త్రిగుణ స్వరూపమే నవరాత్రి

ABN , First Publish Date - 2022-09-30T05:54:10+05:30 IST

‘నవరాత్రి’ అంటే కేవలం తొమ్మిది రోజులు చేసుకొనే ఉత్సవం కాదు. స్త్రీత్వం తాలూకు మూడు పరిమాణాల్ని... దుర్గ, లక్ష్మి, సరస్వతిగా... కొలిచే సందర్భం. ఆ ముగ్గురూ ‘భూమి, సూర్యుడు, చంద్రుడు’ అనే మూడు గ్రహాలకు ప్రతీకలు.

త్రిగుణ స్వరూపమే నవరాత్రి

‘నవరాత్రి’ అంటే కేవలం తొమ్మిది రోజులు చేసుకొనే ఉత్సవం కాదు. స్త్రీత్వం తాలూకు మూడు పరిమాణాల్ని... దుర్గ, లక్ష్మి, సరస్వతిగా... కొలిచే సందర్భం. ఆ ముగ్గురూ ‘భూమి, సూర్యుడు, చంద్రుడు’ అనే మూడు గ్రహాలకు ప్రతీకలు. వాటికి, మన శరీరానికి లోతైన సంబంధం ఉంది. భూమాతను తమోగుణానికీ, సూర్యుణ్ణి రజోగుణానికీ, చంద్రుణ్ణి సత్త్వ గుణానికీ చిహ్నాలుగా పరిగణిస్తారు. ‘తమస్సు’ అంటే జడత్వం; ‘రజస్సు’ అంటే చర్య లేదా ఉద్విగ్నత; ‘సత్త్వ’ అంటే... ఒక విధంగా మన పరిమితులను దాటి ఐక్యమవడం, కరిగిపోవడం. నవరాత్రి వర్గీకరణ కూడా ఈ ప్రాథమిక గుణాలను అనుసరించే జరిగింది. మొదటి మూడు రోజులూ దుర్గాదేవికి, తరువాతి మూడు రోజులూ లక్ష్మీదేవికి, ఆఖరి మూడు రోజులూ సరస్వతీదేవికీ అంకితం చేశారు. పదవరోజు విజయదశమి. జీవితంలో ఈ మూడు అంశాల మీద పరిపూర్ణమైన విజయాన్ని అది సూచిస్తుంది. 


దేవీ స్వరూపంలోని మొదటి రెండు పార్శ్వాలూ మానవుల మనుగడకూ, శ్రేయస్సుకూ అవసరం. మూడోది... పరిమితులను అధిగమించాలనే ఆకాంక్ష. సరస్వతీ కటాక్షం పొందాలంటే మీరు కృషి చేయాలి. లేదంటే ఆమెను చేరుకోలేరు. అసలు ఈ మూడు పార్శ్వాలూ లేని భౌతిక పదార్థం ఏదీ లేదు. ‘నిర్దిష్టమైన స్థితి లేదా స్వభావం, శక్తి, సచేతనత్వం’ అనే మూడు పార్శ్వాల నుంచి ఏ పరమాణువూ స్వతంత్రమైనది కాదు. అవి లేకుండా దేన్నీ మనం కలిపి ఉంచలేం. కేవలం సత్త్వగుణమే ఉంటే మీరు ఈ నేల మీద ఒక్క క్షణం కూడా ఉండలేరు. రజోగుణం ఒక్కటే ఉంటే... అది పని చెయ్యదు. తమో గుణం మాత్రమే ఉంటే... ఎప్పుడూ నిద్రావస్థలోనే ఉంటారు. ఈ మూడు గుణాలూ అన్నిటిలోనూ ఉంటాయి. వాటిని మీరు ఏ మేరకు మిశ్రమం చేస్తున్నారనేదే ప్రశ్న. 


తొలి మూడు రోజులు... తమోగుణం: దేవీ నవరాత్రుల్లో తొలి మూడు రోజులూ తమోగుణ ప్రధానమైనవి. దుర్గా కాళీ తదితర తీక్షణమైన రూపాల్లో దేవి ఉంటుంది. తమోగుణం భూస్వభావం. అంటే పుట్టుకకు మూలమైన భూమాత గుణం. మనం తల్లి గర్భంలో గడిపే కాలం తమోమయ భూయిష్టం. అది దాదాపు సుప్తావస్థలాంటిది. కానీ మనలో ఎదుగుదల ఉంటుంది. మనం భూమాత ఒడిలో ఉన్నాం. ఆమెతో కలిసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆమెలో భాగం. ఆమె కోరుకున్నప్పుడు మనల్ని బయటకు విడుదల చేస్తుంది. మళ్ళీ తను కోరుకున్నప్పుడు తనలోకి లాగేసుకుంటుంది. మనం ఎప్పుడూ మన భౌతిక శరీరాన్ని గుర్తుచేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. మీరు ఏ పనయినా చెయ్యండి. కానీ రోజులో కనీసం ఒక గంట పాటు మీ వేళ్ళు మట్టిని తాకాలి. పెరట్లో ఏదైనా పని చెయ్యండి. దానివల్ల మీరు అమరులు కాదనే సహజమైన శారీరకమైన స్మృతి మీకు ఏర్పడుతుంది. ‘నేను శాశ్వతం కాదు’ అని మీ శరీరానికి తెలుస్తుంది. అలా తెలియడం... ఆధ్యాత్మిక అన్వేషణ మీద మనం శ్రద్ధ పెట్టడానికి ఎంతో కీలకం. ‘‘ఎంత తొందరగా ఈ విషయం అనుభవంలోకి వస్తే... అంత పటిష్టమైన ఆధ్యాత్మిక దృష్టి అలవడుతుంది’’ అని నేను ఆశ్రమంలో ఉన్నవారికి చెబుతూ ఉంటాను. 


మధ్య మూడు రోజులు... రజోగుణం: రజోగుణం ప్రవేశిస్తే... మీరు ఏదో ఒకటి చేయాలనుకుంటారు. కానీ అలా చేయడానికి తగిన ఎరుక, సచేతనత్వం లేకపోతే... బాగున్నంత కాలం బాగుంటుంది. తరువాత చాలా దుర్భరంగా ఉంటుంది. ఇది రజోగుణ స్వభావం. ఈ గుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి శక్తిమంతుడు. అయితే ఆ శక్తి సక్రమంగా వినియోగం కావాలి. మనం చేసే పని మనల్ని విముక్తుల్ని చేసేది కావచ్చు లేదా చిక్కుకుపోయేలా చేసేది కావచ్చు. సంపూర్ణమైన సుముఖతతో ఏ పనైనా చేస్తే... అది అద్భుతంగా ఉంటుంది. మనకు ఆనందాన్ని ఇస్తుంది. అదే ఏ కారణం వల్లనైనా విముఖతతో చేస్తే... మనకు బాధ కలిగిస్తుంది. కాబట్టి నేల మీద కసువు ఊడ్చే పని చేస్తున్నా.... దానికి అంకితం అయిపోవాలి. పూర్తిగా నిమగ్నమై ఆ పని చేయాలి. దేనిలోనైనా పూర్తి ఉద్విగ్నతతో లీనమైనప్పుడు... మీ దృష్టిలో మరేదీ ఉండదు. శ్వాస తీసుకోవడం, నడవడం, నర్తించడం, పాడడం, జీవించడం... ఇలా ప్రతిదాన్నీ ఉద్విగ్నతతో చేయండి. అసలు అన్నిటిపట్లా సంపూర్ణమైన నిమగ్నతే మీ అసలైన ఉనికి అని తెలుసుకోండి. 


చివరి మూడు రోజులు... సత్త్వగుణం: తమోగుణం నుంచి సత్త్వగుణం వైపు పయనించడం అంటే.... మన భౌతిక, మానసిక, భావోద్వేగ శక్తులను శుద్ధి చేసుకుంటున్నామని అర్థం. వాటిని మరింత శుద్ధి చేసి, పారదర్శకంగా మారితే... మనలోని సృష్టి మూలాన్ని తెలుసుకోగలం. ప్రస్తుతం మీ శరీరం గోడలా అయిపోయి, అన్నిటినీ నిరోధిస్తోంది కాబట్టి... మహత్తరమైన సృష్టి మూలాన్ని చూడలేకపోతున్నారు. శుద్ధి చేయకపోతే... మనకు తెలిసేది గోడ నిర్మాణం మాత్రమే. దాని లోపల ఉన్న జీవాన్ని గురించి తెలుసుకోలేం. 


నవరాత్రుల తరువాత వచ్చే రోజు... విజయదశమి. అంటే మీరు ఆ మూడు గుణాలనూ జయించారు. మీరు వాటికి లొంగకుండా... అన్నింటినీ దాటారు. అన్నింటినీ అనుభవించారు, కానీ వాటిని అంటించుకోలేదు. మీరు అన్నింటిలో పాల్గొన్నారు. కానీ దేనిమీదా వ్యామోహపడలేదు. అంటే మీరు వాటిపై విజయం సాధించారు. అదే విజయ దశమి... విజయం సాధించిన రోజు. 


సద్గురు జగ్గీవాసుదేవ్‌

Read more