Raksha Bandhan: రాఖీ పండుగను ఎలా జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు జరుపుకోరు.

ABN , First Publish Date - 2022-08-11T18:03:37+05:30 IST

అన్నాచెల్లెళ్ళూ జరుపుకునే రక్షా బంధన్ పండుగకు కుల మతాలతో ప్రమేయం లేదు. ప్రతి అన్నా చెల్లెలూ ఈ పండుగను తమదిగా చేసుకుని జరుపుకుంటారు.

Raksha Bandhan: రాఖీ పండుగను ఎలా జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు జరుపుకోరు.

రక్షా బంధన్ : ఆధ్యాత్మిక సంపదతో విలసిల్లే మన దేశంలో మనం జరుపుకునే చాలా పండుగలు, పర్వదినాలు సామాజిక చైతన్యానికీ, సాంస్కృతిక జీవన వికాసానికి ప్రతీకలు. భారతదేశంలో ప్రతి పండుగకు సాంస్కృతిక చారిత్రిక ప్రాముఖ్యత ఉంటుంది. దేవుని ఆరాధించే వారు తమ ఆచారాలు వ్యవహారాలకు అణుగుణంగా పండుగలు జరుపుకుంటారు. ఇక అన్నాచెల్లెళ్ళూ జరుపుకునే రక్షా బంధన్ పండుగకు కుల మతాలతో ప్రమేయం లేదు. ప్రతి అన్నా చెల్లెలూ ఈ పండుగను తమదిగా జరుపుకుంటారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో, సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి అతని శ్రేయస్సును కోరుకుంటూ ఈ రోజున వేడుక చేసుకుంటారు. అయితే ఒక్కోప్రాంతాన్ని బట్టి ఈ పద్దతుల్లో కాస్త మార్పులు ఉన్నా రాఖీ పండుగ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ. తోబుట్టువులు జరుపుకునే ఆనంద హేల.


అయితే ఒకచోట ఉన్న సాంప్రదాయం మరో చోట ఉండాలనేం లేదు. ఒకచోట జరుపుకునే పండుగను మరోచోట అదే రీతిలో జరుపుకోవాలనేం లేదు. అలానే రాఖీ పండుగ జరుపుకోవడంలో కూడా చాలా మార్పులను చూస్తాం. అక్కడి చారిత్రక అంశాలు, నమ్మకాలు కారణంగా ఒక్కోచోట అసలు రాఖీ పండుగనే జరుపుకోరు.. దాని వెనుక ముడి పడి ఉన్న అంశాలేంటో చూద్దాం.


దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణంగా రక్షా బంధన్ జరుపుకోరు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రాఖీ పూర్ణిమను అవని అవిట్టంగా అనిపిలుస్తారు. కుటుంబంలోని మగ వారి కోసం ఈ పండుగ చేస్తారు. దీనిని శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు రాత్రి, ప్రజలు నీటిలో స్నానం చేసి పండుగను జరుపుకుంటారు. ఈ వ్రతం చేస్తున్నప్పుడు,  తమ పూర్వ పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుందని నమ్ముతారు. ఈ ఆచారం తర్వాత ఒక పవిత్ర దారాన్ని శరీరానికి కడతారు. తమిళనాడులో, పొంగల్ పండుగ నాల్గవ రోజును కానుమ్ లేదా కాను పొంగల్ అని పిలుస్తారు. ఈ రోజున మహిళలు తమ సోదరుల పేరిట కను పిడి అనే ఆచారాన్ని నిర్వహిస్తారు.


రక్షా బంధన్ రోజును ఇతర ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారు:


1. కర్ణాటకలోని ప్రజలు నాగ పంచమి నాడు రాఖీ కడతారు.

2. తెలుగు రాష్ట్రాల్లో (ముఖ్యంగా తెలంగాణ), రాఖీని రాఖీ పూర్ణిమగా పిలుస్తారు. చాలా కుటుంబాలలో, కుమార్తెలను తమ తండ్రికి రాఖీ కట్టడమనే సంప్రదాయం ఉంది.

3. రక్షా బంధన్‌ను మహారాష్ట్ర ఇతర తీర ప్రాంతాలలో నరాలి పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజు సముద్రానికి పూజలు చేసి మత్స్యకారులు కొబ్బరికాయలను నైవేద్యంగా సముద్రంలో వేస్తారు.

4. మధ్యప్రదేశ్, బీహార్ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి గుర్తుగా కజారి పూర్ణిమను జరుపుకుంటారు.

5. పశ్చిమ బెంగాల్ లో ఈరోజున ఝులన్ పూర్ణిమను చేస్తారు, ఇది శ్రీకృష్ణుడు, రాధకు అంకితం చేసిన రోజు గా వారు భావిస్తారు.

6. ఉత్తరాఖండ్ ఈరోజున జంధ్యం పూర్ణిమను జరుపుకుంటుంది.

7. ఒడిశాలో, ఈ రోజున ఆవులు, గేదెలను పూజిస్తారు, దీనిని గమ పూర్ణిమ అని పిలుస్తారు.

8. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో, ఈరోజున ప్రత్యేకంగా శివుడిని ఆరాధిస్తారు.

Updated Date - 2022-08-11T18:03:37+05:30 IST