రేపటి గురించి భయం లేదు

ABN , First Publish Date - 2022-06-13T08:36:39+05:30 IST

గ్లామర్‌ కంటే అభినయం నిండిన పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చే నటి సాయి పల్లవి. మళయాళంలో ‘ప్రేమమ్‌’తో మొదలుపెట్టి... తెలుగు వారందరినీ ‘ఫిదా’ చేసిన ఆమెను కదిలిస్తే... తెరపై వెలిగే తారగానే కాదు... పరిణతి చెందిన ఓ మహిళగానూ ఆకట్టుకుంటారు.

రేపటి గురించి భయం లేదు

గ్లామర్‌ కంటే అభినయం నిండిన పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చే నటి సాయి పల్లవి. 

మళయాళంలో ‘ప్రేమమ్‌’తో మొదలుపెట్టి... తెలుగు వారందరినీ ‘ఫిదా’ చేసిన ఆమెను కదిలిస్తే... తెరపై వెలిగే తారగానే కాదు... 

పరిణతి చెందిన ఓ మహిళగానూ ఆకట్టుకుంటారు. 

‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ఈ విలక్షణ నటి ఎన్నో సంగతులు చెప్పుకొచ్చారు...


ఏం జరిగినా మన మంచికే అని నమ్ముతా.. దేవుడు నా లోపలే ఉన్నాడనుకుంటా

ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ.. మళ్లీ మెడిసిన్‌ చదువుతా.. ‘ఓపెన్‌ హార్ట్‌’లో సాయి పల్లవి

సినీ పరిశ్రమలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా మీకు ఇబ్బందులేమీ ఎదురుకాలేదా? 


సెట్‌కు రావడం.. ఇచ్చింది చేయడం.. షూటింగ్‌ కాగానే ఇంటికెళ్లడం.. అంతకు మించి ఏమీ పట్టించుకోను. ఎందుకంటే ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు వెళ్లి మెడిసిన్‌ చేసుకోగలను. ఒక వేళ ఇది చేయకపోతే రేపు ఏమైపోతుందోనన్న భయం లేదు. నాకు సంతోషాన్ని ఇచ్చినంత వరకు చేస్తాను. డైరెక్టర్లు కూడా సౌకర్యంగా ఉన్న కాస్ట్యూమ్స్‌ ఇస్తే బాగా చేయగలుగుతానని అర్థం చేసుకున్నారు.


ఆర్కే: ఎలా ఉన్నారు? 

సాయి పల్లవి: చాలా బాగున్నాను. 


ఆర్కే: సినిమాలు బాగా ఎంజాయ్‌మెంట్‌ 

ఇస్తున్నాయా? 

పల్లవి: షూట్‌ చేసేటప్పుడు ఎంజాయ్‌మెంట్‌... తరువాత ప్రేక్షకుల స్పందన చూసినప్పుడు సంతోషం. 


ఆర్కే: సాయి పల్లవి అంటే ఇక్కడివారు తెలుగమ్మాయనే భావిస్తున్నారు. అంత నేటివిటీ ఎలా? 

పల్లవి: నేను కూడా అలానే భావిస్తాను. నిజం చెప్పాలంటే నాకు కూడా అదే ఇష్టం. నా మొదటి సినిమా ‘ఫిదా’ నుంచి ప్రతి చిత్రంలో నేను తెలుగమ్మాయినే అనుకొని నటిస్తున్నా. ఇంట్లో మేం బడగ భాష మాట్లాడతాం. నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మధ్యలో తెలుగు వచ్చేస్తుంది. అది విని మా నాన్న అంటుంటారు... ‘నువ్వు తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొనేలా ఉన్నావు’ అని. తమిళనాడులోని వెంకటగిరి మా అమ్మానాన్నల ఊరు. అక్కడ ఒక తెగవారు మాట్లాడే భాష బడగ. కొంకణి, కన్నడ మిక్సింగ్‌లా ఉంటుంది. అయితే నేను పుట్టింది, పెరిగింది కోయంబత్తూర్‌లోనే. 


ఆర్కే: మరి తెలుగబ్బాయినే పెళ్లి చేసుకొంటారా? 

పల్లవి: పెళ్లి ఇప్పుడే వద్దండి. ప్రస్తుతం నా గురించి నేను తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నాను. 


ఆర్కే: జార్జియా దాకా వెళ్లి మెడిసిన్‌ ఎందుకు చేశారు? 

పల్లవి: నాకు చిన్నప్పటి నుంచి మెడిసిన్‌ చదవాలనే కోరిక. అయితే డ్యాన్స్‌ ఒక పిచ్చిలా మారిపోయింది. అన్ని పోటీలకు వెళ్లేదాన్ని. దాన్ని కొనసాగిద్దామనే ఉద్దేశంతో ఫ్యాషన్‌ టెక్నాలజీలో చేరాను. కానీ అది ఎందుకో నాకు సెట్‌ అవ్వలేదు. అమ్మ కూడా అదే చెప్పింది. అప్పటికే ఇక్కడ కాలేజీలు మొదలైపోయాయి. అదే సమయంలో మా కజిన్‌ సిస్టర్‌ జార్జియా వెళుతోంది. ‘నీకు మెడిసిన్‌ చేయాలనే కోరిక ఇంకా ఉంటే అక్కడికి వెళ్లి చదువుకో’ అని అమ్మ అన్నది. నేను ఒకే అన్నాను. అక్కడ కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్‌లు చేసేదాన్ని. సినిమాల ఆలోచన అసలు లేనే లేదు. ఉన్నట్టుండి ఒక రోజు ఓ డైరెక్టర్‌ కాల్‌ చేశారు. నేను ప్రాంక్‌ కాల్‌ అనుకున్నా. చివరకు మళయాళం సినిమా కదా... నా స్నేహితులు ఎవరూ చూడరులే అని ఓకే చెప్పాను. చూస్తే ఆ సినిమా చాలా బాగా వచ్చింది. అదే ‘ప్రేమమ్‌’. ఆ తరువాత నుంచి నుంచి నటనంటే చాలా ఇష్టంగా మారింది. ఎంబీబీఎస్‌ పూర్తయిన తరువాత ఇండస్ర్టీలోకి వచ్చాను. ఎప్పటి వరకు నాకు అవకాశాలు వస్తాయో... నేను ఎంతవరకు సినిమాకు పూర్తిగా న్యాయం చేయగలుగుతానో అప్పటి వరకు ఈ పరిశ్రమలో ఉంటాను. కానీ కచ్చితంగా మళ్లీ మెడిసిన్‌ చదువుతాను. ఇదివరకు నాకు కార్డియాలజీపై మక్కువ ఉండేది. ఇప్పుడు గైనకాలజీ అంటే ఆసక్తి పెరిగింది. ఎందుకంటే మహిళలు, యువతులు చాలామంది తమ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలన్నది నా కోరిక. 


ఆర్కే: మీకు పేరు పెట్టింది పుట్టపర్తి సాయిబాబా కదా! ఆయనతో మీ కుటుంబానికి అనుబంధం ఎలా?

పల్లవి: అవును. నాకు ఆయనే పేరు పెట్టారు. అమ్మ, తాతయ్య వాళ్లందరూ ఆయన భక్తులు. అమ్మ, మామయ్యలు అక్కడి యూనివర్సిటీలోనే చదువుకున్నారు. నన్ను చిన్నప్పటి నుంచి అక్కడికి తీసుకువెళ్లేవారు. తరువాత నేను కూడా ఆయన భక్తురాలినయ్యాను. 


ఆర్కే: తెలుగులో అవకాశం ఎలా వచ్చింది? 

పల్లవి: సూరి గారని శేఖర్‌ కమ్ముల గారి దగ్గర కో-డైరెక్టర్‌. వాళ్లు ‘హ్యాపీ డేస్‌’ చేసే సమయంలో అనుకొంటా... నేను ‘ఢీ’ షోలో పాల్గొని మళ్లీ జార్జియా వెళ్లిపోయా. అప్పుడు ఆయన అమ్మకు ఫోన్‌ చేసి అడిగారట... ‘హ్యాపీ డేస్‌లో సాయి పల్లవి చేస్తుందా’ అని. ‘తను జార్జియాలో ఉంది. చేయదు’ అని అమ్మ చెప్పింది. మళ్లీ ‘ప్రేమమ్‌’ చూసిన తరువాత నాతో మాట్లాడారు. అప్పుడు నేను ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నాను. ‘ఆరు నెలల్లో పూర్తవుతుంది. అప్పుడు కానీ రాలేను’ అన్నాను. వాళ్లు ‘తొందరేం లేదు’ అన్నారు. 


ఆర్కే: సినీ పరిశ్రమలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయిగా మీకు ఇబ్బందులేమీ ఎదురుకాలేదా? 

పల్లవి: సెట్‌కు రావడం... ఇచ్చింది చేయడం... షూటింగ్‌ పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోవడం... అంతకు మించి వేరే ఏవీ పట్టించుకోను. నాకు అభద్రతాభావం లేదు. 

ఎందుకంటే ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు వెళ్లి మెడిసిన్‌ చేసుకోగలను. అదే నాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఒక వేళ ఇది చేయకపోతే రేపు ఏమైపోతుందోనన్న భయం లేదు. నాకు సంతోషాన్ని ఇచ్చినంత వరకు చేస్తాను. 

నా డైరెక్టర్లు కూడా నాకు సౌకర్యంగా ఉన్న కాస్ట్యూమ్స్‌ ఇస్తే బాగా చేయగలుగుతానని అర్థం చేసుకున్నారు. 


ఆర్కే: ఇంత వరకు మేకప్‌ వేసుకోలేదా? 

పల్లవి: వేసుకున్నాను. ఐ లైనర్‌ వేసుకొంటా అంతే. ‘విరాటపర్వం’లో అయితే... అసలు మేకప్‌ లేదు. ముఖం కడుక్కొని వచ్చి, కెమెరా ముందు నిలబడ్డాను. వ్యక్తిగతంగా నాకు బాగా సంతృప్తినిచ్చిన పాత్ర అది. భిన్నమైన పాత్ర. ప్రేమ ఒక అమ్మాయిని ఎంత వరకు తీసుకెళుతుందనేదే కథ. నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసిన చిత్రం. 


ఆర్కే: డ్యాన్స్‌లో గురువు ఎవరైనా ఉన్నారా? 

పల్లవి: గురువు మా అమ్మే. కానీ తనకు డ్యాన్స్‌ తెలియదు. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ డ్యాన్స్‌ చేసేవారట. ‘నువ్వు గత జన్మలో ఒక డ్యాన్సర్‌వి అయ్యుంటావు. ఎందుకంటే నువ్వు కడుపులో పడ్డాక నాకు డ్యాన్స్‌ చేయాలనిపించింది’ అని అమ్మ ఒక రోజు నాతో చెప్పింది. ఊహ తెలిసినప్పటి నుంచి ఐశ్వర్యా రాయ్‌, మాధురీ దీక్షిత్‌ల డ్యాన్స్‌లు చూస్తూ పెరిగాను. అలా నేర్చుకున్నదే తప్ప ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. 


ఆర్కే: సినిమాల్లోకి వెళతానంటే మీ నాన్న ఏమన్నారు?

పల్లవి: వద్దన్నారు. డ్యాన్స్‌ షోలు చేస్తున్నప్పుడు కూడా... ‘ఇలా అయితే మన ఊళ్లో నిన్ను ఎవరు పెళ్లి చేసుకొంటారు’ అని అనేవారు! కానీ అమ్మ అలా కాదు... నాకు ఏది నచ్చితే అది చేయమనేది. ‘ప్రేమమ్‌’ తరువాత ఇద్దరికీ నమ్మకం కుదిరింది... నేను బానే ఉంటానని! ఇప్పుడు ఇద్దరూ చాలా హ్యాపీ. అమ్మ గృహిణి. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. సెంట్రల్‌ జీఎస్టీలో పని చేస్తారు.

 

ఆర్కే: మీ సినిమాల్లో ఏ పాత్రకు ఎక్కువ శ్రమించారు?

పల్లవి: ‘ఫిదా’ చేసేటప్పుడు ఒక విధేయత గల విద్యార్థిలా తెలుగు నేర్చుకున్నాను. జనం ఎలా మాట్లాడతారో అలానే నేర్పించమని అడిగాను. ఆ విషయంలో శేఖర్‌ గారి టీమ్‌ ఎంతో సహకరించింది. దాని తరువాత ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో సంప్రదాయ నృత్యం చేసినప్పుడు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అప్పుడే నాకు తెలిసింది... క్లాసికల్‌ డ్యాన్స్‌ ఎంత కష్టమో అని!  



ఆర్కే: గ్లామర్‌ పాత్రలైతే చేయరు... అంతేగా! 

పల్లవి: నాకు ఇప్పటికీ అర్థం కాదు... అసలు గ్లామర్‌ పాత్రలంటే ఏమిటి? పొట్టి బట్టలు వేసుకుంటే గ్లామరంటామా? మోడరన్‌గా ఉంటే గ్లామర్‌ అంటామా? నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఆటలు ఆడుతుంటాను. పన్నెండో తరగతి వరకు ఇంట్లో షార్ట్స్‌ వేసుకొనేదాన్ని. జార్జియా వెళ్లాక కూడా అక్కడ టాంగో డ్యాన్స్‌ కోర్సులో చేరాను. స్లిట్‌ డ్రెస్‌ వేసుకొని డ్యాన్స్‌ చేయాలి. సౌకర్యం కోసం ఆ డ్రెస్‌ కోడ్‌ పెట్టారు. అక్కడ అందరూ డ్యాన్స్‌ స్టయిల్‌ని మాత్రమే చూస్తారు. మన శరీరాన్ని కాదు. అయితే ‘ప్రేమమ్‌’ విడుదల తరువాత జార్జియాలో నా డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అయింది. చాలామంది డ్యాన్స్‌ని డ్యాన్స్‌లా కాకుండా వేరేలా చూశారు. నాకు బాగా ఇబ్బంది అనిపించింది. ఎప్పుడైతే నన్ను ఆ దృష్టితో చూడరో అప్పుడే నేను కంఫర్ట్‌గా ఉంటాననిపించింది. అలాగని పొట్టి బట్టలు వేసుకొంటే తప్పని కాదు. ఏదైనా చూసే కళ్లను బట్టి ఉంటుంది. 


ఆర్కే: ఇప్పుడు మీరు కాళ్లు కూడా కనిపించకుండా దుపట్టా కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు! 

పల్లవి: నాకు తెలియకుండానే నాలో ఒక భయం, స్పృహ వచ్చేశాయి. అయితే నన్ను, నా మనసును నేను కాపాడుకోవాలనుకొంటాను. నేను ఇలాగే ఉండాలనుకొంటున్నాను. కానీ ఇలా చేస్తేనే సినిమా అని లేదు కదా! కథ, నటన బాగున్నాయా లేదా అనేదే ప్రేక్షకులు చూస్తారు. అవి బాగుంటే మనం ఏ డ్రెస్‌ వేసుకున్నామన్నది పట్టించుకోరు. 


ఆర్కే: సినిమాకు ఓకే చెప్పే ముందు స్ర్కిప్ట్‌ చదువుతారా? 

పల్లవి: స్ర్కిప్ట్‌ అంతా చదువుతాను. ఒక సీన్‌లో నేను ఉండకపోవచ్చు. కానీ ఆ తరువాత వచ్చే సన్నివేశంలో నటించాలంటే ఒక లింక్‌ కావాలి కదా! అప్పుడే సరిగ్గా చేయగలుగుతాం. ఏదైనా విభిన్న పాత్రలు వస్తున్నాయంటే... డైరెక్టర్లు అంత మంచి కథలు రాశారు. నటించే అవకాశం నాకు కల్పించారు. ఆ క్రెడిట్‌ అంతా వారిదే. 


ఆర్కే: మీరు బాగా స్థితిమంతులనుకొంటాను! 

పల్లవి: అవునండి. అయితే డబ్బు ఉందని వృథా చేయకూడదు కదా! సినిమాలు చేసేటప్పుడు కూడా రెమ్యూనరేషన్‌ పట్టించుకోను. మంచి కథ ఉందా లేదా అనేదే చూస్తాను. నా సంపాదన లెక్కలన్నీ అమ్మే చూసుకొంటుంది. నిజానికి ఇప్పుడు నేను ఏదైనా కొనాలన్నా... ఓటీపీ అమ్మకే వెళుతుంది (నవ్వు). నా దగ్గర ఉన్న కార్డుల్లో డబ్బు ఉందా లేదా అన్నది కూడా అమ్మనే చెక్‌ చేసి చెప్పమంటాను. వాళ్ల దగ్గర ఇప్పటికీ నేను చిన్నపిల్లలానే ఉంటాను. 


 ఆర్కే: మీరు ఎంతమంది పిల్లలు? 

పల్లవి: నాకు ఒక చెల్లి ఉంది. నేను ఎప్పుడూ దాన్ని చిన్నపిల్లని అంటుంటాను. ‘నేనిప్పుడు పెద్ద పిల్లని. 25 ఏళ్లు వచ్చాయి’ అని అంటుంది. తమిళ్‌లో ఒక సినిమా చేసింది. 


ఆర్కే: మీకు ఏ ఫుడ్‌ ఇష్టం? 

 పల్లవి: నేను వెజిటేరియన్‌. స్వీట్స్‌ చాలా చాలా ఇష్టం. పేస్ర్టీస్‌, చాక్లెట్స్‌ బాగా తింటాను. పండ్లు కూడా తింటాను. 


ఆర్కే: సో... అన్ని బాధ్యతలతో పాటు మీ పెళ్లి బాధ్యత కూడా అమ్మానాన్నలకే అప్పజెప్పారా? 

పల్లవి: కరోనా సమయంలో ఉన్నట్టుండి పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేశారు. అయితే నేను పెళ్లికి ఇంకా సిద్ధంగా లేనని చెప్పాను. పెళ్లి తరువాత ఎన్నో బాధ్యతలుంటాయి. దానికి మరికొంత సమయం పడుతుందనుకొంటున్నాను. 


ఆర్కే: ఇండస్ర్టీలో మీకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు? 

పల్లవి: నా చెల్లే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. అయితే షూటింగ్‌ సమయంలో నాగచైతన్య, రానా నన్ను వాళ్ల కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్లుంటారు. అలాగే శేఖర్‌ గారు, ఆయన కుమార్తె, శ్రీకాంత్‌, సుధాకర్‌! స్నేహితులనే కంటే నాకు ఇక్కడ ఒక కుటుంబం ఉందంటే బాగుంటుంది.


నాకో నమ్మకం... ఏం జరిగినా అది మన మంచికే అని! నేను డ్యాన్స్‌ షోలో ఓడిపోయినప్పుడు దేవుడిని అడిగాను... ‘నేను సిన్సియర్‌గా చేశాను కదా... ఎందుకు ఇలా జరిగింది’ అని! ప్రభుదేవా షోలో కూడా! కానీ పదేళ్ల తరువాత అదే సెట్‌లో ప్రభుదేవా మాస్టర్‌ నా పాటకు కొరియోగ్రాఫ్‌ చేశారు... ‘రౌడీ బేబీ’ పాట అది. ఆ రోజు అర్థమైందేమిటంటే... ‘దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడని’.


ప్రశాంతంగా కూర్చొని ప్రశ్నలు అడిగితే... మనలోనే ఎక్కడో అక్కడి నుంచి సమాధానం వస్తుంది. నేను దేవుడు నా లోపలే ఉన్నాడనుకొంటాను. నాకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ.


ఆర్కే: మీ డ్యాన్స్‌ని చిరంజీవి కూడా అభినందించారు కదా! మరి ఆయన సినిమాలో చేయమంటే చేయనన్నారట? 

పల్లవి: నిజంగా చెబుతున్నానండీ... ‘భోళా శంకర్‌’లో ఒక రోల్‌ నేను చేస్తే బాగుంటుందని చిరంజీవి గారు అనుకున్నారట. ఆ విషయం నాకు అస్సలు తెలియదు. అయితే ముందు నుంచి రీమేక్‌లంటే నాకు కొంచెం భయం. ఒరిజినల్‌తో పోల్చి చూస్తారు కదా! ఆ భయంతోనే నేను వద్దన్నాను. కానీ డ్యాన్స్‌ కోసం అయితే నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఆయన గ్రేస్‌ఫుల్‌ డ్యాన్సర్‌. చిరంజీవి గారి పాటలన్నీ చూస్తాను. ‘ముఠామేస్త్రి’ టైటిల్‌ సాంగ్‌లో స్టెప్పుని నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ గ్రేస్‌ అదీ రాలేదు. ఆయనలో ఒక గ్రేస్‌ ఉంటుంది. అది నాకు చాలా నచ్చుతుంది. గ్రేస్‌ అంటే ఆయనే! చిరంజీవిగారు డ్యాన్స్‌ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోతామంతే! 


ఆర్కే: అవకాశం వస్తే చిరంజీవితో పోటీపడి డ్యాన్స్‌ చేస్తారా? 

పల్లవి: పోటీ ఏంకాదు. ఒక అభిమానిగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తాను. అంతటి దిగ్గజంతో కలిసి డ్యాన్స్‌ చేసే అవకాశం వస్తే... అది నాకు లభించే గౌరవం అనుకొంటాను.

Updated Date - 2022-06-13T08:36:39+05:30 IST