ఈ కృషి... ఇవాళ్టిది కాదు!

ABN , First Publish Date - 2022-07-20T06:48:32+05:30 IST

సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ తర్వాతే విదేశీ విద్య గురించి ఆలోచించడం మొదలు పెడతారు.

ఈ కృషి... ఇవాళ్టిది కాదు!

భవిష్యత్తుకు బాటలు వేసుకోవడమనే మాట మనందరం వింటూనే ఉంటాం. ఆ పనిని 

ఇంటర్‌లోనే మొదలుపెట్టింది హైదరాబాద్‌ మల్కాజ్‌గిరికి చెందిన శ్రీయ లక్కాప్రగడ.

ఇంటర్‌ తర్వాత కాలేజీ చదువు కోసం అమెరికాలోని ప్రముఖ వెల్లెస్లీ కాలేజీలో సీటు

సంపాదించడమే కాకుండా, ఏకంగా 2.7 కోట్ల స్కాలర్‌షి్‌పను కూడా సొంతం చేసుకుంది.

పక్కా ప్రణాళికతో సాగిన తన ఫ్యూచర్‌ ప్లానింగ్‌ గురించి శ్రీయ నవ్యతో పంచుకున్న విశేషాలు...


సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ తర్వాతే విదేశీ విద్య గురించి ఆలోచించడం మొదలు పెడతారు. కానీ ఇంటర్‌ తర్వాత అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విదేశీ కాలేజీల్లో చదివే వీలుంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాలేజీలు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. అయితే ఎంతో ముందుగానే ఆ కాలేజీలు, కోర్సుల గురించిన అవగాహన పెంచుకోవాలి. నా మటుకు నా కెరీర్‌ ప్లానింగ్‌ పదో తరగతిలోనే మొదలుపెట్టాను. ఇంటర్లో ఏం చదవాలో, ఇంటర్‌ తర్వాత ఏ విదేశీ కాలేజీలో, ఎలాంటి కోర్సును ఎంచుకోవాలో ముందు నుంచే నాకు స్పష్టత ఉంది. 


ప్రతిష్ఠాత్మకమైన కాలేజీ కాబట్టే...

నేను వెల్లెస్లీ కాలేజీతో పాటు ఇంకొన్ని విదేశీ కాలేజీలకు కూడా అప్లై చేశాను. అయితే అన్నిటికంటే వెల్లెస్లీ కాలేజీ ప్రతిష్ఠాత్మకమైనది కాబట్టి దీనికే నా తొలి ప్రాధాన్యం. ఈ కాలేజీని 1870లో స్థాపించడం జరిగింది. సెవెన్‌ సిస్టర్స్‌ కాలేజీల్లో ఇదొకటి. పైగా ఇది మహిళల కాలేజీ. హిల్లరీ క్లింటన్‌, మ్యాడిలీన్‌ అల్‌బ్రైట్‌ (మాజీ యుఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌) ఈ కాలేజీ విద్యార్థులే! ఎంతో మంది ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ వేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఈ కాలేజీలో చదువుకున్నారు. అలాగే ఈ కాలేజీలో చదువుతూనే వేరే కాలేజీల్లో క్రాస్‌ రిజిస్టర్‌ చేసుకుని, క్లాసులకు హాజరయ్యే సౌలభ్యం కూడా ఉంది. అలాంటి ప్రతిష్ఠాత్మక కాలేజీలో కేవలం సీటు దొరికితే చాలనుకున్న నాకు ఏకంగా 2.7 కోట్ల స్కాలర్‌షి్‌పను కాలేజీ ఆఫర్‌ చేయడం నా అదృష్టం. ఇది నేను ఊహించని విషయం. జనవరి 8న నేను కాలేజీ సీటు కోసం అప్లై చేశాను. సీటు వచ్చిన విషయం, మార్చిలో మెయిల్‌ ద్వారా తెలిసింది. ఆ తర్వాత నెల రోజులకే ఏప్రిల్‌లో నేను స్కాలర్‌షి్‌పకు ఎంపికైనట్టు కాలేజీ నుంచి మరొక మెయిల్‌ అందింది. స్కాలర్‌షి్‌పలో ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌, భోజన ఖర్చులతో పాటు, పుస్తకాలు, వ్యక్తిగత ఖర్చులు, విమాన టిక్కెట్ల ఖర్చులు కూడా కవర్‌ అవుతాయి. నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా నాకెంతో ఇష్టమైన కంప్యూటర్‌ సైన్స్‌, సైకాలజీ సబ్జెక్ట్స్‌ ఎంచుకున్నాను. ఈ నాలుగేళ్ల కాలంలో నేను ఇండియాకు వచ్చి వెళ్లడానికి అవసరమైన విమాన టిక్కెట్ల ఖర్చులు కూడా కాలేజీ స్కాలర్‌షి్‌పలో కలిసి ఉంటాయి. 


విదేశీ విద్యకు ప్రణాళిక ఇలా...

పోటీ ప్రపంచంలో కెరీర్‌ డెవల్‌పమెంట్‌ ప్లానింగ్‌ ఎంతో ముందు నుంచే మొదలుపెట్టాలి. నేను ఇంటర్‌ చదివే సమయంలోనే  డెక్స్‌టరీ గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌లో కెరీర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాంలో చేరిపోయాను. ఈ ప్రోగ్రాం ద్వారా విదేశీ కాలేజీలకు అప్లికేషన్‌ పెట్టే విధానాలు, విదేశీ చదువు విధానం, దాంతో పొందే ప్రయోజనాల గురించి నేర్చుకున్నాను. అలాగే అప్లికేషన్‌ ప్రక్రియలో కూడా డెల్టా కాలేజీ, డెక్స్‌టరీ గ్లోబల్‌ సహాయపడ్డాయి. అయితే సీటుతో పాటు స్కాలర్‌షిప్‌ కూడా పొందగలగడానికి, నేను అప్లికేషన్‌లో నింపిన వివరాలే కారణమని అనుకుంటున్నాను. అప్లికేషన్‌లో వ్యక్తిగత వివరాల్లో భాగంగా ఆర్థిక, కుటుంబ స్థితిగతులను కూడా వివరించవలసి ఉంటుంది. అలాగే కొన్ని వ్యాసాలను కూడా రాయవలసి ఉంటుంది. సాధారణంగా ఏ విదేశీ కాలేజీకి అప్లై చేసుకుంటున్నా, అప్లికేషన్‌ భర్తీ నిజాయితీగా సాగాలి. కాలేజీ యాజమాన్యానికి మన నిబద్ధత, పట్టుదలల పట్ల నమ్మకం కలిగించాలి. సీటు పరంగా, స్కాలర్‌షిప్‌ పరంగా వేర్వేరు కాలేజీలు వేర్వేరు ప్రాధామ్యాలను అనుసరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి వాకబు చేసి, పూర్వ విద్యార్థులను సంప్రతించి సలహాలు తీసుకోవడం కూడా అవసరమే!


నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక, మాస్టర్స్‌ కూడా అమెరికాలోనే చదవాలనేది నా ఆలోచన. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన రంగంలో స్థిరపడాలని ఉంది. అయితే నేను రీసెర్చ్‌ వర్క్‌ చేసినా, ఇండస్ట్రీ వైపు వెళ్లినా నా పని సమాజానికి ఉపయోగపడేలా చూసుకుంటాను. 

గోగుమళ్ల కవిత


విదేశీ విద్య చదువుకోవాలని ఆశపడడంలో తప్పు లేదు. విద్యార్థులందరూ అందుకు అర్హులే! అయితే విదేశీ విద్య కోసం ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి. విదేశీ కాలేజీలు, సీట్ల ఎంపిక విధానాల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యంగా అప్లికేషన్‌ భర్తీ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అనుభవజ్ఞులు, పూర్వ విద్యార్థులు, లెక్చరర్ల సలహాలు తీసుకోవాలి. సాధారణంగా సామాజిక మాధ్యమాలు విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నాయని అంటూ ఉంటారు. కానీ తప్పు వాటిది కాదు విద్యార్థులదే! నియంత్రణ విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది. వాటి కారణంగా చదువు దెబ్బ తింటోందని గ్రహించిన వెంటనే, వాటిని దూరం పెట్టేయాలి. 


నేను పుట్టింది, పెరిగిందీ హైదరాబాద్‌లోనే. 10వ తరగతి భారతీయ విద్యాభవన్‌లో, ఇంటర్‌... డెల్టా జూనియర్‌ కాలేజీలో చదివాను. వచ్చే ఆగస్టు చివర్లో అమెరికాకు ప్రయాణం కాబోతున్నాను. నా విజయం వెనక అమ్మ నీలియ, మామయ్యలు, కజిన్ల సహాయ సహకారాలు ఉన్నాయి. ‘అమెరికా వెళ్లి చదువుకుంటాను’ అన్నప్పుడు అమ్మ... వద్దు అనకుండా, నా వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఆమె తోడ్పాటు వల్లే నేను అనుకున్నది సాధించగలిగాను. 

Updated Date - 2022-07-20T06:48:32+05:30 IST