శిక్ష కాదు.. గురు కృప

ABN , First Publish Date - 2022-06-10T05:42:10+05:30 IST

అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకా అచార్యుడు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ప్రపంచానికి ఎన్నో ఆధ్యాత్మిక ఉత్సవాలను పరిచయం చేశారు.

శిక్ష కాదు.. గురు కృప

అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకా అచార్యుడు భక్తివేదాంత స్వామి శ్రీల 

ప్రభుపాద ప్రపంచానికి ఎన్నో ఆధ్యాత్మిక ఉత్సవాలను పరిచయం చేశారు. వాటిలో ఒకటి... శ్రీల రఘునాథ దాస గోస్వామి ‘పానిహటి... చిడా-దహి’ (అటుకులు-పెరుగు) ఉత్సవం. ఈ విలక్షణమైన ఉత్సవం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

అయిదు వందల ఏళ్ళ క్రితం, హరినామ సంకీర్తనోద్యమాన్ని నలుదిక్కులా పరివ్యాప్తి చేసిన శ్రీ చైతన్య మహాప్రభువుకు ఆరుగురు ప్రధాన శిష్యులు ఉండేవారు. వారిలో శ్రీల రఘునాథ దాస గోస్వామి ఒకరు. ఆయన పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో... సప్తగ్రామ్‌ నగరానికి సమీపంలోని శ్రీకృష్ణపురం అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గోవర్ధన మజుందార్‌. పెద తండ్రి హిరణ్య మజుందార్‌ పెద్ద భూస్వామి. తమ కుటుంబాలకు వారసుడు శ్రీ రఘునాథ దాస ఒక్కరే కావడంతో ఆయనను అల్లారుముద్దుగా పెంచారు. వారిది శ్రీ వైష్ణవ సంప్రదాయం. శ్రీల అద్వైతాచార్యుల శిష్యుడైన యదునందన ఠాకూర్‌కు వారు శిష్యులు. ఆయన బోధలు, జీవన శైలి రఘునాథునిపై గొప్ప ప్రభావం చూపించాయి. భౌతిక విషయాలు, భోగాల పట్ల అనాసక్తుణ్ణి చేశాయి. తమ అనంతరం వ్యాపారాలను రఘునాథ దాసు చూసుకుంటారనుకున్న ఆయన కుటుంబీకులకు ఇది సమస్యగా మారింది. వారు ఆలోచించి, రఘునాథునికి వివాహం జరిపించారు. కానీ రఘునాథుడి మనస్సులో హరిభక్తి దినదిన ప్రవర్ధమానం చెందసాగింది. 


శ్రీ చైతన్యుల దర్శనం...

శ్రీ చైతన్యులు సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి... శాంతిపూర్‌ గ్రామంలో తన తల్లిని కలుసుకున్నారు. ఆ సందర్భంలో రఘునాథుడు అక్కడే ఉన్నారు. మహా ప్రభువును దర్శించి, ఇంటికి వెళ్ళిన రఘునాథుడు... లౌకిక విషయాలపట్ల పూర్తిగా అనాసక్తులయ్యారు. వెంటనే జగన్నాథపురికి వెళ్ళి, శ్రీ చైతన్యులను కలుసుకోవాలనుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన ఇంటి నుంచి పారిపోవడం, తల్లితండ్రులు వెతికి ఇంటికి తీసుకురావడం పరిపాటిగా మారింది.


మర్కట వైరాగ్యం వద్దు...

ఈలోగా శ్రీ చైతన్యులు శాంతిపూర్‌  గ్రామానికి వచ్చారన్న వార్త రఘునాథుడికితెలిసింది. శ్రీ చైతన్యులను రఘునాథదాసు దర్శించి, సాష్టాంగవందనం ఆచరించారు. భౌతిక బంధాలు త్యజించి, ఆయనను పరిపూర్ణంగా సేవించాలన్న తన సంకల్పాన్ని వెల్లడించారు. అది విన్న శ్రీ చైతన్యులు ‘‘మర్కట వైరాగ్యాన్ని పెంపొందించుకోకు. కోతులు కూడా సర్వం త్యజించిన వాటిలా కనిపిస్తాయి. చెట్ల మీద నివసిస్తాయి. వస్త్రాలను ధరించవు. చెట్లకు కాసే పండ్లతో కడుపు నింపుకొంటాయి. కానీ అవకాశం దొరికినప్పుడల్లా ఆడ కోతులతో జత కడదామని చూస్తూ ఉంటాయి. నీవు అలాకాకుండా... బయటకు మాత్రం భౌతిక సంపదల మీద ఆసక్తి ఉన్నవాడిలా కనిపించు. మంచి వ్యాపారవేత్తగా నీ కర్తవ్యాలు నిర్వహించు. కానీ హృదయంలో సదా శ్రీకృష్ణుణ్ణే ధ్యానించు. త్వరలోనే శ్రీకృష్ణుడు నీ మీద కరుణ కురిపిస్తాడు’’ అని ఆశీర్వదించారు. ఆయన మాటలను రఘునాథుడు ఆచరణలో పెట్టారు.


శ్రీ నిత్యానందుల ఆదేశం...

ఇలా కొన్ని రోజులు గడిచాయి. పానిహటి అనే గ్రామంలోని రాఘవ పండితుల ఇంటికి శ్రీ నిత్యానంద ప్రభువు అతిథిగా వచ్చారని విని, రఘునాథుడు అక్కడకు వెళ్ళారు. ఆ సమయంలో... గంగానదీ తీరంలో... పవిత్రమైన మర్రి చెట్టు కింద నిత్యానంద ప్రభువు ఆసీనులై ఉన్నారు. సాక్షాత్తూ బలరామ స్వరూపుడైన ఆయన కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళడానికి తను అర్హుణ్ణి కాననే భావనతో... దూరం నుంచే సాష్టాంగవందనాన్ని రఘునాథులు సమర్పించారు. ఈలోగా నిత్యానందుల సేవకుడొకరు రఘునాథుణ్ణి గుర్తించాడు. ఆయనను నిత్యానందులవారికి చూపించాడు. అప్పుడు నిత్యానందులు ‘‘రఘునాథా! ఎందుకు దొంగలా దూరం నుంచే నమస్కరిస్తున్నావు?’’ అంటూ తనవద్దకు పిలిచారు. పాదాక్రాంతుడైన రఘునాథుల శిరస్సు మీద తన పాదాన్ని ఉంచారు. ‘‘నీవు దొంగలా దూరం నుంచే నమస్కరిస్తూ ఉంటే నేను పట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు నిన్ను శిక్షించాలి. నీవు సంపన్నుడివి కనుక... ఇక్కడ ఉన్న నా అనుచరులందరికీ అటుకులు, పెరుగుతో (చిడా, దహీ) విందు ఏర్పాటు చెయ్యి’’ అని ఆదేశించారు. సంతోషించిన రఘునాథుడు ఆ విధంగానే ఉత్సవం నిర్వహించారు. ఆయన వినయ విధేయతలకు నిత్యానందులు సంతృప్తి చెంది, ‘‘చైతన్య మహాప్రభువును చేరాలనే నీ సంకల్పం త్వరలోనే నెరవేరుతుంది అని ఆశీర్వదించారు.’’


పశ్చిమబెంగాల్‌లోని పానిహటిలో అలా మొదలైన ఈ ఉత్సవాన్ని... వందల ఏళ్ళ తరువాత కూడా భక్తులు ఆనందోత్సాహాలతో ఏటా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని హరేకృష్ణ కేంద్రంలో కొలువైన శ్రీశ్రీ నితాయ్‌ గౌరాంగులను (బలరామకృష్ణుల అవతారాలైన నిత్యానంద, చైతన్య మహాప్రభువులను) ఈ సందర్భంగా... ప్రతి సంవత్సరం ఒక తీర్థ క్షేత్రానికి తీసుకువెళ్ళి, భక్తులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ చైతన్య మహాప్రభువును సేవించాలనుకున్న రఘునాథుడికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. కానీ శ్రీ నిత్యానందుల కృప వల్ల... అవి తొలగిపోయాయి. మహాప్రభువులను సేవించే భాగ్యం కలిగింది. శిక్ష ద్వారా కృపను పొందిన శ్రీ రఘునాథుని ఉదంతం... గురువు అనుగ్రహంతోనే భగవంతుణ్ణి చేరే మార్గం సుగమం అవుతుందని మనకు వివరిస్తుంది.

సత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌, 

హైదరాబాద్‌, 9396956984  

Updated Date - 2022-06-10T05:42:10+05:30 IST