బంధాలు తెంచుకుంటేనే స్వేచ్ఛ

ABN , First Publish Date - 2022-07-15T09:36:11+05:30 IST

దీక్ష కావాలని అర్థించిన ప్రతి ఒక్కరికీ ఏ సద్గురువూ దీక్ష ఇవ్వడు. ‘‘సాధన మార్గాన్ని సూచించండి’’

బంధాలు తెంచుకుంటేనే స్వేచ్ఛ

దీక్ష కావాలని అర్థించిన ప్రతి ఒక్కరికీ ఏ సద్గురువూ దీక్ష ఇవ్వడు. ‘‘సాధన మార్గాన్ని సూచించండి’’ అని అడిగిన వెంటనే... వెనకా ముందూ చూడకుండా... ఏదో ఒక మార్గాన్ని సూచించడు. అడిగిన వ్యక్తినీ, అతని మానసిక స్థితిగతులనూ పరిశీలించి, అతను తగిన వ్యక్తి అని భావిస్తే... అతని స్థాయిని బట్టి సాధనా మార్గాన్ని సూచిస్తాడు. అంతేకాదు, అడిగిన వ్యక్తి ‘తాత్కాలిక ఆవేశంతో అడుగుతున్నాడా? కేవలం ఉత్త కుతూహలంతో అడుగుతున్నాడా? లక్ష్యాన్ని సాధించి తీరాలనే నిశ్చితాభిప్రాయంతో అడుగుతున్నాడా?’ అనేది తెలుసుకోవడానికి రకరకాల పరీక్షలు పెడతాడు.


జెన్‌ గురువు హ్యూ చుహ్‌ సరిగ్గా అలాంటి సద్గురువే. ఒక రోజు ఆయన వద్దకు ఒక మహిళ వచ్చి, ‘‘అయ్యా! మీ గొప్పతనం గురించి ఎందరో చెప్పగా విన్నాను. నాకు ఏదైనా ఒక సాధనా మార్గాన్ని సూచించండి’’ అని వేడుకుంది.

‘‘ఏమి చెప్పినా చేస్తావా?’’ అని అడిగాడు హ్యూ చుహ్‌. తప్పకుండా చేస్తానని చెప్పిందామె.

‘‘అది కఠినమైనదైతే?’’

‘‘ఎంత కఠినమైనదైనా వదలను. పట్టుదలతో చేస్తాను.’’

‘‘అది అపాయకరమైనదైతే?’’

‘‘ఎంత ప్రమాదకరమైనదైనా సరే, చేసి తీరుతాను.’’

‘‘ఒకవేళ అది చాలా భయంకరమైనదైతే?’’ 

‘‘అది ఎలాంటిదైనా నిస్సంకోచంగా, నిర్భయంగా చేసి తీరుతా’’నని దృఢంగా బదులిచ్చిందామె.

ఆమె మీద హ్యు చుహ్‌కు విశ్వాసం కలిగింది. ‘‘సరే! ‘పట్టించుకోకు.’.. ఇదే మంత్రం. దీన్ని సాధన చెయ్యి’’ అన్నాడు.

‘సరే’నని ఆమె ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. గురువు మాటలు ఆమెలో నరనరానా జీర్ణించుకుపోయాయి. 

ఒకరోజు ఆమె నివసిస్తున్న ఇంటికి నిప్పు అంటుకుంది. ‘పట్టించుకోకు’ అనే మాట ఆమె మనసులో మెదిలింది. ఆమెకు ఏ చింతా కలగలేదు. ఏమీ జరగనట్టు మామూలుగా ఉండగలిగింది.

మరొక రోజు ఆమె కుమారుడు బావిలో పడ్డాడు. అది చూసిన పొరుగువారు ఈ విషయాన్ని ఆమెకు చెప్పారు. ‘పట్టించుకోకు’ అని గురువు చెప్పిన మాట గుర్తుకువచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి దుఃఖం కనబడలేదు. కంట్లోంచీ ఒక్క చుక్క నీరైనా రాలేదు. అంటే ఆమె ఆస్తిపాస్తులతో సంబంధాన్ని, సంతానంతో బంధాన్నీ 

తెంచుకోగలిగింది.


ఇంకో రోజు... ఆమె భర్త వంట చేస్తూంటే... ఆమె వెళ్ళి, పొయ్యి మీద బాణలిలో మరుగుతున్న నూనెను నేలపై పోసింది. చప్పట్లు చరుస్తూ, నవ్వుతూ గంతులు వేసింది. ‘‘నీకు పిచ్చి పట్టింది’’అన్నాడు భర్త. 

ఊళ్ళోని వారందరూ పిచ్చిదని ఆమెను ఎగతాళి చేశారు. అందరి అరుపులనూ, లోకాభిప్రాయాన్నీ ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా, ఆనందంగా ఉండిపోయింది. గురువు సూచించిన ఆ సాధనా మార్గాన్ని ఆమె త్రికరణశుద్ధిగా పాటించింది. ఆ తరువాత హ్యూ చుహ్‌ను ఆమె కలిసినప్పుడు ‘‘నీకు జ్ఞానోదయం కలిగింది. సంపద, సంతానం, సంఘం... ఇలా అన్ని ముడులనూ తెంచుకున్న స్వేచ్ఛాజీవివి నువ్వు’’ అన్నాడాయన.

- రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-07-15T09:36:11+05:30 IST