ఆరుపదుల వయసులోనూ ఆగని పతకాల వేట

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

ఆరు పదుల వయసు దాటినా అలుపెరుగని క్రీడాస్ఫూర్తి

ఆరుపదుల వయసులోనూ ఆగని పతకాల వేట

ఆరు పదుల వయసు దాటినా అలుపెరుగని క్రీడాస్ఫూర్తి భవానీ జోగి. రన్నింగ్‌, త్రోయింగ్‌, జంపింగ్‌... అథ్లెటిక్స్‌లో ఏ ‘ఫీల్డ్‌ అండ్‌ ట్రాక్‌’ ఈవెంట్‌లో పాల్గొన్నా పతకాన్ని ఆమె పక్కాగా పట్టేస్తారు. ఈమధ్య శ్రీలంకలో జరిగిన పోటీల్లో మొత్తం అయిదు పతకాలు సాధించి... దేశ ప్రతిష్టను పెంచారు. ‘‘వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఎన్నాళ్ళు బతికామనేది ముఖ్యం కాదు, జీవితంలో మనకు సంతోషం కలిగించే పనులు ఎంతకాలం, ఎంత పరిపూర్ణంగా చేస్తున్నామనేదే ప్రధానం’’ అని చెబుతారామె.


భవానీ స్వస్థలం కర్ణాటకలోని హసన్‌ జిల్లా సకలేశ్‌పూర్‌. ఆమె తల్లి ఆరోగ్య శాఖలో ఆయాగా పని చేసేవారు. భవానీ క్రీడల్లో మునిగిపోతే చదువు దెబ్బతింటుందని ఆమె భయం. దీంతో క్రీడాకారిణి కావాలనే చిన్ననాటి కలను భవానీ తనలోనే దాచుకోవాల్సి వచ్చింది. చదువు పూర్తయ్యాక ఆమె మైసూరులోని ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరారు. ఏడాది తరువాత వివాహం, తరువాత అమ్మాయి పుట్టడంతో కుటుంబ వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. ఆ సమయంలోనే అనూహ్యమైన అవకాశం ఆమెకు వచ్చింది. భవానీ క్రీడాసక్తి గురించి తెలుసుకున్న తోటి సిబ్బంది ఆరోగ్య శాఖ నిర్వహించే వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. దీనికి ఆమె భర్త, అత్తగార్ల ప్రోత్సాహం తోడైంది. ఆ పోటీల్లో రాణించడంతో భవానీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫిట్‌నెస్‌ కోసం శిక్షణ తీసుకున్నారు. త్రోయింగ్‌లో సాధన చేశారు. అయితే... మంగళూరుకు బదిలీ కావడం, కొన్నాళ్ళకే ఒక ప్రమాదంలో ఆమె భర్త తీవ్రంగా గాయపడి మరణించడంతో... కుమార్తె బాగోగులు చూసుకోవడం కోసం అభ్యాసానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది.


‘‘అప్పట్లో ఏడాదికి పైగా డిప్రెషన్లో ఉన్నాను. దేని మీదా ఆసక్తి ఉండేది కాదు. నేనేమైపోతానోనని మా బంధువులు, సహోద్యోగులు భయపడ్డారు. ‘దిగులు నుంచి బయటపడాలంటే నువ్వు బిజీగా ఉండాలి. మళ్ళీ క్రీడల మీద దృష్టి పెట్టు’ అని సలహా ఇచ్చారు. నా రెండో ఇన్నింగ్స్‌ అలా ప్రారంభమయింది’’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకున్నారు భవానీ. 1998లో ‘ఓపెన్‌ మాస్టర్స్‌’లో ప్రవేశించిన ఆమె ఇప్పటివరకూ వందకు పైగా స్వర్ణ, డెబ్భైకి పైగా రజత పతకాలు సాధించారు. ఆమె గెలుచుకున్న పతకాల సంఖ్య రెండువందలకు పైనే. 


భవానీ మంచి స్విమ్మర్‌ కూడా. నలభయ్యేళ్ళ వయసులో... తన కుమార్తెతో పాటు స్విమ్మింగ్‌ నేర్చుకున్నారు. నాలుగు నెలల్లోనే ఒక జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొని... ‘ఫార్టీ ప్లస్‌ కేటగిరీ’లో మూడు స్వర్ణ పతకాలు సాధించారు. స్విమ్మింగ్‌ కోచ్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాగే యక్షగాన కళాకారిణిగా రంగస్థలం మీద తన ప్రతిభను ఆమె చాటుకుంటున్నారు. మంగుళూరులో నిర్వహించిన ‘కరావళి’ ఉత్సవాల్లో, వివిధ రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో సుప్రసిద్ధ కళాకారులతో కలిసి ప్రదర్శనలిచ్చారు.


అయిదేళ్ళ క్రితం నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా రిటైరయ్యాక... మనవలతో కాలక్షేపం చేస్తూనే, స్పోర్ట్స్‌ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. గత నెల శ్రీలంకలో నిర్వహించిన ‘35వ వార్షిక మాస్టర్స్‌ (ఓపెన్‌) అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌’లో... వివిధ విభాగాల్లో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించారు. ‘‘ఇప్పుడు నా వయసు అరవై నాలుగేళ్ళు. నాకు ఓపిక ఉన్నంత వరకూ పతకాలు సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను గెలుచుకొనే ప్రతి పతకం మరో పతకాన్ని సాధించాలనే స్ఫూర్తిని నాలో ప్రేరేపిస్తూ ఉంటుంది’’ అంటున్నారు భవానీ. 


Read more