అక్కడ పరిశోధనే... నా ఆశయం

ABN , First Publish Date - 2022-05-25T07:37:32+05:30 IST

‘‘క్యాన్సర్ల మీద అధ్యయనం చేయడం మొదటి నుంచి నాకు ఆసక్తి. అందులోనూ రొమ్ము క్యాన్సర్‌ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుండేది.

అక్కడ పరిశోధనే... నా ఆశయం

ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు బాగా తినాలి. అలా అని కొన్ని రకాల క్రిమి సంహారక మందులతో పండించిన పండ్లు, కూరగాయలు తింటే మాత్రం రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తప్పదు అంటున్నారు యువ పరిశోధకురాలు డా. తమ్మినేని కృష్ణలత. ఇదే అంశం మీద ఆమె అధ్యయనం చేసి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. తద్వారా ప్రొటీన్స్‌కు సంబంధించిన కొత్త విషయాలనూ వెలుగులోకి తెచ్చారు. మెడిసిన్‌ చదవాలన్న తన కల ఆర్థిక పరిస్థితుల వల్ల నెరవేరలేదు. అయినా, తనదైన ప్రతిభతో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పాఠాలు బోధించే స్థాయికి ఎదిగిన కృష్ణలత ను ‘నవ్య’ పలకరించింది. 


‘‘క్యాన్సర్ల మీద అధ్యయనం చేయడం మొదటి నుంచి నాకు ఆసక్తి. అందులోనూ రొమ్ము క్యాన్సర్‌ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుండేది. ఇప్పుడు పల్లె, పట్టణం తేడా లేకుండా చాలామంది జబ్బు బారిన పడుతున్నారు. ఆ మార్పును గమనించిన నాకు, బహుశా! పెస్టిసైడ్స్‌ ప్రభావం దానికేమైనా కారణమా అనే అనుమానం కలిగింది. అప్పుడు నా పీహెచ్‌డీ పరిశోధనకు ‘‘క్రిమిసంహారక మందుల ప్రభావంతో రొమ్ముక్యాన్సర్‌ వ్యాప్తి’’ అంశం తీసుకున్నాను. ముఖ్యంగా ఆర్గనోక్లోరైన్‌ క్రిమిసంహారక మందుల్లో సుమారు పాతిక రకాలు మన రైతులు వాడతారు. అందులో 18రకాల పురుగు మందుల మీద నేను అధ్యయనం చేశాను. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాల సాగులో ఈ మందులను విరివిగా వాడుతుంటారు. దాంతో ఈ క్రిమిసంహారక మందు అవశేషాలు పంటపై అలాగే ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆ రసాయనాలు శరీర కణజాలంలో స్థిరపడతాయి. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ నిర్మాణం, మెటబాలిజం, పురుగుమందు అవశేషాల నిర్మాణం, మెటబాలిజం మధ్య సారూప్యత ఉంటుంది. దాంతో ఆ క్రిమిసంహారక మందుల ధాతువులు డీఎన్‌ఏ పనితీరు మీద తీవ్ర ప్రభావం చూపి రొమ్ము క్యాన్సర్‌కు కారణంగా మారుతుందని నా పరిశోధనలో నిరూపించాను. మరీ ముఖ్యంగా ఎండోసల్ఫాన్‌2, గామా హెచ్‌సీహెచ్‌ వంటి ఐదు రకాల రసాయనాల వల్ల రొమ్ము క్యాన్సర్‌ వ్యాప్తి ఎక్కువ అవడం గమనించాను. 


రెండు వందలమంది కణజాలంపై ప్రయోగం...

నా పరిశోధన కేవలం ప్రయోగశాలకు పరిమితమైంది కాదు. చికిత్స కోసం వచ్చిన వంద మంది రొమ్ము క్యాన్సర్‌ రోగులను కలిసి, వాళ్లను ఒప్పించి మరీ ఒక్కొక్కరి నుంచి క్యాన్సర్‌ కణజాలాన్ని సేకరించాను. అంతకు ముందుగా వారి ఆహారపు అలవాట్లు తెలుసుకున్నాను. దాంతో వారంతా క్రిమిసంహారక మందులకు ప్రభావితం అయినట్లు నిర్ధారించుకున్నాను. తరువాత క్యాన్సర్‌ రహిత గడ్డలతో బాధపడుతున్న మరో వంద మంది కణజాలాన్ని తీసుకున్నాను. ఆ రెండిటిని పరీక్షించాను. తద్వార ఒక్కొక్క పురుగు మందు ప్రభావంతో రొమ్ము క్యాన్సర్‌ వ్యాప్తిస్థాయిల్ని గుర్తించాను. ఆ క్రమంలో రొమ్ము క్యాన్సర్‌ త్వరగా కాలేయం, ఊపిరితిత్తులకు వ్యాపించడానికి దోహదపడే కొన్నిరకాల ప్రొటీన్లనూ గుర్తించాను. వీటిమీద నేను రాసిన ఏడు పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 


మగవాళ్లకూ రొమ్ముక్యాన్సర్‌...

క్రిమిసంహారక మందుల ప్రభావంతో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గతంలో కొన్ని పరిశోధనలు వెలుగుచూశాయి. కానీ రొమ్ము క్యాన్సర్‌ వ్యాప్తి  స్థాయిని గుర్తించిన పరిశోధన బహుశా ఇదే అనుకుంటా.  పురుగుమందుల వాడకంతో హార్మోన్‌ వ్యవస్థ చిన్నాభిన్నం అవడం. ఒక్కొక్కసారి పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతినడం. థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం. మూత్రపిండాల సమస్యలు, నరాల బలహీనత, అల్జీమర్స్‌, పార్కిన్సన్‌ వంటి జబ్బులు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో మగవాళ్లలోనూ రొమ్ము క్యాన్సర్‌ ఎక్కువగా చూస్తున్నాను. అందుకు పురుగుమందులు ఒక కారణం కావచ్చు. కనుక ఈ మందుల వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలి. చాలా దేశాల్లో ఆర్గనోక్లోరైన్‌ క్రిమిసంహారక మందులను నిషేధించారు. కానీ మన వద్ద మాత్రం కొన్ని పరిమితులు మాత్రమే విధించారు. విషపూరితమైన రసాయనాలకు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. లేకుంటే, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతాయి. ఢిల్లీలోని యమునా నదిలోనూ పరిమాణానికి మించి హానికర రసాయనాలను గుర్తించారు. గతంలో కేరళలోనూ ఎండోసల్ఫాన్‌ విరివిగా వాడటంతో, కొన్ని వందల పశు, పక్షాదులు చనిపోయాయి. కనుక ఇకమీదటైనా మనం కళ్లు తెరవాలి. మనుషుల ప్రాణాలను తీయడంతో పాటు జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే క్రిమిసంహారక మందుల వాడకాన్ని నిలువరించాలి. అదే నా పరిశోధన సారాంశం కూడా.


కరోనా కష్టకాలంలో సేవ...

ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు నా చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే కొనసాగింది. అలా ఒక్కపైసా ఫీజు చెల్లించకుండా పూర్తిగా ఉచిత విద్యను పొందిన నేను, సమాజానికి చాలా రుణపడున్నాను. అవసరమైనప్పుడు అది తిరిగి ఇచ్చేయాలని కూడా అనుకున్నాను. కరోనా సమయంలో నాకు ఆ అవకాశం లభించింది. రెండేళ్లు ఒక మెడికల్‌ బయో కెమి్‌స్టగా రోజుకి కొన్ని వందల కొవిడ్‌ నమూనాలను పరీక్షించి, రోగ నిర్ధారణ చేశాను. పైగా అప్పుడు నేను గర్భిణీ.! అయినప్పటికి, పీపీఈ కిట్టు ధరించి మరీ ఒక్కోరోజు పదహారు నుంచి పద్దెనిమి గంటల పాటు ల్యాబ్‌లో చిన్న స్టూలు మీద కూర్చొని పనిచేసిన సందర్భాలున్నాయి. 

ఆరో నెల అప్పుడు నాకూ కొవిడ్‌ వచ్చినా, ధైర్యంగా జయించాను. కాన్పు తర్వాత కూడా ల్యాబ్‌ సేవలు కొనసాగించాను. ఆ గడ్డు రోజుల్లోనే హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్న నా భర్త చలసాని అజయ్‌ ఘోష్‌ ఉద్యోగం మానేసి మరీ, నోయిడాలో నాతో పాటు ల్యాబ్‌లో కెమి్‌స్టగా సేవలు అందించారు.

ఆ కష్టకాలంలో మా అత్త కృష్ణ తులసి, మామయ్య వెంకట రామారావు దంపతులు మాకు అండగా నిలిచారు. పేరుకి కోడలినైనా, కన్న కూతురికన్నా మిన్నగా ఆదరించే వాళ్ల ప్రేమాభిమానాలే నన్ను నా లక్ష్యంవైపు నడిపిస్తున్నాయి.  ఢిల్లీ, ఎయిమ్స్‌లో ప్రొఫెసర్‌గా స్థిరపడాలి. అక్కడ పరిశోధనా కేంద్రం నెలకొల్పి, భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్లు, మధుమేహం వంటి జబ్బుల మీద నిరంతరం పరిశోధన చేయాలి. అదే నా జీవిత ఆశయం. 

కె. వెంకటేశ్‌


ఒక పేదింటి అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించాలంటే, వాళ్ల కుటుంబ ప్రోత్సాహం ఒక్కటే సరిపోదు కదా.! ఆ విధంగా చూస్తే, నా ఉన్నత చదువులకు మా బాబాయి కేశవనాయుడు, పిన్ని లక్ష్మి అందించిన సహకారం మరువలేనిది. 


లారీలో స్కూలుకి...

మా స్వస్థలం కర్నూలు జిల్లాలోని నాగిశెట్టిపల్లి. మాదొక మారుమూల గ్రామం కావడంతో హైస్కూలు చదువుకోసం నేను రోజూ రానుపోను పన్నెండు కిలోమీటర్లు నడిచేదాన్ని. ఒక్కోరోజు నడవలేక, రాళ్లు విసిరి మరీ అటుగా వెళుతున్న లారీలు ఆపి ఎక్కేవాళ్లం. మా నాన్న ఆదినారాయణకు నన్ను బాగా చదివించాలని కోరిక. నాకేమో డాక్టర్‌ అవ్వాలని ఉండేది. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో ఆర్థిక స్థోమత లేక డిగ్రీ, బీఎస్సీ బయోటెక్నాలజీ చదివాను. తర్వాత పాండిచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (జిప్‌మెర్‌) ప్రవేశ పరీక్షలో నాకు జాతీయ స్థాయి మొదటి ర్యాంకు వచ్చింది. దాంతో అక్కడే మెడికల్‌ బయో కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశాను. ఆపై సీఎ్‌సఐఆర్‌ ప్రవేశ పరీక్షలోనూ మెరిట్‌ రావడంతో ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో చేరాను. ప్రొఫెసర్‌ బీడీ బెనర్జీ పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేసి, ఇప్పుడు డాక్టరేట్‌ పొందాను. ప్రస్తుతం నోయిడాలోని గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సలోని ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బయో కెమిస్ట్రీ బోధిస్తున్నాను.

Updated Date - 2022-05-25T07:37:32+05:30 IST