Soumya Balasubramaniam : సంరక్షణతో లాభాలు పండిస్తోంది!

ABN , First Publish Date - 2022-11-27T23:34:12+05:30 IST

పుట్టిన పల్లెల్నీ, వ్యవసాయ మూలాల్నీ వదిలేసి... ఉన్నతోద్యోగాల కోసం నగరాలకు యువత పరుగులు పెడుతున్న ఈ కాలంలో... సాగు మీద మమకారంతో కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేశారు సౌమ్యా బాలసుబ్రమణియం.

Soumya Balasubramaniam : సంరక్షణతో లాభాలు పండిస్తోంది!
సౌమ్యా బాలసుబ్రమణియం

పుట్టిన పల్లెల్నీ, వ్యవసాయ మూలాల్నీ వదిలేసి... ఉన్నతోద్యోగాల కోసం నగరాలకు యువత పరుగులు పెడుతున్న ఈ కాలంలో... సాగు మీద మమకారంతో కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేశారు సౌమ్యా బాలసుబ్రమణియం. సీడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి... ఇప్పటికే వందకు పైగా కూరగాయల రకాల్ని పండిస్తున్నారు. సేంద్రియ పంటలు పండించే రైతులు అధిక దిగుబడులు సాధించడానికి సాయపడుతున్నారు. ‘‘స్థోమత ఉన్న రైతులే వ్యవసాయాన్ని వదిలేసి, భూములు అమ్ముకొని నగరాలకు వెళ్తున్నారు. తమలా అనిశ్చితమైన బతుకులు తమ పిల్లలకు రాకూడదనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అగ్రికల్చర్‌ కోర్సు చేస్తానంటావేమిటి?...’’ వ్యవసాయానికి సంబంధించి ఏదైనా చేద్దామనుకుంటున్నానని చెప్పినప్పుడు నాన్న అన్న మాటలివి.

మాది తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా కంజికోవిల్‌. రైతు కుటుంబం. పొలాల్లో ఆడుతూ, పాడుతూ పెరగడంతో... మట్టి మీద మమకారం బాల్యం నుంచీ ఏర్పడింది. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో... వ్యవసాయం మీద నాకున్న ఆలోచనలు పక్కన పెట్టేశాను. ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, ఒక పెద్ద కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగినైపోయాను. కానీ మనసులో ఏదో వెలితి. నేను కోరుకున్న జీవితం ఇది కాదనిపించింది. తీరిక సమయాల్లో ఒక స్వచ్ఛంద సంస్థలో భాగస్వామిని అయ్యాను. కొన్నాళ్ళ తరువాత... ఉద్యోగం మానేసి... ముంబయిలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిఐఎస్‌ఎస్‌)లో సోషల్‌ వర్క్‌ కోర్సులో చేరాను. అధ్యయనంలో భాగంగా... థానేలోని మహదేల్‌ కోలీ తెగలతో కలిసి పని చెయ్యడం గొప్ప అనుభూతి. టిఐఎస్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చాక... ఉత్తరాఖండ్‌లో ఒక పర్యావరణ పరిశోధన సంస్థ తరఫున... మహిళా రైతులతో పండ్ల ప్రాసెసింగ్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాను.

అదే మలుపు తిప్పింది...

ఢిల్లీలో 2017లో నిర్వహించిన ఆర్గానిక్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌కు హాజరుకావడం నా జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. అక్కడ ఒక స్టాల్‌లో సుమారు 45 రాజ్‌మా రకాలను ప్రదర్శించారు. అలాగే బయట కనిపించని ఎన్నో రకాల ధాన్యాలు, పప్పు దినుసులు కూడా అక్కడ ఉన్నాయి. దుకాణాల్లో మనకు రెండు మూడు రకాలకన్నా దొరకవు. ఉన్నవాటిని పరిరక్షించుకోకపోతే అవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వాటిని కాపాడడానికి ఏదైనా చెయ్యాలనుకున్నాను. అదే సమయంలో సేంద్రియ వ్యవసాయం, విత్తన సార్వభౌమత్వం గురించి పాటుపడుతున్న ప్రముఖులను కలుసుకున్నాను. వారి ప్రేరణ, సూచనలతో... మా ఊళ్ళోనే ‘‘హూగా’ (హెల్పింగ్‌ ఆఫ్‌ అప్రెజ్డ్‌ జనరేషన్‌ ఆఫ్‌ అగ్రికల్చరిస్ట్స్‌) సీడ్‌ కీపర్స్‌ కలెక్టివ్‌’ అనే సంస్థను ప్రారంభించాను. దేశీయమైన విత్తనాల పరిరక్షణ దీని లక్ష్యం. ఆ తరువాత... స్థానికంగా లభించే, కొన్ని తరాలుగా నిల్వ చేసి సాగు చేస్తున్న విత్తనాలతో కూరగాయలు, తృణధాన్యాలు పండిస్తున్న ఎందరో రైతులను... తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కలిశాను. వారిలో... తమ సాగు అనుభవాలు వివరించిన వందేళ్ళ వయసున్న వ్యవసాయదారులు, తమ టెర్రస్‌ మీద వంద రకాలు పండిస్తున్న వారు సైతం ఉన్నారు. సుమారు మూడు నెలల పర్యటన తరువాత... ‘హూగా సీడ్‌ బ్యాంక్‌’ ఏర్పాటు చేశాను. ఆసక్తి ఉన్న కొందరు నాతో జత కలిశారు.

వద్దన్నవారే అభినందిస్తున్నారు...

ఇప్పుడు మేము సొంత ఆహార వనం పెంచుతున్నాం. సీడ్‌ బ్యాంక్‌ కోసం కూరగాయలు పెంపకంలో దాదాపు 40 మంది రైతులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ వందకు పైగా కూరగాయల రకాలు పండిస్తున్నాం. వాటిలో 15 అరుదైన, 30 అత్యంత అరుదైన రకాలు ఉన్నాయి. వాటి ప్రాధాన్యత గురించి ప్రచారం చేస్తున్నాం. అలాగే... మూడు నెలలకోసారి విత్తన యాత్ర నిర్వహిస్తున్నాం. సాగు, విత్తన సంరక్షణలో గ్రామీణ రైతుల పరిజ్ఞానాన్నీ, మెళకువలను నమోదు చేస్తున్నాం. ఆసక్తి ఉన్నవారికి విత్తనాలు కూడా అందిస్తున్నాం. దిగుబడి, నాణ్యత బాగుండడంతో సేంద్రియ రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మా కృషికి గుర్తింపుగా... ‘పుసా కృషి ఐసిఎఆర్‌- ఐఎఆర్‌ఐ యుపిజెఎ 2022’ ద్వారా నిధులు మంజూరయ్యాయి. పోషక విలువలు అధికంగా ఉండి, దిగుబడి ఎక్కువ ఇచ్చే మరిన్ని రకాల్ని పెంచడానికి ఇది సాయపడుతుందనుకుంటున్నా. ఒకప్పుడు నేను వ్యవసాయ రంగంలోకి వెళ్తానంటే వద్దన్న నా తల్లితండ్రులు ఇప్పుడు నాకు అండగా నిలుస్తున్నారు. విలువైన పని చేస్తున్నావని అభినందిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా... కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసినప్పుడు లేని సంతృప్తి... రైతులతో కలిసి పని చేస్తున్నప్పుడు నాకు లభిస్తోంది. రైతు బిడ్డగా నాకు అంతకన్నా కావలసిందేముంది?’’

Updated Date - 2022-11-27T23:34:14+05:30 IST