వరవర్షిణి

ABN , First Publish Date - 2022-08-05T05:30:00+05:30 IST

మహాలక్ష్మిని ప్రార్థిస్తూ, వరలక్ష్మిగా సంభావిస్తూ, వరలక్ష్మీ వ్రతాన్ని ఆరంభిస్తూ చేసే స్తుతి ఇది. ఆరుద్ర కార్తెలో కురిసే వర్షపు జల్లులు భూమిని ఆర్ద్రం చేస్తాయి. పంట పొలాలు, బీళ్ళూ పచ్చదనం సంతరించుకొని... పచ్చని తివాసీలుగా మారుతాయి. చెట్లు,

వరవర్షిణి

నేడు వరలక్ష్మీ వ్రతం

శ్రీ మహాలక్ష్మికి గల అనేక అంశా రూపాల్లో 

విశిష్టమైనది వరలక్ష్మీ స్వరూపం. వరలక్ష్మి

శ్రావణ మాసానికి అధిష్ఠాత్రి. సమృద్ధికరమైనదిగా పేరుపొందిన ఈ మాసంలో 

ఆ సమృద్ధిని వర్షించే చల్లని తల్లి వరలక్ష్మి. 


పద్మప్రియే పద్మిని పద్మహస్తే 

పద్మాలయే పద్మదళాయతాక్షి

విశ్వప్రియే విష్ణుమనోనుకూలే 

త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ


మహాలక్ష్మిని ప్రార్థిస్తూ, వరలక్ష్మిగా సంభావిస్తూ, వరలక్ష్మీ వ్రతాన్ని ఆరంభిస్తూ చేసే స్తుతి ఇది. ఆరుద్ర కార్తెలో కురిసే వర్షపు జల్లులు భూమిని ఆర్ద్రం చేస్తాయి. పంట పొలాలు, బీళ్ళూ పచ్చదనం సంతరించుకొని... పచ్చని తివాసీలుగా మారుతాయి. చెట్లు, పూలమొక్కలు పుష్పిస్తాయి. పరిమళాలనూ, ఫలాలనూ అందిస్తాయి. ప్రకృతి శోభాయమానమై వరలక్ష్మికి స్వాగతం పలుకుతుంది. అందుకే ఆమెను ‘ఆర్ర్దా పుష్కరణీం’ అంటూ శ్రీసూక్తం కీర్తించింది. ఆమె కరుణామయి. అంతేకాదు- ‘అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్ణుమేదమే గృహాత్‌’... అంటే ఆమె అనైశ్వర్యం, అసమృద్ధి లేకుండా చేసే తల్లి. 


గృహస్తాశ్రమానికి ఆలంబనమైన గృహిణుల కోసం పూర్వ ఋషులు ఎన్నో నోములు, వ్రతాలు నిర్దేశించారు. వాటిలో ప్రత్యేకమైనది వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని విధిగా చేయాలన్నది శాస్త్రవచనం. శ్రావణ మాసం ప్రధానంగా వ్రతాలు, నోములకు ప్రసిద్ధి. అందుకే ఇది అతివలు ఎదురుచూసే మాసం. ‘వరం తనోతీతి వ్రతం’ అని వ్యుత్పత్తి. ఈ మాసంలో పార్వతిని గౌరిగా మంగళవారం, మహాలక్ష్మిని వరలక్ష్మిగా శుక్రవారం ఆరాధించడం సనాతన సంప్రదాయం. సాధారణంగా చేసే వ్రతాలకూ, వరలక్ష్మి వ్రతానికీ కొంత వ్యత్యాసం ఉంది. ఇతర వ్రతాలు ‘యిష్టి’కి సంబంధించినవి. అంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసేవి. ఈ విషయం ఆ వ్రత కథల్లో ప్రస్ఫుటం అవుతుంది. అయితే వరలక్ష్మీ వ్రతం ఎందుకు భిన్నమైనదనేది ఆ వ్రత కథలో తెలుస్తుంది. ఈ కథను, వ్రత విధానాన్నీ స్కందుడు కోరిన మీదట... పార్వతికి శివుడు చెప్పినట్టు, స్కందుడు భూలోకంలో దీన్ని వ్యాప్తి చేసినట్టు స్కాంద పురాణంలో ఉంది. 


ఒకసారి మహాలక్ష్మికి తన భక్తుల మనో వాంఛలను ఈడేర్చాలనే సంకల్పం కలిగింది. తనకు తానుగా భూలోకంలో పర్యటించింది. ఆ సందర్భంలో ఆమెకు చారుమతి అనే ఇల్లాలు తారసపడింది. చారుమతి సుగుణాలను గమనించిన మహాలక్ష్మి ఆమె కలలో సాక్షాత్కరించింది. తనను వరలక్ష్మిగా పరిచయం చేసుకొని, వ్రత విధానాన్ని  తెలిపి, అదృశ్యమయింది. 
తెల్లవారిన తరువాత తన స్వప్న వృత్తాంతాన్ని అత్తమామలకు, భర్తకు, ఇరుగుపొరుగు గృహిణులకు చారుమతి తెలియజేసింది. అందరూ సంతోషించి, ఆమోదాన్ని తెలియజేశారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురుచూశారు.      ఆ రోజు రానే వచ్చింది. అందరూ శుచిగా స్నానాదులు ఆచరించారు. చారుమతి ఇంట ఆమెతో పాటు ఇరుగు పొరుగు ఇల్లాళ్ళందరూ.... వరలక్ష్మి చెప్పిన వ్రత విధానాన్ని పాటిస్తూ... షోడశోపచారాలతో ఆ తల్లిని అర్చించారు. తోరాలను పూజించారు. వరలక్ష్మికి ప్రతీకగా నిలిపిన కలశానికి, అనంతరం తమ ముంజేతులకు తోరాలను కట్టుకున్నారు. వ్రత మంటపానికి ముమ్మారు ప్రదక్షిణ చేశారు. ఈ విధంగా వ్రతం ఆచరించి, వారందరూ ఐశ్వర్య సంపన్నులయ్యారని వ్రత కథ వివరిస్తోంది. ఎలాంటి వివక్షలూ, పక్షపాతాలూ లేకుండా... వ్యష్ఠిగా కాకుండా సమష్ఠిగా వ్రతాలనూ, సత్కార్యాలనూ ఆచరించి, వచ్చిన ఫలితాన్ని సమానంగా అనుభవించాలని ఈ వ్రత కథ తెలియజేస్తోంది.


సౌభాగ్యాన్నీ, సంపదనూ ప్రసాదించేదిగానే కాకుండా, మహిళలందరూ ఆచరించదగినదిగానూ వరలక్ష్మి వ్రతం గణుతికెక్కింది. శ్రద్ధాభక్తులతో ఆ తల్లిని పూజించినవారిని ఎలాంటి కొరతా లేకుండా కటాక్షిస్తుందన్నది పెద్దల మాట.


సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ

శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా

ఆయపిళ్ళ రాజపాపUpdated Date - 2022-08-05T05:30:00+05:30 IST