సిరులిచ్చే కల్పవల్లి

ABN , First Publish Date - 2022-10-07T09:57:21+05:30 IST

విజయనగరంలో దాదాపు రెండున్నర శతాబ్దాల కిందట వెలసి.... తరతరాలుగా జనావళిని అనుగ్రహిస్తున్న పైడిమాంబను పిలిస్తే పలికే దైవంగా భక్తులు ఆరాధిస్తారు.

సిరులిచ్చే కల్పవల్లి

భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకుంటున్న పైడిమాంబ ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. ఆమె సాక్షాత్తూ విజయవాడ కనకదుర్గమ్మ అంశ అని భక్తుల విశ్వాసం.


విజయనగరంలో దాదాపు రెండున్నర శతాబ్దాల కిందట వెలసి.... తరతరాలుగా జనావళిని అనుగ్రహిస్తున్న పైడిమాంబను పిలిస్తే పలికే దైవంగా భక్తులు ఆరాధిస్తారు. విజయనగర సంస్థానాధీశులకు విజయవాడ కనకదుర్గమ్మ ఇలవేల్పు. ఆ తల్లికి మడులు, మాన్యాలను సమర్పించి, అర్చించారు. వారి భక్తికి మెచ్చిన ఆమె... పైడిమాంబ రూపంలో... అంశగా జన్మించిందని నమ్మిక. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి... పదహారు రోజుల పాటు కన్నుల పండువగా పైడిమాంబ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి విదేశాల నుంచి సైతం ఎంతోమంది వస్తారు. ఉత్సవాలలో ప్రధానమైనది సిరిమాను సంబరం. విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాక... విజయదశమి తరువాత వచ్చే మంగళవారం రోజున... విజయనగరంలో సిరిమాను సంబరం జరుగుతుంది. ఇది రెండు రోజుల వేడుక. ఈ సందర్భంగా నగరమంతా విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు, ఆటల పోటీలు, ఉద్యానవన ప్రదర్శనలు... ప్రధానంగా పులివేషాలు... సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి.


పైడితల్లి చరిత్ర

పైడిమాంబను పైడితల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలు పిలుచుకుంటారు. పైడిమాంబ చరిత్ర... బొబ్బిలి యుద్ధం కాలం నాటిది. ఆమె విజయనగర రాజుల ఆడపడుచు. విజయరామరాజు సోదరి. ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించే వ్యక్తి. ఉత్తరాంధ్రపై అధికారం సాధించాలనుకున్న ఫ్రెంచి సేనాని బుస్సీ మాయలో పడిన విజయరామరాజు... బొబ్బిలి సంస్థానం మీద యుద్ధానికి తెరతీశాడు. యుద్ధం వల్ల వినాశనం తప్పదని అన్నకు ఎన్నోవిధాలుగా నచ్చజెప్పడానికి పైడిమాంబ ప్రయత్నించింది. కానీ ఆ మాటలను విజయరామరాజు పెడచెవిన పెట్టి, యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధం ఇరు సంస్థానాల్లోనూ విషాదాన్ని నింపింది. పైడితల్లి హృదయం తల్లడిల్లింది. కోట వెనుక ఉన్న పెద్ద చెరువులోకి దూకి, తనువు చాలించి, కనకదుర్గమ్మలో లీనమయింది. ఆ తరువాత... విజయరామరాజుకు సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడి కలలో కనిపించి... తన శరీరం నాశనమైనా, ఆత్మ జీవించే ఉందనీ చెప్పింది. పెద్ద చెరువులో విగ్రహం రూపంలో ఉన్నాననీ, దాన్ని బయటకు తీసి, ఒడ్డునే ప్రతిష్ఠించాలనీ, అక్కడి నుంచే రెండు సంస్థానాల్లోని ప్రజల యోగక్షేమాలనూ చూస్తాననీ వెల్లడించింది. అప్పలనాయుడు జాలరులను పంపి, చెరువులోనుంచి విగ్రహాన్ని తీయించాడు. గట్టునే గుడి కట్టించి, పైడితల్లిని ప్రతిష్ఠించాడు. అదే ప్రస్తుతం విజయనగరం రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వనం గుడి. 1758 నాటి సంఘటన ఇది. పైడితల్లి ఆనతి ఇచ్చిన విధంగా... విజయదశమి తరువాత వచ్చే తొలి మంగళవారం రోజున... సిరిమాను ఉత్సవాన్ని అప్పలనాయుడు ప్రారంభించాడు. పైడితల్లికి ప్రతీకగా... ప్రప్రథమంగా సిరిమానును అధిరోహించాడు. అప్పటి నుంచి ఆ వంశీయులే సిరిమానును అధిష్ఠిస్తున్నారు. 


సిరిమాను శోభ

ప్రతి సంవత్సరం సిరిమాను ఉత్సవం కోసం... యాభై అడుగుల పొడవు ఉండే చింత చెట్టును ఎంపిక చేస్తారు. ఆ చెట్టు ఎక్కడ ఉన్నదీ ప్రధాన పూజారి కలలో పైడితల్లి కనిపించి చెబుతుందంటారు. ఆ చెట్టును వెతికి, పూజలు చేసి, నరికి, సిరిమానుగా రూపొందిస్తారు. దాన్ని ఒక బండిపై అమరుస్తారు. పైడితల్లికి ప్రతీకగా... పూజారి కూర్చోవడానికి వీలుగా ఒక ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు. సిరిమానుకు ముత్తైదువలు పసుపు రాసి, కుంకుమ పెట్టి, నూతన వస్త్రాలు చుట్టి, పండ్ల గెలలు కట్టి... ముస్తాబు చేస్తారు. పూర్వకాలంలో ఈ ఉత్సవం వనం గుడి దగ్గర జరిగేది. నగరం పెరిగిన తరువాత.. మూడులాంతర్లు ప్రాంతంలో మరొక గుడిని నిర్మించారు. ఆ తరువాత అక్కడి నుంచే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో... వంశపారంపర్యంగా కొన్ని సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటిలో బెస్తవారి వల ఒకటి. అమ్మవారి విగ్రహాన్ని చెరువులోనుంచి బయటకు తీసిన జాలర్ల తరఫున... చేప ఆకారంలో... బెస్తవారి వల ముందు వరుసలో ఉంటుంది. ఇక వనం గుడిని పరిరక్షించిన ఆటవికులు ఈటెలు, బల్లేలతో నడుస్తారు. మరొకటి అంజలి రథం. అమ్మవారి పరిచారికలకు ప్రతీకగా... అయిదుగురు పురుషులు... స్త్రీ వేషధారులై, ఒక బండి చక్రం మీద కూర్చొని, అంజలి ఘటిస్తూ వెళ్తారు. పూర్వం రాజులు ఉత్సవాల సందర్భంగా...  ఏనుగు అంబారీపై ప్రధాన వీధుల్లో ఊరేగుతూ, ప్రజల అభివాదాలను స్వీకరించేవారు. అది గుర్తు చేసేలా... తెల్ల ఏనుగు ఆకృతిని రూపొందించి, వీధుల్లో తిప్పుతారు. అన్నిటికన్నా వెనుక... పైడితల్లికి ప్రతీకగా పూజారి అధిరోహించిన సిరిమాను... చదురు గుడి (మూడు లాంతర్ల దగ్గర ఉన్న ఆలయం) నుంచి కోట వరకూ తిరుగుతుంది. లక్షలాది భక్తులు పైడితల్లిని కీర్తిస్తూ... దిక్కులు పిక్కటిల్లేలా చేసే జయజయధ్వానాలతో సిరిమాను మూడుసార్లు సాగించే ప్రయాణంతో ఉత్సవం ముగుస్తుంది. తొలి విడతలో... కోట దగ్గర రాజవంశీకులు... పైడితల్లికి లాంఛనాలను జరిపిస్తారు. సిరిమాను ఉత్సవం ముందు రోజైన తొలేళ్ళ సంబరం సందర్భంగా... ఆ రాత్రి విజయనగర సంస్థానాధీశులు చదురుగుడిలో పైడితల్లిని దర్శించి, పట్టువస్త్రాలు, ఫలహారాలు సమర్పిస్తారు. పూజలు చేస్తారు. 

సిరులిచ్చే కల్పవల్లిగా భక్తుల హృదయాల్లో పైడిమాంబ కొలువుతీరింది. సిరిమాను... అంటే చింత చెట్టు... చింతలను తీరుస్తుందనీ, సిరిమానుపై కొలువైన పైడిమాంబను దర్శించి, ఆరాధిస్తే... కోరిన కోరికలను సఫలం చేస్తుందనీ నమ్మిక. 

ఆయపిళ్ళ రాజపాప


11న విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవం

పైడిమాంబను పైడితల్లిగా భక్తులు  పిలుచుకుంటారు. పైడిమాంబ చరిత్ర... బొబ్బిలి యుద్ధం కాలం నాటిది. ఆమె విజయనగర రాజుల ఆడపడుచు. విజయరామరాజు సోదరి.

Read more