జగజ్జ్యోతి
ABN , First Publish Date - 2022-08-05T05:30:00+05:30 IST
వెలుతురు సోకని బండలు చీకటిలో మగ్గుతూనే ఉన్నాయి. ఆ కొండలకూ బండలకూ కిరణాల అడుగుల సవ్వడులు వినబడుతూనే ఉన్నాయి. కానీ ఇంకా వాటి దరి చేరలేదు. ఆ విధంగా అలమటిస్తున్న జీవితాల్లోకి ‘నేనే వెలుగును’

వెలుతురు సోకని బండలు చీకటిలో మగ్గుతూనే ఉన్నాయి. ఆ కొండలకూ బండలకూ కిరణాల అడుగుల సవ్వడులు వినబడుతూనే ఉన్నాయి. కానీ ఇంకా వాటి దరి చేరలేదు. ఆ విధంగా అలమటిస్తున్న జీవితాల్లోకి ‘నేనే వెలుగును’ అంటూ ఏసు క్రీస్తు ముందుకు వచ్చాడు. చీకటిలో ఉన్నవారికి వెలుగు ఎంతో అవసరం. కానీ దాన్ని ఆస్వాదించే స్థితిలో వారు ఉన్నారా? ఈ లోకంలో క్రీస్తు వెలుగులా సంచరించాడు. కానీ ఆ కాంతిని ఎంతమంది గుర్తించారు? ఎంతమంది తమలోకి ఆహ్వానించారు? అనేది సందేహమే. అప్పుడే కాదు, ఇప్పుడూ అంతరంగంలో వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
క్రీస్తులోని జీవాన్ని చీకటిని అణచివేసే ఉజ్జ్వలమైన మహా ప్రకాశంగా యోహాను భక్తుడు దర్శించాడు. విశ్వం మొత్తానికి ఎత్తైన కొండ శిఖరంపై దీప శిఖలా వెలిగిన కాంతి ఆయన. తన అమృత వాక్కుల ద్వారా... అఖిల మానవాళి సుఖంగా నడవడం కోసం... వారి పాదాలకు దీపంలా మారాడు. ‘‘మీరందరూ వెలుతురు బిడ్డలు. చీకటిలో ఉండాల్సినవారు కాదు...’’ అంటూ జీవితాంతం చెయ్యి పట్టి నడిపించే వెలుగయ్యాడు.
ఆ వెలుగు అంతటా వ్యాపించింది. ముఖ్యంగా చీకు, చింతల్లో మగ్గిపోతున్నవారిని పలకరించింది. దిక్కూ మొక్కూ లేనివారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. ఏం చెయ్యాలో దిక్కుతోచక... అయోమయపు ఆకలితో అలమటించేవారికి... ‘సందేశం’ అనే భోజనంగా మారింది. మంచి చేయాలనే దాహంతో ఉన్న వారికి తోవ చూపి.. ఆ దాహార్తిని తీర్చింది. ఎందరికో అంగవైకల్యాలను పోగొట్టి, నయం చేసింది. ‘జయమే గమ్యం’ అనుకొని... అనేక అపమార్గాలు తొక్కినవారిని... సరైన మార్గంలో నడిపించింది. ఆపదలు చుట్టుముట్టినప్పుడు, ధైర్యం కోల్పోయి, పట్టు సడలినవారికి... విశ్వాస కవచం ధరింపజేసి, ముందుకు కదను తొక్కించింది. అనేకానేక బాధలతో, దాడులతో, దురాచారాలతో పీడితులైన దుఃఖితులకు ఓదార్పుగా నిలిచింది. ఏసు విశ్వమంతా వ్యాపించిన కాంతి... జగజ్జ్యోతి.
డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు 9866755024