వేదాంగాలు

ABN , First Publish Date - 2022-07-01T10:05:34+05:30 IST

వేదాంగాలు ఆరు. వేదాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలైన వేదాంగాల్లో శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు ఉన్నాయి.

వేదాంగాలు

వేదాంగాలు ఆరు. వేదాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలైన వేదాంగాల్లో శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు ఉన్నాయి. 

శిక్ష: వేదమంత్రాలను స్వరబద్ధంగా స్వచ్ఛమైన, కచ్చితమైన ఉచ్చారణ ఎలా ఉండాలో నిర్ధారిస్తుంది.              


కల్పం: యజ్ఞయాగాదులను నిర్వహించే పద్ధతులను చర్చిస్తుంది.                                    

వ్యాకరణం: అనేకమంది వ్యాకరణకర్తలు... వేద భాష రూపాన్ని స్థిరీకరించే ప్రయత్నం చేశారు. వీరందరిలో ప్రముఖుడు పాణిని. ఆయన రచించిన  ‘అష్టధ్యాయి’ ప్రపంచంలోని మొదటి శాస్త్రీయ వ్యాకరణ గ్రంథం. అది క్రీస్తు పూర్వం 500 సంవత్సర కాలం నాటిది. పాణిని వారసులలో అతి ముఖ్యుడు పతంజలి. ఆయన క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల కాలం నాటి వాడు. పాణిని వ్యాకరణ సూత్రాలకు గొప్పగా భాష్యం రాశాడు. సంస్కృత భాషకు చాలా తార్కికంగా, విస్పష్టంగా సూత్రాలను పతంజలి రూపొందించాడు. దీనితో సంస్కృత వాఙ్మయంలో  వ్యాకరణం గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంది.                    


నిరుక్తం: ఋగ్వేదంలోని చాలా పదాలకు అర్థాలు వ్యాఖ్యానిస్తూ రచించిన గ్రంథం యాస్కుని నిరుక్తం.                                            

జ్యోతిషం: ఋతువులను, నక్షత్ర గమనాలను పరిశీలించేది... ఖగోళ జ్యోతిష్య శాస్త్రం.                   

ఛందస్సు: వేదాల్లో ఉన్న వివిధ ఛందాలను వివరించే గ్రంథం. ఋగ్వేదంలో 19 రకాల ఛందస్సులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి, మూలమైనవి: గాయత్రి, ఉష్ణిక్‌, అనుస్టప్‌, బృహతి, విరాట్‌, త్రిస్టుప్‌, జగతి  అనేవి. గానం కోసం ‘గాయత్రి ఛందం’ ముఖ్యమైనది. 

సోమపానం చేసేటపుడు కంఠం విప్పుకొంటుంది. గొంతు బాగా పెగులుతుంది. ఋగ్వేదం తొమ్మిదో మండలం అంతా సోమపాన మండలం. ఇందులోని ఋక్కులన్నీ చాలావరకు ‘గాయత్రి ఛందం’లోనే ఉంటాయి. ఈ గానాన్ని ‘గాయత్రి సోమం’ అని కూడా అంటారు. ఈ వేదాంగాల సాహిత్యం క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల కాలానికి చెందినది.  తర్వాతి కాలపు సాహిత్యం స్మృతులు. వీటిలో మను స్మృతి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే నిచ్చెన మెట్ల కులవ్యవస్థను మరింతగా స్థిరీకరించి, కొత్త కులాలను కూడా సృష్టించిన స్మృతి ఇది. 

-పి.బి.చారి

-9704934614

Updated Date - 2022-07-01T10:05:34+05:30 IST