ఆధ్యాత్మికత ఆ ప్రమాణాల్లో ఇమడదు...

ABN , First Publish Date - 2022-06-17T08:10:53+05:30 IST

‘సమాజ సంక్షేమం కోరేదే ఆధ్యాత్మికత’ అంటారు సద్గురు జగ్గీవాసుదేవ్‌.

ఆధ్యాత్మికత ఆ ప్రమాణాల్లో ఇమడదు...

‘సమాజ సంక్షేమం కోరేదే ఆధ్యాత్మికత’ అంటారు సద్గురు జగ్గీవాసుదేవ్‌. పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలు ఎన్నిటినో ఆయన చేపట్టారు. తాజాగా ‘మట్టిని కాపాడండి’ పేరుతో  దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి... మనిషికీ మట్టికీ ఉన్న సంబంధాన్ని వివరిస్తున్నారు. ‘ఆధ్యాత్మిక సాధన అంటే భౌతిక పరిమితులను అధిగమించడం’ అనిచెబుతున్న సద్గురు జగ్గీవాసుదేవ్‌ ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ


ఆధ్యాత్మికత దృషి ్టకోణంలో మట్టిప్రాధాన్యం ఏమిటి?

మట్టిని ఆధ్యాత్మికత నుంచి వేరు చేసి చూడలేం.  కులం, మతం, భాష, రాజకీయ సిద్ధాంతాలు, జాతి, జాతీయత, ప్రాంతం... ఇలా వైరుద్ధ్యాలు ఉన్నాయి. కానీ వీటన్నింటికీ కారణం మానవ జన్మ. దానికి ప్రధానమైన ఆలంబన మట్టి. మనం అందరం మట్టి నుంచి ఉద్భవించిన వాళ్లమే! మన అభివృద్ధికి కారణం అదే. మనం చనిపోయిన తర్వాత తిరిగి మట్టిలో కలిసిపోతాం. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అయితే ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటామనేదే ఒక పెద్ద ప్రశ్న.  ఇప్పుడే తెలుసుకుంటామా? లేదంటే ఖననం చేశాక తెలుసుకుంటామా? అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. నా దృష్టిలో ఇదే ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే భౌతిక పరిమితులను అధిగమించడం. ఆకాశం కేసి చూస్తూ కూర్చోవటం.... భూమి వైపు చూడటం.. కళ్లు మూసుకొని కూర్చోవటం- అది ఆధ్యాత్మికత కాదు.  చాలా సార్లు.. ‘‘మీ శరీరం.. నా శరీరం.. మీ మైండ్‌..నా మైండ్‌’’ అని అనుకుంటూ ఉంటాం. స్థూలంగా చూస్తే- ‘మీది’, ‘నాది’ అనేది ఏదీ లేదు. ఉన్నది ఒకటే ప్రాణశక్తి. దాన్ని ఒక్కొక్కరు వారి స్థాయిలను బట్టి అవగాహన చేసుకుంటూ ఉంటారు. ఇదే విధంగా మనస్సునూ, శరీరాన్నీ వేరు చేసి చూస్తూ ఉంటారు. కానీ అవి రెండూ ఒక్కటే! ఇలాంటి కారణాల వల్ల ఆధ్యాత్మికత అనేది తర్కబద్ధమైన ప్రమాణాల్లో ఇమడదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. 


గత 45 ఏళ్లుగా మట్టిని నిర్వీర్యం చేస్తూ వినాశనం వైపు ప్రయాణిస్తున్నామని పేర్కొన్నారు కదా...!

ఇది నిజమే! మనందరం మట్టి నుంచే వచ్చాం. మళ్లీ మట్టిలోకే వెళ్లిపోతాం. ఈ విషయాన్ని గమనించకుండా- సిద్ధాంతాలు, నమ్మకాలు, భౌతిక పరిమితులు- ఇలా రకరకాల గోడలు కట్టుకుంటూ వచ్చాం. దీంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రపంచమంతా ఒక్కటే! రాజకీయ కారణాలు, పాలనాపరమైన సౌలభ్యాల కోసం హద్దులు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మట్టిని నిర్వీర్యం చేస్తూ రావటం వల్ల మొత్తానికే మోసం వస్తోంది. ఈ భూగోళమేదైనా ఒక కేకా? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ముక్కలు చేయటానికి.. ఒక ప్రాంతంలో కరువు ఏర్పడితే మరొక ప్రాంతంపై ఆ ప్రభావం ఉంటుంది. మట్టి నిర్వీర్యం అయిపోయి, తినటానికి తిండి లేకపోతే ఘర్షణ తప్పదు. అది వినాశనం వైపు ప్రయాణించటమే!


ఈ తరం యువత  ప్రకృతికి, మట్టికి దూరంగా గడుపుతున్నారనే వాదన వినిపిస్తూ ఉంటుంది.. వారిని ప్రకృతి మూలాల వైపు ఎలా తీసుకువెళ్లాలి?

అసలు యువత అంటే ఎవరో చెప్పండి? అదే విధంగా ‘తరం’ అనే పదాన్ని ఎలా నిర్వచిస్తాం? వయస్సు ఆధారంగా తరాలను నిర్వచించకూడదు. ఎవరైనా తరం గురించి మాట్లాడుతున్నారంటే- వారు తమ బాధ్యతను తప్పించుకొ నేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం. నా దృష్టిలో- యువత, పిల్లలు, పెద్దలు- ఇలా రకరకాల తరాలు ఉండవు. అందరూ ఒక్కటే. భూమిపై జీవిస్తున్నవారందరూ ఒకటే తరం. వయస్సు ఆధారంగా మనుషులను విభజించటం చాలా తప్పు. భూగోళానికి అపారమైన హాని చేసిన వాళ్లం మనమే! దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మనదే! కానీ ఆ విషయాన్ని మర్చిపోయి- ‘భవిష్యత్తు తరాల వారి బాధ్యత’ అంటూ ఉంటారు.


మూడు నెలలుగా అనేక దేశాల్లో పర్యటించారు.  విధాన నిర్ణయకర్తలతో మాట్లాడారు. ప్రజలను కలిశారు. వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?

అందరూ మార్పును కోరుకుంటున్నారు. కానీ ఈ మార్పు రావాలంటే ప్రజల వైపు నుంచి ఒత్తిడి ఉండాలి. ఐదేళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వాల దృష్టి తక్షణ ఫలితాలపైనే ఉంటుంది. అవి దీర్ఘకాలిక దృష్టితో ప్రణాళిక అమలు చేయాలంటే ప్రజల ఒత్తిడి అవసరం. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు చూస్తుంటే- భవిష్యత్తులో కూడా వారు ప్రభుత్వాలపై ఒత్తిడి పెడతారనే నమ్మకం 

కలుగుతోంది. 


ఈ పర్యటనలలో మరచిపోలేని సంఘటన...

నేను జ్ఞాపకాల్లో జీవించను. (నవ్వుతూ).., నాకు అంత సమయం లేదు. నా ముఖం అద్దంలో చూసుకోవటానికి కూడా నాకు సమయం చిక్కటం లేదు. మీరు అడుగుతుంటే- ఒక సంఘటన గుర్తుకొస్తోంది. యూర్‌పలో అనుకుంటా.. నేను బైక్‌ మీద ప్రయాణిస్తూ ఒక చోట ఆగా. అక్కడ చాలా మంది ప్రజలు గుమిగూడారు. ఏడాదిన్నర పసివాడు నాకేసే ఆసక్తిగా చూస్తున్నాడు. సరదాగా నా చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ వాడి నోటి దగ్గర పెట్టా! వెంటనే వచ్చి రాని మాటలతో... ‘‘అల ఏలె ఏలెలే..’’ అన్నాడు. ఆ పిల్లాడి దాకా వెళ్లిందటే జనాల్లోకి వెళ్లినట్లే కదా...


ఈ భూమి మనందరిదీ..

మన సాగు నేలలు సారహీనమయ్యాయి. రసాయన ఎరువులు వేయనిదే పంటలు పండే పరిస్థితి లేదు. కానీ అవి చాలా ఖరీదు. పట్టణాల్లో సేంద్రియ వ్యవసాయం... అదీ ఇదీ అని చాలా చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో దాని అమలు అంత సులభం కాదు. ఉన్నపళాన వ్యవసాయ కమతాలను సేంద్రియంగా మార్చితే ఇన్ని కోట్ల మందికి ఆహారం అందించలేం. నేలలో నెమ్మదిగా సేంద్రియ పదార్థాన్ని పెంచుకుంటూ పోతే రసాయన ఎరువుల వాడకం క్రమేపీ తగ్గుతుంది. అప్పుడు రసాయన ఎరువుల కంపెనీలు నష్టపోతాయి. ఆ విషయాన్ని గమనించి అవి ఇప్పుడు జీవన ఎరువుల తయారీవైపు మారుతున్నాయి. కానీ అవి చాలా ఖరీదైనవి. ప్రభుత్వం కనుక రాయితీలు ఇవ్వకపోతే ఇవి అమ్ముడుపోవు. వ్యాపార రంగం, ప్రభుత్వం కలసి రైతులకు ఉపయోగపడేలా దీన్ని చేయాలి. పర్యావరణ విధ్వంసంలో మనమంతా భాగస్వాములం. కాబట్టి మనం కోరుకుంటున్న మార్పు రావాలంటే మనలో ప్రతి ఒక్కరం నేల పరిరక్షణలో భాగస్వాములం అవ్వాలి. గతంలో దేశాన్ని పట్టి పీడించిన ఆహార కొరతను అధిగమించడానికి హరిత విప్లవం అనేది ఒక వంతెనలా ఉపయోగపడింది. వంతెన ఎక్కినప్పుడు వీలయినంత త్వరగా దాన్ని దిగాలి. ఇప్పుడు హరిత విప్లవం అనే వంతెన దిగాల్సిన సమయం ఆసన్నమయింది. కాబట్టి మన పాలసీలను కొత్తగా రాసుకోవాలి. ఇండియా కోసం 500 పేజీలతో ఒక పాలసీ హ్యాండ్‌బుక్‌ను రూపొందించాం. 193 దేశాలకు వాటికి సరిపోయే విధానాలను రూపొందించి ఇచ్చాం. వీటిని అమలు చేస్తున్నట్లు ఇప్పటికే 74 దేశాలు ప్రకటించాయి. మరికొన్ని దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ప్రపంచం ఈ దిశవైపు అడుగులు వేస్తోంది అని చెప్పడంలో అనుమానం లేదు. అయితే ఎంత వేగంగా చేయగ లమనేది ప్రజల స్పందనపైనే ఆధారపడి ఉంది. ఈ భూమి నా ఒక్కడిది కాదు. మనందరిదీ. కాబట్టి ఇది మనందరి బాధ్యత.

Updated Date - 2022-06-17T08:10:53+05:30 IST