వేమనే దైవం...ఆయన పద్యాలే మంత్రాలు...

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

విత్వమే ఆయుధంగా సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడిన ప్రజాకవి వేమన. ఉపమానాలు, సామెతలతో జానుతెనుగులో పద్యాలల్లిన ఆ మహాయోగి......

వేమనే దైవం...ఆయన పద్యాలే మంత్రాలు...

కవిత్వమే ఆయుధంగా సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడిన ప్రజాకవి వేమన. ఉపమానాలు, సామెతలతో జానుతెనుగులో పద్యాలల్లిన ఆ మహాయోగి... నెల్లూరు జిల్లా పల్లిపాడులో దైవంగా పూజలందుకుంటున్నారు. సుమారు 250 ఏళ్ళ నాటి ఈ ఆలయానికి దళితులు పుజారులుగా కొనసాగుతూండడం విశేషం.


రాయలసీమ ప్రాంతంలో జన్మించి, కడప జిల్లా పామూరు కొండ గుహలో సమాధి అయిన వేమన పద్యాలు.... దాదాపు మూడువందల డెబ్భై ఏళ్ళ నుంచీ తెలుగు ప్రజల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి. యోగి వేమనగానూ ఖ్యాతి పొందిన ఆ మహాకవి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో... పెన్నా నదీ తీరంలోని ఆలయంలో కొలువుతీరాడు. 


పల్లిపాడు గ్రామంలోకి చాలాకాలం దళితులకు ప్రవేశం ఉండేది కాదు. 1921 ఏప్రిల్‌ 7న మహాత్మా గాంధీ అక్కడకు వచ్చి, పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. దళితులకు గ్రామప్రవేశం కల్పించాల్సిందేనని స్పష్టం చేసి, వారితో పాటే పల్లిపాడులోకి అడుగు పెట్టారు. కాగా... అంతకుముందూ, ఆ తరువాతా కూడా దళితులు ప్రధానంగా దర్శించుకొనే ఆలయం ఇదే. 


ఈ ఆలయంలో నిత్య హారతి, నైవేద్యాలతో పాటు శనివారం ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ‘శ్రీ జై వేమనా.. భక్త యోగేశ్వరా.. ఏ జన్మ ఫలమో.. నీ పాదాలు పొందు భాగ్యమో...’ అంటూ ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాల్లో... వేమన పద్యాలనే మంత్రాలుగా పఠిస్తారు. ప్రతి ఏడాదీ జూన్‌, జులై నెలల్లో తిరునాళ్ళు జరుపుతారు. ఈ ఆలయం 250 ఏళ్ళ క్రితం నాటిదనీ, దీన్ని ఎవరు నిర్మించారో తెలియదనీ గ్రామస్తులు చెబుతున్నారు. చాలాకాలం మట్టి గోడల పూరి పాకలో ఈ ఆలయం కొనసాగింది. 1967లో పక్కా భవనం నిర్మించారు.


ఈ ఆలయానికి దళితులే పూజారులు. దాదాపు ఆరు తరాలుగా దార్ల నరసయ్య కుటుంబం ఆలయ నిర్వహణ చేస్తోంది. దళితవాడలోని ప్రతి ఇంట్లో... ఇద్దరు ముగ్గురి పేర్లు... వేమన పేరు కలిసి ఉంటాయి. వారు వేమనను మహా శక్తిగా ఆరాధిస్తారు. తమ వాడంతా వేమననే పూజిస్తామనీ, తమకు కలిగింది ప్రసాదంగా పెడతామనీ, ఆయన కవి అయినా, పండితుడైనా తమకు మాత్రం దేవుడనీ స్థానికులు చెబుతున్నారు. ఆలయంలో అఖండదీపం కొనసాగుతూ ఉంటుంది. శనివారం వాడవాడంతా ఆలయానికి వచ్చి, భజనలు చేస్తారు. పంటలో కొంత భాగం ఆలయానికి ఇస్తారు. సంక్రాంతికి పొంగళ్ళు నివేదించి, ఉత్సవం చేస్తారు. 

ఈతకోట సుబ్బారావు, నెల్లూరు నెల్లూరు 

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST