ఆరోగ్యానికి ఊతం నేతి అన్నం

ABN , First Publish Date - 2022-08-06T05:47:09+05:30 IST

రకరకాల రుచులతో, పుష్ప, పత్ర, ఫలాలతో, సుగంధభరితంగా చిత్రాన్నాల్ని, పాయసాల్ని, పానకాల్ని వండే విధానాలను నలుడు..

ఆరోగ్యానికి ఊతం నేతి అన్నం

రకరకాల రుచులతో, పుష్ప, పత్ర, ఫలాలతో, సుగంధభరితంగా చిత్రాన్నాల్ని, పాయసాల్ని, పానకాల్ని వండే విధానాలను నలుడు పాకదర్పణంలో చెప్పాడు. మనం ఊహించని రీతిలో మల్లెపూలు, సంపంగిపూలు, కలువపూలను కూడా ఆహార పదార్థాలుగా మలిచిన ఘనత నలుడిదే! 


శరీరం స్నిగ్ధత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే, కమ్మని నెయ్యి వాడకం అప్పుడప్పుడూ అయినా తప్పనిసరి. ‘మనుషుల్లారా! నెయ్యి మానేయండి’ అంటూ నేతిని ఏ మాత్రం తగలకూడని ఒక విష పదార్థంగా ప్రచారం చేస్తున్నారు. విషపూరితమైన రిఫైండ్‌ నూనెల్ని, నిస్సారమైన పిజ్జాల్ని, మైదా, బొంబాయి రవ్వ వంటకాల్ని నిరభ్యంతరంగా తినిపిస్తున్నారు. సామాజిక దృష్టితో ప్రజలకు సరైన మార్గదర్శనం చేయాల్సిన వైద్యారోగ్య రంగాలు ఈ అంశంలో మౌనం దాలుస్తున్నాయి. దానివల్ల ప్రజల్లో ఏది పోషకమో, ఏది విషమో తెలియని పరిస్థితి. నలుడి పాకదర్పణం ఈ విషయంలో మనకు చక్కని మార్గదర్శనం చేస్తోంది. భోజనానికి ముందు ఓ చిన్న చెంచాడు నెయ్యి అరచేతిలో వేసుకుని తీర్థం తీసుకున్నట్టు తీసుకుంటే జీర్ణశక్తి బలపడి పేగులు దృఢంగా అవుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అగ్నికి ఆజ్యం అన్నారు కదా! నెయ్యి జఠరాగ్నిని ప్రజ్వరిల్లచేస్తుంది. కల్తీ నెయ్యికి ఈ గుణాలు లేకపోవచ్చు. నమ్మకమైన నెయ్యి దొరికితే ఈ నెయ్యన్నం మేలు చేస్తుంది. 


నలుడు అన్నంలో నెయ్యినీ, ఇతర సుగంధ ద్రవ్యాలనూ చేర్చి, ‘ఘృత అన్నపాకం’... అంటే నేతి అన్నాన్ని తయారు చేసే విధానాన్ని వివరించాడు. సన్నగా పొడవుగా కంటికింపుగా ఉండే బియ్యాన్ని తీసుకుని చక్కగా ఉడికేలా వండి, రెండు గిన్నెల్లోకి తీసుకోండి. ఒక దానిలో తగినంత సైంధవ లవణాన్ని, రెండో దానిలో తగినంత నెయ్యినీ కలపండి. ఇప్పుడు ఉప్పు కలిపిన అన్నాన్ని ఇవతలకు తీసుకొని, నేతిలో వేగిన అప్పడాల ముక్కలు, అల్లం వెల్లుల్లి, మెంతి పొడి, జీలకర్ర, ధనియాల పొడి... వీటిని తగుపాళ్లలో కలపాలి. అందులో ఇందాకటి నేతి అన్నాన్ని కలపాలి. ఈ మొత్తం ఘృతాన్నంలో మొగలి పూరేకుల్ని ముక్కలుగా కత్తిరించి కలిపితే సుగంధభరితం అవుతుంది. వేడి చల్లారాక అందులో కస్తూరి, పచ్చకర్పూరం కొద్దికొద్దిగా చేర్చాలి. ‘ఘృతమన్నం మిదం రమ్యం బలవృద్ధికరం భవేత్‌! రుచ్యం, పిత్తహరం నిత్యం చక్షురింద్రియ వర్థనం- ఈ నెయ్యన్నం చాలా ఇంపుగా, రుచికరంగా ఉంటుంది, బలాన్నిస్తుంది. పైత్యాన్ని పోగొడుతుంది. ఎసిడిటీని, అల్సర్లను తగ్గిస్తుంది. కంటి చూపును పెంచుతుంది’ అని వివరించాడు నలుడు. ఘృతాన్నం ఆరోగ్యానికి మంచిది. జీర్ణశక్తిని పెంపొందించే ద్రవ్యాలతో కలిపి దీన్ని తయారు చేస్తారు కాబట్టి, అపకారం చెయ్యదు. శరీరాన్ని మృదువుగా మారుస్తుంది. 


ఆయుర్వేద గ్రంథాల్లో ‘ఘృతమరీచి’ అనే ఆహార పదార్థం గురించి ఉంది. వేడి అన్నంలో నెయ్యి, మిరియాలపొడి తగినంత కలిపితే అదే ఘృత మరీచి. దీన్ని మొదటి ముద్దగా తింటే అది అనేక రోగాలను నయం చేసే ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. భుక్తాయాసం కలగకుండా ఉంటుంది. చదువుకునే పిల్లలకు పెడితే ఐక్యూ స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పరీక్షలకు వెళ్ళేప్పుడు వాళ్లకు తప్పనిసరిగా పెట్టండి. బుద్ధివర్థకంగా ఉంటుంది. కడుపులో ఎలికపాములు పోతాయి. ఎలర్జీ వ్యాధులు తగ్గుతాయి. చర్మవ్యాధుల మీద పని చేస్తుంది. నోటి, కంఠ రోగాలను పోగొడుతుంది. శరీరానికి బలాన్నిస్తుంది. ఇది వేద కాలం నుంచి మనకు అలవాటుగా ఉన్న భోజన పదార్థం. సాంఖ్యాయన అరణ్యకంలో కూడా దీని ప్రస్తావన ఉంది. 


తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయంలోనూ, కడప ఒంటిమిట్ట రాములవారి దేవాలయంలోనూ ఇంకా చాలా వైష్ణవాలయాలలో సాయంత్రం పూట ‘మళహోర’ అనే ప్రసాదాన్ని పెడతారు. నెయ్యి, మిరియాల పొడి కలిపి వండిన అన్నం ఇది. దీన్ని తమిళులు ‘మిలగోరై’ అంటారు. ఇలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము పొడి వగైరాలతో కూడా మళహోర వండుకోవచ్చు. నలుడు చెప్పిన ఘృతాన్నాన్ని ఈ విధంగా ఎవరికివారు రకరకాలుగా చేసుకోవచ్చు. 

గంగరాజు అరుణాదేవి

Updated Date - 2022-08-06T05:47:09+05:30 IST