ఆత్మాన్వేషణ

ABN , First Publish Date - 2022-07-29T07:47:03+05:30 IST

‘‘కొందరు ‘దీన్ని’ (ఆత్మను) ఒక అద్భుతంలా చూస్తారు.

ఆత్మాన్వేషణ

‘‘కొందరు ‘దీన్ని’ (ఆత్మను) ఒక అద్భుతంలా చూస్తారు. కొందరు ‘దీన్ని’ ఒక అద్భుతం అని వర్ణిస్తారు, ఇంకొందరు ‘దీన్ని’ ఒక అద్భుతమైనదిగా వింటారు. అయితే దీని గురించి ఎవరికీ తెలీదు’’ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎవరికీ అంటే ఎవరైతే ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఇంద్రియాలను ఉపయోగిస్తారో వారికి. ఇంద్రియాలకూ, ఆత్మకూ మధ్య విభజన లేనంత కాలం ఇలా అన్వేషించేవారు ఆత్మ సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకోలేరన్నాడు శ్రీకృష్ణుడు. 


ఉప్పుతో చేసిన ఒక బొమ్మ సముద్రాన్ని అన్వేషించాలనుకుంది. తన ప్రయాణం ప్రారంభించింది. ఉపరితలంలో కెరటాలు ఉద్ధృతంగా ఉన్నప్పటికీ, సముద్రంలో లోతుల్లోకి అది ప్రవేశించింది. ఆ బొమ్మ మెల్లగా కరగడం మొదలైంది. అది బాగా లోతుకి ప్రవేశించే సమయానికి పూర్తిగా కరిగిపోయింది, సముద్రంలో భాగంగా మారిపోయింది. తనే సముద్రంగా మారిపోయిందని కూడా చెప్పొచ్చు. ఆ ఉప్పు బొమ్మకు వేరే అస్తిత్వం ఇక ఏమాత్రం లేదు. ఇప్పుడు అన్వేషించేది లేదా పరిశీలించేదే... తను దేన్ని పరిశీలించాలనుకున్నదో దానిగా మారిపోయింది. దీనివల్ల విభజన ముగిసిపోయింది. ఏకత్వం సిద్ధించింది. 


ఉప్పు బొమ్మను మన అహంకారంతో (అహం కర్త; ‘చేసేవాడిని నేనే’ అనే భావనతో) పోల్చవచ్చు. అది మన అనుభవాలు, ఆలోచనలు, చర్యలతో సత్యం నుంచి మనల్ని వేరు   చెయ్యడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ అస్తిత్వం లేకుండానో, సాధారణంగానో ఉండాలని ఎవరూ కోరుకోరు కదా!


కానీ ఏకత్వం వైపు చేసే ప్రయాణంలో విజయం సాధించాలంటే... ఉప్పు బొమ్మలా కరిగిపోవాలి. అహంకారాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. అంటే మనవి అనుకున్న ప్రతిదాన్నీ...  వస్తువులనైనా, ఆలోచనలనయినా పక్కన పడెయ్యాలి. ఈ ప్రయాణంలో ‘నా’, ‘నేను’, ‘నాది’ అనేవి వదులుకోవాల్సిన విషయాలే తప్ప... మన అస్థిత్వ చిహ్నాలు కాని స్థితిని సాధించాలి. అప్పుడే గమ్యానికి చేరుకోగలం. ఇలాంటి చైతన్యాన్ని పొందినప్పుడు... ‘మనకి తెలిసిందేమిటి, మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్నదేమిటి?’ అనే వాటికి అతీతంగా... ‘మనం ఎవరం?’ అనేది మనకు స్పష్టమవుతుంది. 

కె.శివప్రసాద్‌, ఐఎఎస్‌

Updated Date - 2022-07-29T07:47:03+05:30 IST