సామరస్య పరమహంస

ABN , First Publish Date - 2022-03-04T05:30:00+05:30 IST

భారతదేశం అందించిన విశిష్టమైన, స్ఫూర్తిదాయకులైన గురువుల్లో శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరు....

సామరస్య పరమహంస

(నేడు శ్రీ రామకృష్ణుల జయంతి)

భారతదేశం అందించిన విశిష్టమైన, స్ఫూర్తిదాయకులైన గురువుల్లో శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరు. ఆధ్యాత్మికరంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించి... ప్రపంచవ్యాప్తంగా ఎందరినో భగవదాన్వేషణ వైపు ఆయన నడిపించారు. ఈ ఏడాది 125వ వార్షికోత్సవాలను జరుపుకోబోతున్న రామకృష్ణ మిషన్‌ ఆవిర్భావానికి మూలం... స్వామి వివేకానందుడి లాంటి శిష్యులకు ఆయన అందించిన ప్రేరణే. 


శ్రీరామకృష్ణులు కాళీమాత ఆరాధకుడైనప్పటికీ... అన్ని మతాలనూ సమాదరించారు. మత సామరస్యాన్ని బోధించారు. ‘‘మతాలన్నీ ఆ భగవంతుడి అభివ్యక్తులే. ఒక భవనాన్ని వేరువేరు దిక్కుల నుంచి ఫొటోలు తీసినప్పుడు... అవి భిన్నంగా కనిపించచ్చు. కానీ అవన్నీ ఒక దానికి సంబంధించినవే. అవి పరస్పర దోహదకారులే తప్ప విరుద్ధమైనవి కావు. అలాగే మతాల మార్గాలు వేరు కావచ్చు, కానీ లక్ష్యం ఒక్కటే. మతాల మధ్య సామరస్యం అంటే ఏకత్వం కాదు... భిన్నత్వంలో ఏకత్వం. భగవంతుడ్ని చేరుకోవడమే వాటన్నిటి లక్ష్యం’’ అని ఆయన చెప్పారు.


మనిషిలో ఉండే ఆత్మకూ, పరమాత్మకూ మధ్య సంబంధం శ్రీ రామకృష్ణులను ఒక భక్తుడు అడిగాడు. దానికి ఆయన సమాధానం ఇస్తూ ‘‘పరమాత్మ మహా సముద్రమైతే... మనిషిలో ఉండే ఆత్మ దానిలో ఉండే చిన్న బుడగ లాంటిది. ఆ బుడగ సముద్రంలోని నీటి ద్వారానే ఏర్పడుతుంది. అక్కడే ఉంటుంది. సముద్రానికీ, ఆ బుడగకూ మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్టు కనిపించవచ్చు... కానీ అదే సమయంలో వాటి పరిమాణంలో, శక్తిలో ఉన్న వ్యత్యాసాన్ని మరచిపోకూడదు. ఒకటి బ్రహ్మాండమైనది. మరొకటి కేవలం చిన్న తునక మాత్రమే. లోకంలోని అన్నిటి ఉనికికీ పరమాత్మే మూలం, మనిషిలో ఉండే ఆత్మ తన ఉనికి కోసం ఆ పరమాత్మ మీద ఆధారపడి ఉంటుంది’’ అని వివరించారు.


శ్రీరామకృష్ణులు కొత్త మతమేదీ ప్రబోధించలేదు. ఏదో ఒక మతాన్ని పాటించాలని చెప్పలేదు.  ఎలాంటి గ్రంథాలు రాయలేదు. తన ముఖ్య శిష్యుడైన వివేకానందుడిలా ఎక్కడా ప్రసంగాలు చేయలేదు. తన వద్దకు వచ్చేవారికి చిన్న చిన్న కథలతో, నిత్య జీవితంలోని సంఘటనలతో, లోకసామాన్యమైన ఉదాహరణలతో సందేహాలను ఆయన తీర్చేవారు. ‘భగవంతుడి గురించి తెలుసుకోవడం ఎలా?’ అనే ప్రశ్నకు ఆయన ఒక సందర్భంలో బదులిస్తూ ‘‘భగవత్‌ తత్త్వం పంచదార కుప్పలాంటిది. ఒక చీమ ఆ కుప్పలో ఒక చిన్న పలుకును తీసుకోవచ్చు. మరికాస్త పెద్ద పలుకు తీసుకోవచ్చు. అన్నిటికన్నా బాగా పెద్దదిగా ఉన్న పలుకును తీసుకోవచ్చు. కానీ ఆ చీమ దేన్ని తీసుకున్నా... ఆ కుప్ప దాదాపు చెక్కుచెదరకుండానే ఉంటుంది. అదే విధంగా, భక్తులు భగవంతుడి గురించి ఒక నిర్దిష్టమైన కోణంలో మాత్రమే తెలుసుకోగలరు. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోగలిగేవారు ఎవరూ లేరు’’ అన్నారు. 


పశ్చిమబెంగాల్‌లోని కమర్పుకార్‌ అనే చిన్న గ్రామంలో... 1836 ఫిబ్రవరి 18న శ్రీ రామకృష్ణులు జన్మించారు. ఏడేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయేవరకూ ఆయన జీవితం ఆటపాటలతో ఆనందంగా గడిచింది. ఆ తరువాత ఆ కుటుబం ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నాళ్ళకు తన అన్న అకాల మరణంతో... దక్షిణేశ్వర్‌లోని కాళీమాత ఆలయంలో అర్చకుడిగా శ్రీరామకృష్ణులు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ ఆ ఆలయమే ఆయన లోకం అయిపోయింది. సంచార యోగి తోతాపురి వద్ద అద్వైత వేదాంత దీక్ష తీసుకున్నారు. ఆయన ఆధ్యాత్మిక సాధనకు భార్య శారదాదేవి ఎంతో దోహదం చేశారు. ఆమెలో మాతృమూర్తిని శ్రీరామకృష్ణులు దర్శించారు. యాభయ్యేళ్ళ వయసులో... 1886లో మరణించే వరకూ నిరాడంబరంగా జీవించారు. తన భక్తి, జ్ఞాన సంపదను జిజ్ఞాసులకు పంచారు. ఆధ్యాత్మిక లోకంలో పరమహంసగా నిలిచారు.Read more