జల విలాసం.. క్రూయిజ్ విహారం
ABN , First Publish Date - 2022-06-26T17:54:48+05:30 IST
పేరుకు స్టార్ హోటల్‌గా చెబుతారు కానీ.. కార్డేలియా క్రూజ్‌ను ఒక విలాస నగరమనే చెప్పొచ్చు. 692 అడుగుల పొడవు.. 48,563 కిలోల స్థూల

అర్థరాత్రి వేళ.. నడి సంద్రంలో ప్రయాణం. ఆకాశంలో చుక్కలు మిలమిలా మెరిసిపోతుంటే వాటి మధ్య ఠీవీగా వెలిగిపోయే చందమామను చూస్తూ ఉండిపొతే? కనుచూపు మేర సముద్రం.. వయ్యారంగా వెళుతున్న నౌక డెక్ మీద స్విమ్మింగ్ చేస్త్తుంటే? చిన్నా పెద్దా అన్న తేడా మరచి.. అపరిచితులు సుపరిచితులుగా మారి.. మనసుకు నచ్చిన పాటలకు తోచిన స్టెప్పులు వేస్తూ గంటల కొద్దీ డ్యాన్సు వేసే అవకాశం.. అది కూడా సముద్రం మధ్యలో వస్తే? సూర్యోదయపు వేళలో.. ఆహ్లాద వాతావరణంలో.. నిశ్శబ్దంగా ఉన్న డెక్ మీద యోగా చేస్తూ కొందరు.. జిమ్‌లో కేలరీలు కరిగిస్తూ ఇంకొందరు.. కుటుంబసభ్యులతో కలిసి నడక సాగిస్తూ మరికొందరున్న సన్నివేశాల్ని ఒకే చోట చూసే అవకాశం.. అది కూడా సాగర ప్రయాణంలో కంటపడితే? ఇవే కాదు.. ఇలాంటి అనుభవాలు.. అనుభూతుల సమాహారంగా నిలుస్తుంది కార్డేలియా ఎమ్మీ ఎంప్రెస్ క్రూయిజ్ ప్రయాణం. కడలిలో కదిలే నగరంగా చెప్పే ఈ విలాసాల నౌక ఇప్పుడు తెలుగునాట అందరి నోటా వినిపిస్తోంది. విదేశీ ప్రయాణాలు చేసిన వారిలోనూ క్రూయిజ్ ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకున్న వారు తక్కువే. అలాంటిది మన సంద్రంలో ఐదు నక్షత్రాల వసతులతో కూడిన భారీ నాకలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది ఎంప్రెస్ క్రూయిజ్...
కవర్ స్టోరీ
పేరుకు స్టార్ హోటల్‌గా చెబుతారు కానీ.. కార్డేలియా క్రూజ్‌ను ఒక విలాస నగరమనే చెప్పొచ్చు. 692 అడుగుల పొడవు.. 48,563 కిలోల స్థూల బరువున్న ఈ భారీ నౌక మొత్తం 11 అంతస్తుల సమాహారం. 796 కేబిన్లతో 1800 మంది అతిథులు ఒకేసారి ప్రయాణించే వీలు.. వారికి దాదాపు 800 మంది వరకు సిబ్బంది సేవలు అందించేందుకు సదా సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఈ నౌక ముంబయి.. గోవా లాంటి ప్రాంతాల్లో ప్రయాణించి.. కొద్ది నెలలు విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ప్రయాణించనుంది. విలాసాల క్రూయిజ్ ప్రయాణానికి సంబంధించిన ఉత్కంఠ ఎలా ఉంటుందో? ఈ ప్రయాణానికి సంబంధించిన సందేహాలు బోలెడు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ.. తెలుగు ప్రజల్లో సముద్ర ప్రయాణాల్ని చేసిన వారు చాలా తక్కువే కనిపిస్తారు. అందులోనూ ఐదు నక్షత్రాల వసతులున్న విలాసవంతమైన నౌకలో మూడు రాత్రుళ్లు.. నాలుగు పగళ్ల ప్రయాణం అంటే ఎంతో ఆనందభరితంగా ఉంటుంది. అలవాటు లేని సముద్రపు ప్రయాణానికి ఎలా సిద్ధం కావాలన్నది చాలా ముఖ్యం. క్రూయిజ్‌లో విశేషాలకు కొదవ లేదు. ప్రతి ఒక్కరి ఎంజాయ్‌మెంట్‌కు తగ్గట్టుగా ఇందులో వసతులు ఉన్నాయి. ఖర్చు చేసే ప్రతి రూపాయికి రెట్టింపు ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇందులో ప్రయాణం చేసేందుకు అవసరమైన టికెట్‌ను ఎలా కొనుగోలు చేయాలన్న విషయం మీదా.. టికెట్టు ధర మీదా బోలెడంత కన్ఫ్యూజన్ ఉంది చాలామందిలో. ముందుగా ఆ విషయంలోకి వెళితే.. క్రూయిజ్ టికెట్‌ను కొనుగోలు చేయటానికి సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్లో కానీ.. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధరల విషయానికి వస్తే.. డైనమిక్ పద్ధతిని అనుసరిస్తున్నారు. విమాన టికెట్ల ధరలకు ఏ విధానాన్ని అనుసరిస్తారో అదే పద్ధతిని పాటిస్తున్నారు.
ఏమిటీ డైనమిక్ ప్రైజింగ్...?
ప్రయాణ తేదీల్లో బుకింగ్‌లకు ఉండే డిమాండ్‌కు అనుగుణంగా ధరలు మారిపోవటమే డైనమిక్ విధానం. ఉదాహరణకు ప్రయాణ తేదీకి.. టికెట్ బుక్ చేసుకునే వ్యవధి ఎక్కువగా ఉంటే ధర తక్కువగా.. వ్యవధి తక్కువగా ఉంటే ధర ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రయాణ తేదీ సమీపిస్తున్న కొద్దీ ధరలు అంతకంతకూ పెరిగిపోతుంటాయి. క్రూయిజ్‌లో గదుల వైశాల్యాన్ని బట్టి ధరలు ఉంటాయి. మొత్తం ఐదు రకాల రూంలు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి చెన్నై ప్రయాణానికి అయ్యే టికెట్ ధరల్ని చూస్తే..
1 ఛైర్మన్స్ సూట్: క్రూయిజ్ మొత్తంలో ఇదొక్కటే రూం ఉంటుంది. గది లోపల 569 చదరపు అడుగులు ఉంటే.. దీనికి అనుబంధంగా ఉండే బాల్కనీ ఏకంగా 22 చదరపు అడుగులుంది. విలాసానికి కేరాఫ్ అడ్రస్ ఈ సూట్. ఇందులో డ్రాయింగ్ రూం.. బెడ్రూం అదనం. ఇదో మినీ లగ్జరీ ఇల్లు. దీని ధర ఒకరికైతే రూ.2.75 లక్షలు.. ఇద్దరికైతే రూ.3.50 లక్షలకు పైనే ఉండొచ్చు. డిమాండ్‌కు అనుగుణంగా.. ధరలు పెరగొచ్చు.. అదే సమయంలో తగ్గొచ్చు. ముగ్గురు ప్రయాణిస్తే.. మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2. సూట్ రూం: లగ్జరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇందులో కూడా రూంతో పాటు.. సముద్రాన్ని చూసేందుకు వీలుగా బాల్కనీ ఉంటుంది. రూం కేబిన్ 303 చదరపు అడుగులు ఉంటే.. బాల్కనీ 222 చదరపు అడుగులు ఉంటుంది. టికెట్ ధర విషయానికి వస్తే ఒక్కరికి రూ.1.4 లక్షలు.. ఇద్దరికి అయితే రూ.1.90 లక్షలు.
3.మినీ సూట్ రూం: ఛైర్మన్ సూట్, సూట్ రూంలతో పోలిస్తే విస్తీర్ణం తక్కువే. అలా అని.. ఇదేమీ తక్కువేం కాదు. మన బెడ్రూంలతో పోలిస్తే విశాలమైనవి. మినీ సూట్ రూంల కేబిన్ 194 చదరపు అడుగులు ఉంటే.. బాల్కనీ 25 చదరపు అడుగులు ఉంటుంది. ధర ఒకరికి రూ.80 వేల నుంచి రూ.లక్ష. తీర్చిదిద్దినట్లుగా ఉండే ఈ రూమ్‌లో ఆహ్లాదంగా ఫీల్ కావటం ఖాయం.
4. ఓషన్ వ్యూ స్టేట్ రూం: ఈ రూంలు దాదాపుగా మూడో అంతస్తులో ఉంటాయి. మిగిలిన వాటితో పోలిస్తే కాస్త చిన్నవిగా ఉంటాయని చెప్పాలి. ఇందులో రూం విస్తీర్ణం 142 చదరపు అడుగులు ఉంటుంది. తక్కువ విస్తీర్ణంగా అనిపించినప్పటికీ.. అన్ని అవసరాలు తీరేలా వీటిని డిజైన్ చేశారు. క్వీన్ బెడ్.. మొత్తటి పరుపు, నాలుగు దిండ్లతో పాటు.. సమస్తం అందుబాటులో ఉంటాయి. బెడ్ వెనుక పెద్దదైన గ్లాస్ విండో ఉంటుంది. దాన్ని తొలగిస్తే.. సముద్రం మన ముంగిట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. నౌక మూడో అంతస్తులో ఉండటంతో.. ప్రయాణ తాకిడికి వచ్చే అలలు విసురుగా తగులుతున్న అనుభూతి కలిస్తాయి. మిగిలిన గదులతో పోలిస్తే.. వీటి ధర కాస్త తక్కువ. ఒకరికి రూ.25 వేలు.. ఇద్దరికి రూ.40 వేలు.
5. ఇంటీరియర్ స్టేట్ రూం: ఈ రూం మొత్తం ప్యాక్ చేసినట్లు ఉంటుంది. ఇందులో కిటికీలు ఉండవు. రూంలోకి వెళ్లిన తర్వాత సముద్రాన్ని చూసే వీలుండదు. మిగిలిన రూంలతో పోలిస్తే చిన్నది. ధర తక్కువ. ఒకరికి రూ.15 వేలు.. ఇద్దరికి రూ.25 వేల లోపు లభించే వీలుంది. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా వారు రూంలను ఎంపిక చేసుకోవచ్చు. లగ్జరీ విషయంలో ఏ మాత్రం తగ్గకూడదనుకున్నా.. ఈ ప్రయాణం ఎప్పటికీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండిపోవాలంటే.. ఛైర్మన్ సూట్ కానీ సూట్ కానీ బుక్ చేసుకోవచ్చు. అయితే.. మొదటి మూడు కేటగిరీలలో గదులు బుక్ చేసుకున్న వారికి.. క్రూయిజ్‌లో ఉన్న అన్ని రెస్టారెంట్లలో అనుమతి ఉంటుంది. మిగిలిన రెండు కేటగిరిల్లో ఉన్న రూంలు బుక్ చేసే వారికి కొన్ని రెస్టారెంట్లలో అనుమతి ఉండదు. ధరలు ఎప్పటికప్పుడు డిమాండ్‌ను బట్టి మారుతూ ఉంటాయి.

క్రూయిజ్‌లో ఏముంటుంది?
సకల సౌకర్యాల విలాస ధామం అనే చెప్పాలి. ఇందులో ప్రయాణించే వారి మూడ్‌కు అవసరమైన అన్ని వసతులు ఉండేలా ప్లాన్ చేశారు. క్రూయిజ్‌లో ఇంటీరియర్ డిజైన్‌కు పెద్దపీట వేశారు. ప్రతి దగ్గర సముద్రం కనిపించేలా ఏర్పాట్లు ఉంటాయి. సీ వ్యూను ఎక్కడా మిస్ అయ్యే అవకాశం ఉండదు. దీనికి మినహాయింపు ఒక్క థియేటర్ లోనే. రెండు అంతస్తులు ఉన్న ఈ థియేటర్ పేరు ’మార్క్వీ‘. ఇందులో లైవ్ షోలతో పాటు.. మేజిక్ షోను ప్రదర్శిస్తారు. ’బాలీవుడ్ మ్యూజికల్ కామెడీ‘ ఒకలాంటి ఎంజాయ్మెంట్ అయితే.. బల్లే బల్లే షో నాటకం మనసును హత్తుకునేలా ఉంటుంది. మ్యూజిక్, మ్యాజిక్, డ్యాన్స్ వర్క్షాపులుంటాయి. రెండు గంటల పాటు సాగే ఈ డ్రామా చూసిన తర్వాత దాని గురుతులు మనల్ని వెంటాడతాయి. సముద్రంలో నౌక ప్రయాణిస్తున్న వేళ.. కాసింత కుదుపుల మధ్య థియేటర్ స్టేజ్ మీద చేసే ప్రదర్శన చూస్తే.. వారి కష్టం ఇట్టే అర్థమవుతుంది. వీటితో పాటు.. డీజే పార్టీలు.. లైవ్ ఎంటర్టైన్ మెంట్.. సల్సా డ్యాన్స్.. ఫన్నీ గేమ్‌లు.. మేజిక్ షోలు అద్భుతం. వీటితో పాటు బార్లు.. కోరుకున్న రుచుల్ని అందించే రెస్టారెంట్లు అదనం. ఇవే కాకుండా నైట్ క్లబ్ .. లాంజ్.. స్పా.. సెలూన్.. జిమ్.. కేసినో.. అడ్వెంచర్ యాక్టివిటీస్.. లైవ్ బాండ్స్... డీజేతో పాటు పరిమిత షాపింగ్ చేసుకోవచ్చు.
అలా మొదలై..
విశాఖపట్నం నుంచి కార్డేలియా క్రూయిజ్ మొదలయ్యే ప్రయాణాన్నే తీసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లోని వారు ఎవరైనా ముందుగా విశాఖపట్నానికి చేరుకోవాలి. ఉదయం పన్నెండు గంటలకు విశాఖలోని క్రూయిజ్ సంస్థ వారు పేర్కొనే హోటల్‌కు వెళ్లాలి. అలా వెళ్లాక.. అక్కడ ప్రయాణ టికెట్.. ఆధార్ కార్డు.. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు అవసరం. వివరాలు పరిశీలించాక నౌక వద్దకు చేరుకోవటానికి ఏసీ బస్సుల్ని ఏర్పాటు చేస్తారు. నౌక వద్దకు చేరుకున్న తర్వాత.. విమానాశ్రయంలో ఎలా అయితే సెక్యూరిటీ చెకప్ ఉంటుందో అలాగే ఉంటుంది. దాన్ని పూర్తి చేసిన తర్వాత నౌకలోకి వెళ్లే వీలుంటుంది. నౌకలోకి అడుగు పెట్టే వేళకు.. స్వాగతం పలికి.. వెల్కం డ్రింక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు ఉద్యోగులు. మొదటి రోజు సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో నౌకలోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. రూంకు వెళ్లిన కాసేపటికే.. నౌక మొత్తాన్ని చూసేందుకు ఎవరికి వారు ఆసక్తి చూపుతారు.
రాత్రి ఎనిమిది గంటల వేళలో ప్రయాణం మొదలవుతుంది. అప్పటివరకు సముద్రంలో కదలకుండా ఉన్న నౌక.. ప్రయాణం మొదలైన రెండు గంటల వరకు కొత్త అనుభూతి మిగులుతుంది. నౌక కదిలిన వెంటనే కొందరు కంగారుపడే అవకాశం ఉంది. ప్రయాణ వాతావరణం అలవాటుకు కాస్త సమయం పడుతుంది. నౌక కదిలే సమయంలో థియేటర్లో షో చూసే వారికి.. క్రూయిజ్ కదిలిందన్న విషయం అర్థం అవుతుంది. ఇక.. అప్పటికే డెక్ మీదకు చేరుకున్న వారికి మాత్రం.. నౌక బయలుదేరిన కొద్దిసేపు అలల తాకిడికి అంత పెద్ద క్రూయిజ్ కుదుపులకు లోను కావటం ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. కొందరికి మాత్రం కళ్లు తిరిగే అవకాశం ఉంది. అలాంటి వారు.. వెంటనే రూంకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటే మంచిది.
ప్రతి రోజూ వినోదమే..
మొదటి రోజు త్వరగానే గడిచిపోతుంది. రెండో రోజు మాత్రం కాస్తంత సుదీర్ఘంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. చుట్టూ సముద్రం.. కనుచూపు మేర నీళ్లు తప్పించి ఇంకేం కనిపించని వైనం కొత్తగా అనిపించటంతో పాటు.. సముద్రాల్ని ఈదే వారి శక్తి సామర్థ్యాలు ఎంతన్న విషయం అర్థమై.. అబ్బురానికి గురి చేస్తుంది. రెండో రోజు ప్రయాణం మొత్తం సముద్రంలోనే సాగటంతో పగలు కాస్త నెమ్మదిగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది. కారణం.. ఉదయం వేళలో యాక్టివిటీస్ పరిమితంగా ఉండటమే. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి. దీనికి తోడు పగటి ఎండ కారణంగా డెక్ మీదకు వెళ్లిన వారు ఇబ్బందికి గురవుతారు. దీంతో.. ఉదయం పూట రెస్టారెంట్లో కానీ ఫుడ్ కోర్టులో కానీ ఎక్కువ కాలక్షేపం చేస్తుంటారు. కాసినో మోజు ఉన్న వారికి మాత్రం ప్రతి రోజు మధ్యాహ్నం నుంచే సందడి మొదలవుతుంది.
సాయంత్రం అయ్యేసరికి చాలామంది పదకొండో ఫ్లోర్‌లోని డెక్ మీదకు వెళ్తారు. అక్కడ సందడి సందడిగా ఉండటంతో పాటు.. సాయంత్రం తర్వాత సముద్రం మీద నుంచి వచ్చే చల్లగాలి.. రాత్రి వేళలో వీనుల విందైన సంగీతం.. పాటలతో వాతావరణం మొత్తం సందడిగా మారుతుంది. రాత్రి డిన్నర్ తర్వాత చాలామంది డీజే దగ్గరో.. థియేటర్ వద్దనో .. రాత్రి వేళ సముద్రాన్ని చూసేందుకు డెక్ మీదకు వెళ్లటమో చేస్తుంటారు. కాసినో దగ్గర అర్థరాత్రి దాటిన తర్వాత కూడా కాలక్షేపం చేసే వారు కనిపిస్తారు. క్రూయిజ్‌లో పగలు కంటే సాయంత్రం నుంచి మొదలయ్యే సందడి అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగుతూనే ఉంటుంది.
బోలెడన్ని అనుభూతులతో..
మూడో రోజున షెడ్యూల్ ప్రకారం పాండిచ్చెరి ట్రిప్ ఉంటే.. దాదాపు తొమ్మిది గంటల సమయం ఇట్టే గడిచిపోతుంది. షిప్పును సముద్రం మధ్యలో లంగరేసి.. వేరే బోట్లలో పాండిచ్చేరి తీరానికి తీసుకెళతారు. అందుకు దాదాపు 30 నుంచి 45 నిమిషాల మధ్య ప్రయాణం చేయాలి. పాండిచ్చేరిలోని దర్శనీయ స్థలాల్ని ముందుగానే ప్లాన్ చేసిన తీరులో చూపించి.. తిరిగి క్రూయిజ్ వద్దకు తీసుకొస్తారు. ఉదయం ఏడున్నర గంటలకు ప్రాసెస్ మొదలై.. తిరిగి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ప్రయాణంలో చివరి రాత్రి అన్న భావనతో.. ఏదో మిస్ అయిపోతున్నామన్న ఉద్దేశం అందరిలో కనిపిస్తుంది. వీలైనంత ఎక్కువసేపు డెక్ మీద గడపటానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆ రాత్రి గడిచి.. తెల్లారేసరికి చెన్నై తీరానికి దగ్గర్లో ఉంటాం. చివరి రోజు ఉదయం ఆరున్నర నుంచే బ్రేక్‌ఫాస్ట్ సందడి మొదలవుతుంది. రెడీ అయి.. టిఫిన్ చేసే సమయానికి చెన్నై పోర్టుకు చేరుకుంటాం. మనం తీసుకున్న రూంలకు అనుగుణంగా వేర్వేరు మార్గాల్లో బయటకు వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. నౌక నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఏసీ బస్సుల్లో పోర్టు నుంచి బయటకు వస్తాం. అక్కడి నుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్ల వద్దకు తీసుకొస్తారు. ఎవరికి వారు తమ గమ్యస్థానాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. అలా క్రూయిజ్ ప్రయాణం ముగిసి..బోలెడన్ని తీపి గురుతులతో ఇంటిబాట పడతాం.
- చామర్తి మురళీధర్

ప్రయాణానికి ముందే రీఛార్జి
క్రూయిజ్‌లో ఎక్కటానికి ముందే ప్రతి ఒక్కరికి రూం కార్డు ఇస్తారు. దాన్లో రీఛార్జి చేసుకోవాలి. ఎందుకంటే క్రూయిజ్‌లో డబ్బులు పెట్టి కొనే ప్రతి దానిని ఈ కార్డుతోనే చెల్లించాలి. ఒకవేళ డబ్బులు ఖర్చు కాకపోతే.. తిరిగి వెళ్లే సమయానికి ఇచ్చేస్తారు. అదనంగా ఖర్చు చేస్తే.. ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాతనే క్రూయిజ్ దిగే వీలుంటుంది. క్రూయిజ్ దిగే వేళలో.. మనకు ఇచ్చిన కార్డును స్కాన్ చేసి.. అందులో ఎలాంటి బాకీ లేదన్న తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. డబ్బుల లెక్కలు అన్ని అమెరికన్ డాలర్ల లెక్కలోనే ఉంటుంది.
ఆ చిరాకు తప్పదు
క్రూయిజ్ ట్రిప్ అందరికి ఎంతో ఉత్సాహభరితంగా మొదలవుతుంది. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. కాకుంటే.. క్రూయిజ్ బయలుదేరిన కాసేపటికి కొంతమందికి పడకపోవచ్చు. అలాంటి వారు వెంటనే స్థిమితంగా కూర్చోవటం.. ఆ వాతావరణానికి అలవాటు పడేంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కొందరికి మాత్రం తలపోటు.. వాంతులు అయ్యే అవకాశం ఉంది. అలాంటి వారి కోసం వైద్యులతో పాటు మెడికల్ సౌకర్యం ఉంది.
ఎలా ప్యాక్ చేసుకోవాలి?
అలవాటు లేని సముద్ర ప్రయాణానికి లగేజ్ ఎలా ప్యాక్ చేసుకోవాలన్న సందేహం చాలామందికి వస్తుంది. ఎలాంటి ఆహార పదార్థాలను క్రూయిజ్‌లోకి అనుమతించరు. వీలైనన్ని ఎక్కువ దుస్తులు తెచ్చుకోవటమే మంచిది. కారణం ఫోటోలు దిగటానికి ఎక్కువ అవకాశం ఉండటం.. క్రూయిజ్‌లోకి ఎక్కిన తర్వాత నుంచి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కు వేర్వేరుగా వెళ్లాల్సి రావటం.. అలా వెళ్లిన ప్రతిసారీ సరికొత్తగా రెడీ అయి.. ఫొటోలు తీసుకోవాలన్న ఉత్సాహం ఉన్న వారు అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలి. క్యాజువల్స్తో పాటు.. వెస్ట్రన్ ఫిట్స్ సూట్ అవుతాయి. బీచ్‌లకు వెళ్లేటప్పుడు ఎలాంటి దుస్తుల్ని ఎంపిక చేసుకుంటామో అలాంటివి వెంట తీసుకోవటం మంచిది. స్విమ్మింగ్ దుస్తుల్ని వేరుగా ప్యాక్ చేసుకోవాలి. చెప్పులతో పాటు షూస్.. స్పోర్ట్స్ షూస్ తెచ్చుకోవాలి. మహిళలు పెన్సిల్ హీల్ లాంటి వాటిని తెచ్చుకోవచ్చు కానీ.. పరిమిత సమయాల్లో మాత్రమే వాటిని వాడే వీలుంటుంది.
ఫుడ్ మాటేంటి?
కార్డేలియా క్రూయిజ్‌లో తిన్న వారికి తిన్నన్ని రుచులు. వెజ్.. నాన్‌వెజ్‌తో పాటు.. జైన్ ఫుడ్ కూడా ఉంటుంది. త్రీ స్టార్ హోటల్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్‌లోనూ నాలుగైదు రకాల టిఫిన్లతో పాటు.. బ్రెడ్.. పాలు.. కాఫీ.. టీ.. కార్న్‌ఫ్లేక్స్ లాంటి అన్ని రకాలు ఉంటాయి. లంచ్.. డిన్నర్‌లలోనూ ఎలాంటి లోటు ఉండదు. కాకుంటే.. రైస్ విషయంలో కాస్తంత రాజీ పడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం.. సాయంత్రం అన్నం.. పప్పు.. కూరలు లాంటి వాటిని మాత్రమే తినే వారికి కొంత అసౌకర్యం ఉంటుందే కానీ ఇబ్బంది పడేలా ఉండదు. క్రూయిజ్ ఎక్కే వేళలోనూ.. దిగే వేళలోనూ కాసింత నిరాశ తప్పదు. దీనికి కారణం.. తక్కవ వ్యవధిలో 1800 మంది బోర్డింగ్ కావటం.. అదే సమయంలో దిగిపోవాల్సి రావటం. మిగిలిన అన్నీ సందర్భాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి రోజూ ఏమేం కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఉంటాయన్న విషయాన్ని తెలిపే న్యూస్ లెటర్లు ముందు రోజు సాయంత్రానికే రూంలో ఉంటాయి. దీంతో.. తర్వాతి రోజును పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. వేర్వేరు చోట్ల జరిగే ప్రోగ్రాంలను జాగ్రత్తగా చదవటం ద్వారా.. అన్నింటిని చూసేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విషయంలో వారిచ్చే న్యూస్ లెటర్స్‌ను ఆసాంతం చదవటం తప్పనిసరి.
ఇంటర్నెట్ ఖరీదు ఎక్కువ..
నడి సంద్రంలో సెల్ టవర్లు ఉండవు కదా? మరి.. ఫోన్ పని చేస్తుందా? అంటే చేస్తుందనే చెప్పాలి. శాటిలైట్ కనెక్షన్ ఇస్తారు. గంటల లెక్కన కనెక్షన్ ఇస్తారు. కాకుంటే.. ఇదంతా ఇంటర్నెట్ మాత్రమే. అంటే.. వాట్సాప్ కాల్ చేసుకునే వీలుంటుంది. వాయిస్.. వీడియో కాల్ చేసుకోవచ్చు. కాకుంటే ఇది ఖరీదైన వ్యవహారం. ఉదాహరణకు 72 గంటల ప్యాకేజీ తీసుకుంటే దాదాపు రూ. 6 వేలకు పైనే చెల్లించాలి.