నాకది లోటుగా అనిపించలేదు!

ABN , First Publish Date - 2022-02-06T08:46:35+05:30 IST

నటిగా ఐదు దశాబ్దాల ప్రస్థానం ఆమెది. బాపూతో ఆమెది ప్రత్యేక అనుబంధం. చాలాకాలం తరువాత ఆమె తిరిగి తల్లి పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు...

నాకది లోటుగా అనిపించలేదు!

నటిగా ఐదు దశాబ్దాల ప్రస్థానం ఆమెది. బాపూతో ఆమెది ప్రత్యేక అనుబంధం. చాలాకాలం తరువాత ఆమె తిరిగి తల్లి పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. కుటుంబ ప్రేక్షకులు మెచ్చిన నటిగా గుర్తింపు పొందిన తులసిని ‘నవ్య’ పలకరిస్తే ఇలా చెప్పుకొచ్చారు. నటిగా మీది సుదీర్ఘమైన కెరీర్‌. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరిగి రావడం ఎలా ఉంది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? 

జర్నీ ఫెంటాస్టిక్‌గా ఉంది. కెరీర్‌, జీవితం విషయంలో నాకు వెనక్కి తిరిగిచూసుకోవడం అలవాటు లేదు. నా కెరీర్‌ చాలా బాగుంది. పొందాల్సినవి అన్నీ  పొందాను. దక్కనివి దక్కలేదు. జీవితంపై నాకేమీ కంప్లైంట్స్‌ లేవు. 


 చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు

నటిగా నాది ఐదు దశాబ్దాల ప్రస్థానం. ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. మూడేళ్ల వయసులోనే కెమెరా ముందు తొలి డైలాగ్‌ చెప్పాను. 


ఇన్ని దశాబ్దాల ప్రయాణంలో ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు ఏమిటి?

అప్పట్లో స్ర్కిప్ట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. తర్వాత అన్ని విభాగాలపై పట్టున్న దర్శకుడిని ఎంచుకునేవారు. దర్శకులందరికి దాదాపు సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌పై సంపూర్ణ అవగాహన ఉండేది. ప్రతి చిన్న విషయం వాళ్ల గమనికలో ఉండేది. సెట్‌ బాయ్స్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ అందరూ కీలకపాత్ర పోషించేవారు. షూటింగ్‌ జరిగేటప్పుడు వారంతా డైరెక్టర్‌ వెన్నంటే ఉండేవారు. అందుకేనేమో అన్ని హిట్‌ సినిమాలు అందించారు. నిర్మాణసంస్థలు కూడా చాలా గొప్ప పేరు పొందాయి.


 ఇతర దర్శకులతో పోల్చితే బాపు, విశ్వనాథ్‌ శైలి ఎలా భిన్నంగా ఉండేది? వారితో మీ వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌...!

వారు తీసిన పలు చిత్రాల్లో బాలనటిగా నటించాను. వారి దగ్గర నేర్చుకున్న మెలకువలు ఆ తర్వాత కాలంలో ఉపయోగపడ్డాయి.  

ఎక్కువ చిత్రాలు చేసింది బాపు, విశ్వనాథ్‌ గారితోనే. వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను. కొంచెం ఎదిగాక వారితో కలసి పనిచేశాను. బాపు గారు క్యారెక్టర్‌ ఎలా ఉండాలనేది ముందుగానే స్కెచ్చింగ్స్‌ వేసుకునేవారు. విశ్వనాథ్‌ గారికి తోకా సుబ్బారావు గారే చేసేవారు. ఈ క్యారెక్టర్‌ ఇలా ఉంటుంది అని స్కెచ్‌ వేసేవారు. బ్యాక్‌గ్రౌండ్‌లో నటించే చిన్న పాత్రధారులు ఎలా చేయాలో కూడా వారు చేసి చూపించేవారు. మానిటర్స్‌ లేని కాలంలో పనిచేయగలిగినందుకు గర్వంగా ఫీలవుతాను. సీన్‌ బాగా రావడానికి నా వంతు ప్రయత్నం చేసేదాన్ని. నటించేటప్పుడు కెమెరా ఎంత దగ్గరకు పెట్టారు అని తెలుసుకొని దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడం, సందర్భానుసారం కళ్లతోనే నటించడం, జుత్తును వెనక్కు అనుకోవడం చేసేదాన్ని. అది వారికి చాలా నచ్చేది. ఆ ఫ్రేమ్‌లో మనం ఏం చేయగలం అనేది ఒక యాక్టర్‌గా మనకు ముఖ్యం. ఆ ఫ్రేమింగ్‌ గానీ, ఒక బ్యూటీ గానీ రప్పించడంలో వారు చాలా నేర్పరులు. డిక్షన్‌, ప్రతి క్యారెక్టర్‌ మేనరిజమ్‌, మాడ్యులేషన్‌ అన్నీ వాళ్లు దగ్గరుండి చూసుకునేవారు. 

 మీరు చేసిన పాత్రల్లో మీ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండేవి ఏవి?

నాలుగు స్థంభాలాటలో చేసింది రెండు సీన్లే అయినా అది మనసుకు దగ్గరైన పాత్ర. సినిమాలో హిట్‌సాంగ్స్‌ పూర్ణిమకు ఉన్నాయి. సినిమా హిట్‌ అవ్వడం, పాత్ర నిడివి ముఖ్యం కాదు అని అప్పుడు నాకనిపించింది. ‘ఎంత బాగా చేసింది తులసి’ అని నన్ను మెచ్చుకునేవారు. అలాగే ‘ముద్ద మందారం’. ‘బావని నువ్వే పెళ్లి చేసుకో’ అనే డైలాగ్‌ చెప్పే ఒకే ఒక సీన్‌..... వచ్చి ‘చాలా బాగా చేశావమ్మా’ అని మెచ్చుకున్నారు. అప్పుడు నాకు పన్నెండో, పదమూడేళ్లో అనుకుంటా!  

 బాపూ గారు సెట్‌లో ఎలా ఉండేవారు ?

ఆయన సెట్‌లో ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. బాపూ గారి ఫోకస్‌ అంతా పనిపైనే ఉండేది. బాలనటిగా బాపూగారితో రెండు సినిమాలు చేశాను. చాలామందికి ఆ విషయం తెలియదు. అందులో మురళీమోహన్‌, శారద గారు నా తల్లితండ్రులు. ఒక చిత్రంలో శ్రీధర్‌ గారు, నేను కలసి ఉంటాం. అందులో నేను మా అమ్మను కాపాడతాను. నేను హనుమంతుడుగా కూడా కనిపిస్తాను. అది చాలా కష్టతరమైన పాత్ర. ఆ డైలాగ్‌ డెలివరీ, ఆ పాత్రకు తగ్గ హావభావాలు పలికించడం అంత సులువు కాదు. రావుగోపాలరావు గారిని  తిడుతూ ఆయన్ను ఇమిటేట్‌ చేస్తుంటాను. అసలు ఆ క్యారెక్టర్‌ చాలా బీభత్సంగా ఉంటుంది. అప్పటి నుంచి బాపుగారితో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆయనకు ‘శంకరాభరణం’తోనే నేను చాలా నచ్చేశాను. ‘ఆ..ఆ రాముణ్ణి పట్టుకురండి’ అన్నారట. షూటింగ్‌లో రోజంతా ఆయనతో కలసి ఉండేదాన్ని. ఆ సినిమాకు ఎక్కువగా రాత్రి షూటింగ్స్‌ పెట్టారు. మారేడుమిల్లిలో షూటింగ్‌ జరిగింది. అప్పుడు 43 రోజులు పాటు రమణగారు, బాపూ గారితోనే ఉన్నాను. బాపూ గారి ఫైల్‌, పెన్ను నేనే పట్టుకునేదాన్ని. ఆయన తమలపాకులు వేసుకుంటారు.


ఎప్పుడూ డబ్బా చేతిలో పెట్టుకునేవారు. నేను ఆయన వెంటే ఉండేదాన్ని. ఏదైనా అవసరమైతే ‘ఓయ్‌...రాముడూ’ అని పిలిచేవారు. స్నాక్స్‌ వచ్చినప్పుడు ‘రాముడూ ఏం తింటావ్‌?’ అని అడిగేవారు. ‘పునుగులు తింటాను’ అని చెప్పేదాన్ని. అయితే పెసర పునుగులు నాకిష్టం ఉండేది కాదు. రెండు మూడు మాత్రమే తినేదాన్ని. ఓసారి అది చూసి గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా స్నాక్స్‌ వస్తే ఆయన ‘ఓహ్‌.. నీకు పెసలతో చేసినవి నచ్చవు కదా’ అని అనేవారు. అలా ఆయనతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో తీపి జ్ఞాపకాలు. ఆయన ఎప్పుడు పండ్లు తిన్నా నన్ను పిలిచేవారు. ఆయన పాత్రను పట్టుకుంటే నేను అందులోంచి తీసుకొని తింటూ ఉండేదాన్ని. ఆయన లెమన్‌ టీ తాగేటప్పుడు ‘రాముడూ...’ అని అరిచేవారు. సన్న గొంతు ఆయనది. అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఆయన గొప్పతనం తెలిపే సంఘటన ఒకటి చెప్పాలి. పెద్ద డైరెక్టర్‌ అయినా ఆయనలో మచ్చుకు కూడా గర్వం, అహంకారం ఉండేది కాదు. ఆయన ఎప్పుడూ ఇంటి భోజనమే ఇష్టపడతారు. ఒకరోజు ఎవరి ఇంటి నుంచో భోజనం వండించి తెచ్చి పెట్టారు. అందులో పన్ను వచ్చిందట. ఆ పన్నును దులిపి అదే కంచంలో పక్కనపెట్టేశారు. అన్నం తినడం పూర్తయ్యాక, ఆ పన్నును కడిగి మేనేజరుకి ఇచ్చి ‘వారి భార్యదేమో...వారికి జాగ్రత్తగా ఇచ్చేయండి’ అన్నారట. అంత హుందాగా ఉంటుందాయన ప్రవర్తన. అలాగే దాసరి నారాయణరావు గారితో బాలనటిగా ఏడు సినిమాలు చేశాను. హీరోయిన్‌గా, సెకండ్‌ హీరోయిన్‌గా 9 సినిమాలు చేశాను.


దాసరిగారి దర్శకత్వంలో మోహన్‌బాబుతో ‘ఇంటింటి బాగోతం’ అనే సినిమా చేశాను. ‘గోరింటాకు’లో తప్ప ప్రతి సినిమాలో నా కోసమే ప్రత్యేకంగా సాంగ్స్‌ పెట్టించేవారు దాసరిగారు. ‘బుచ్చిబాబు’లో నేను చిన్ననాటి జయప్రద పాత్ర చేశాను. అవన్నీ సావిత్రి గారి చివరి రోజులు. ‘విజ్జీ ఇది రోజురోజుకూ ఎదిగిపోతోంది...యాక్టర్‌గానూ...మనిషిగానూ’ అని అమ్మతో అనేవారు. ఆ మాటలకి ఎంతో ఆనందం కలిగేది మా అమ్మగారికి. చలంగారితో కూడా మా అమ్మకు పరిచయం. మా అమ్మ నటిస్తానంటే చలం గారు ‘వద్దు నువ్వు చాలా అమాయకురాలివి’ అన్నారట. నేనూ అలాగే అమాయకురాలిగానే మిగిలిపోయాననుకోండి. ‘రెండు జళ్ల సీత’కు నాతో పార్ట్‌-2 తీద్దామనుకున్నారు. కానీ వీలుపడలేదు. అబ్బాయి పాత్రలు వేసినప్పుడు నా పేరు మాస్టర్‌ తులసీరామ్‌ అని టైటిల్స్‌లో వేసేవారు. అది విశ్వనాథ్‌ గారి చలవ అన్నమాట. 


 సోలో హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌ రాలేదని అనిపించిందా?

సక్సెస్‌ రాలేదు అనికాదు. కానీ నేను హీరోయిన్‌గా చేసినా వాళ్లు అంత డబ్బులు ఇచ్చేవారు కాదు కదా? ‘నేను కమర్షియల్‌ స్టార్‌డమ్‌’ చట్రంలో ఇమడలేను అని అప్పటికే నాకు అవగాహన ఏర్పడింది. దేవుడి దయ వల్ల నేను ఏ సినిమాలో ఉన్నా నాకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అప్పట్లో నేను కుటుంబ ప్రేక్షకులకు బాగా మెచ్చిన నటిని. అది కెరీర్‌లో నాకు చాలా హెల్ప్‌ అయింది. అయితే సమాంతరంగా హీరోయిన్‌ సినిమాలు కూడా చేస్తూరావడం వల్ల నాకు అదొక లోటుగా అనిపించలేదు. కొన్ని సినిమాలు ఆడకపోయినా నాకు మాత్రం పేరొచ్చింది. అసలు ఆ రోజుల్లో సినిమా హిట్టయిందా ఫ్లాప్‌ అయిందా అనేదాని కన్నా నటీనటులు బాగా చేశారా లేదా అనేదే ప్రేక్షకులు ఎక్కువగా పట్టించుకునేవారు. టాలెంట్‌ ఉంటే అవకాశాలు ఇస్తూనే ఉండేవారు. గోల్డెన్‌ లెగ్‌, ఐరన్‌ లెగ్‌ అనే ముద్రలు ఉండేవి కాదు. అవన్నీ తర్వాత వచ్చాయి. ఈ ఽమధ్యకాలంలో కొంతమంది నా దగ్గర చెప్పుకొని బాధపడ్డారు కూడా. ఎంత ప్రతిభ ఉన్నా తగిన గుర్తింపు దక్కని వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లని చూస్తే జాలి కలుగుతుంది. మా టైమ్‌లో మాత్రం అలాంటివి ఎప్పుడూ నా దృష్టిలోకి రాలేదు. 


 


 మీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ గురించి చెప్పండి?

మలయాళంలో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. కన్నడలో ఉపేంద్ర సినిమాలో చేస్తున్నాను. తమిళంలో ధనుష్‌తో, శింబుతో చేస్తున్నాను. 


 ఇప్పటి దాకా చేసిన పాత్రల్లో మీకు సవాల్‌గా అనిపించింది?

ఇప్పటిదాకా నాకు సవాల్‌ విసిరిన పాత్ర లభించలేదనుకుంటున్నాను. నటులకు సంతృప్తి ఉండదు. ఎప్పుడూ ఏదో కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. నా కెరీర్‌లో చాలా వైవిధ్యం ఉన్న పాత్రలు లభించాయి. అందుకు సంతోషంగా ఉన్నాను.


అప్పట్లో క్యారెక్టర్‌ ఇలా ఉంటుందని స్కెచ్‌ వేసేవారు. మానిటర్స్‌ లేని కాలమది. నటించేటప్పుడు కెమెరా ఎంత దగ్గర పెట్టారని తెలుసుకుని  ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేవాళ్లం


 మీరు భవిష్యవాణి చెబుతారని అంటారు...

అవును. అది మా తాతగారి నుంచి వారసత్వంగా అబ్బింది. ‘నువ్వు చెప్పేదంతా జరగాలమ్మా. నీ ప్రేమే జనాన్ని మారుస్తుంది. నీ మనసు చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇలాంటి వారి మనసులోనే పాజిటివిటి ఉంటుంది’ అనేవారు. ఆయనే నాకు మంత్రోపదేశం చేశారు. దైవవాక్కును నా ద్వారా ప్రజలకు చెబుతాను. అది నాకు చాలా ఇష్టం కూడా. నా నోటి నుంచి వచ్చిన వాక్కుల్లో ఇప్పటిదాకా ఒక్కటి కూడా తప్పలేదు.


అదీ మా తాత ఘనత 

డాక్టర్‌ ముత్త వెంకటరామయ్య. ఆయన 30 ఏళ్ల పాటు ఇందిరాగాంధీకి ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్నారు. ఆమె డాక్టరేట్‌తో సత్కరించారు. ఇందిరాగాంధీ మరణానికి రెండేళ్ల ముందు ఢిల్లీ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. రాధాకృష్ణ స్వామిజీ తన తర్వాత పీఠానికి తాతగారినే ఉత్తరాదికారిగా అనుకున్నారు. అప్పటి నుంచి ఆయన దురలవాట్లు మానుకొని భక్తిమార్గంలోకి వచ్చారు. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం బాటపట్టారు. సాయిబాబా బోధనలను జనంలోకి తీసుకువెళ్లారు. సాధారణ పంచె కట్టుకొని విభూతి ధరించేవారు. ఆయన ఆహార్యం ఎవరిని అనుకరించినట్టుగా ఉండేది కాదు. ఇందిరాగాంధీ, జయలలిత, ఎమ్జీఆర్‌గారు ఆయన్ని కలిసేందుకు వచ్చేవారు. నేను గుడికి వెళ్ళడం చాలా అరుదు. ఆ రోజుల్లో ఆయన ‘నువ్వు గుడికే వెళ్లాల్సిన అవసరం లేదమ్మా’ అనేవారు. అది ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది. హృదయంలో మలినం లేకుండా ఉంటే చాలు అనేది నా నమ్మకం. 


  సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


మళ్లీ పునరాగమనం ఎలా జరిగింది?

హీరో అథర్వ తాతగారు కన్నడలో పెద్ద ప్రొడ్యూసర్‌. ఆయనకు ‘శంకారాభరణం’లో నా నటన అంటే చాలా ఇష్టం. ఒకరోజు మా ఇంటికొచ్చి మా వారితో మాట్లాడారు. ‘పండరీ బాయి లాగా తులసి మంచి మదర్‌ అవుతుంది. చాలా హోమ్లీగా ఉంటుంది, బాబు కూడా స్కూల్‌కి వెళుతున్నాడు కాబట్టి సినిమాలు చేయమని చెప్పు’ అని అడిగేవారు. మధ్యలో కోన వెంకట్‌, సుహాసినీ మణిరత్నం హీరోయిన్‌ పాత్రలకు డబ్బింగ్‌కు పిలిచేవారు. కానీ ‘ఫ్యామిలీ లైఫ్‌ చాలా ఆనందంగా ఉండాలి’ అనేది నా కోరిక. అందుకే కమ్‌బ్యాక్‌ అసలు వద్దనుకున్నాను. కానీ మా తాతగారు ‘యూ విల్‌ డై విత్‌ సినిమా’ అనేవారు. నాకు 16 ఏళ్ల వయసున్నప్పుడే నా సినీ కెరీర్‌ను ఊహించి ఆయన ఆ మాట చెప్పారు. మేం ఉండేది బెంగళూరు కావడంతో ఆయన కోరిక మేరకు కన్నడ సినిమాలు వరకూ చేస్తానని చెప్పాను. తర్వాత ఇవివి సత్యనారాయణ ఫోన్‌ చేశారు. ఆయన జంధ్యాల గారి దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నప్పటి నుంచి తెలుసు. ‘నా కొడుకులిద్దరూ కలసి సినిమా చేస్తున్నారు. నువ్వు మదర్‌ క్యారెక్టర్‌ చేయాల’ని అడిగారు. రాజమండ్రిలో షూటింగ్‌. ‘అక్కడిదాకా నేను రాలేనే మో సత్యం’ అన్నాను. కానీ వినకపోవడంతో చేయక తప్పలేదు. అది మొదలు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలు చేస్తూ వస్తున్నాను. మధ్యలో కొన్ని మలయాళ చిత్రాలు చేశాను. కమ్‌బ్యాక్‌లో వందకంటే ఎక్కువే సినిమాలు చేసి ఉంటాను. 

Read more