్యాక బాగా బరువు పెరిగాను. పదిహేను కిలోల బరువు తగ్గాలి. ఇక వర్కౌట్స్‌ మొదలుపెట్టాలి. 

మీ తదుపరి చిత్రాలు? 

ఇకపైన నింపాదిగా ఒక సినిమా తర్వాత మరొకటి చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.  

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌‘ఈ సినిమా ఎందుకు చేశానా’ అని మీరు  బాగా బాధపడిన సందర్భం?

ప్రతి సినిమాలో నేను చేసిన తప్పేంటో నాకు తెలుసు. ‘పడిపడిలేచే మనసు’ సినిమాలో సెకండ్‌ హాఫ్‌లో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. ప్రథమార్థంలో ఉన్న కొత్తదం ద్వితీయార్థంలో కొనసాగలేదు. దాన్ని విశ్లేషించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సమయం లేకపోయింది. కథలోనే తప్పు ఉంది. అవకాశం ఉన్నా సరిదిద్దుకోలేకపోయాం అనిపించింది.

Read more