వినాయక్‌ త్రిపాత్రాభినయం

ABN , First Publish Date - 2022-09-25T06:57:13+05:30 IST

దర్శకుడిగా తిరుగులేని విజయాలు అందుకొన్నారు వి.వి.వినాయక్‌. కొంతకాలంగా ఆయన కెరీర్‌ స్థబ్దుగా సాగుతోంది.

వినాయక్‌ త్రిపాత్రాభినయం

ర్శకుడిగా తిరుగులేని విజయాలు అందుకొన్నారు వి.వి.వినాయక్‌. కొంతకాలంగా ఆయన కెరీర్‌ స్థబ్దుగా సాగుతోంది. అయితే ఇటీవలే ఆయన ట్రాక్‌ ఎక్కారు. తెలుగులో ఘన విజయం సాధించిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని ఆయన హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరో. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వినాయక్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ చిత్రానికి వినాయక్‌ దర్శకత్వం వహిస్తారని, నిర్మాతగా వ్యవహరిస్తారని, అలా... త్రిపాత్రాభినయం చేయబోతున్నారని టాక్‌. వినాయక్‌ హీరోగా ‘శీనయ్య’ అనే చిత్రం క్లాప్‌ కొట్టుకొని ఆగిపోయింది. ఆ తరవాత... వినాయక్‌ హీరోగా సినిమా చేయాలని కొంతమంది నిర్మాతలు ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు వినాయక్‌ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. మరోవైపు.. దర్శకుడిగానూ ఆయనకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ‘ఛత్రపతి’ని రీమేక్‌ చేస్తున్న పెన్‌ స్డూడియోస్‌ సంస్థ వినాయక్‌తోనే మరో భారీ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ‘ఛత్రపతి’ విడుదలయ్యాక పెన్‌ స్డూడియోస్‌ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. 

Read more