Jain story: కృతజ్ఞత

ABN , First Publish Date - 2022-11-18T02:48:43+05:30 IST

సుప్రసిద్ధ జెన్‌ గురువు ఒబాకు కియున్‌... చైనాలోని ఫ్యుజియన్‌ ప్రాంతంలో జన్మించాడు. అతనికి బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఎన్నో సందేహాలతో అతను సతమతం అయ్యేవాడు.

 Jain story: కృతజ్ఞత

జెన్‌ కథ

సుప్రసిద్ధ జెన్‌ గురువు ఒబాకు కియున్‌... చైనాలోని ఫ్యుజియన్‌ ప్రాంతంలో జన్మించాడు. అతనికి బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఎన్నో సందేహాలతో అతను సతమతం అయ్యేవాడు. తన సందేహాలను తీర్చి, సక్రమమైన మార్గంలో పెట్టగలిగే గురువు బైజాంగ్‌ హుయాహై మాత్రమేనని నిర్ణయించుకున్నాడు. బైజాంగ్‌ దగ్గర చేరి, ఆయన పర్యవేక్షణలో సాధన, అధ్యయనం చేశాడు. చైనాలోని హుయాంగ్బో పర్వతం మీద సన్యాస జీవితం గడపడం వల్లా, ‘క్సియన్‌’ అనే సన్యాస నామాన్ని స్వీకరించడం వల్లా... కియున్‌ను ‘యాంగ్బో గ్సియన్‌’ అనే పేరుతోనూ పిలిచేవారు.

గురువుగా ఎందరెందరినో కియున్‌ ఆకర్షించాడు. ఎందరినో గురువులుగా తీర్చిదిద్దాడు. ఆధ్యాత్మిక సాధనలో అత్యున్నత స్థాయికి చేరి, జ్ఞానసిద్ధి పొందిన తరువాత కూడా... గౌతమ బుద్ధుణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో అతను ఆరాధించేవాడు.

ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ పరమహంస చరిత్రలోని ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తోతాపురి అనే గురువు ద్వారా రామకృష్ణులకు నిర్వికల్ప సమాధి స్థితి కలిగింది. తోతాపురి రోజూ ధ్యానం చేసేవారు. ఒక రోజు ధ్యానానికి కూర్చుంటున్న తోతాపురిని ‘‘ఉత్తమోత్తమ జ్ఞానం సాధించిన మీరు ఇంతగా ఎందుకు ధ్యానం చేస్తున్నారు?’’ అని అడిగారు రామకృష్ణులు. జ్ఞానసిద్ధి పొందినవారు జపతపాలేవీ చేయవలసిన పని లేదన్నది చాలామంది విశ్వాసం.

ఆ ప్రశ్నకు జవాబుగా తను నిత్యం తోమే తన లోహపు కమండలాన్ని తోతాపురి చూపిస్తూ... ‘‘చూశావా! ఇది ఎంత ధగధగలాడుతోందో! ప్రతిరోజూ తోమకుంటే... మెరుగు పెట్టకుంటే... మనసు కళంకితం అవుతుంది’’ అన్నారు.

‘‘ఆ మాట నిజమే కానీ, బంగారు పాత్రనయితే ప్రతిరోజూ తోమక్కర్లేదు కదా!’’ అన్నారు రామకృష్ణులు.

‘‘అవును. నీవన్నది నిజమే’’ అని నవ్వుతూ అంగీకరించారు తోతాపురి.

తోతాపురిలాగే కియున్‌ కూడా జ్ఞానసిద్ధి పొందిన తరువాత బుద్ధుణ్ణి ఆరాధిస్తూంటే... ‘ఈయన ఇంకా దేనికోసం బుద్ధుణ్ణి ప్రార్థిస్తున్నాడు? ఎందుకీ ఆరాధన?’ అనే సందేహం అతని శిష్యులకు కలిగింది. ఒకరోజు వారు ఆ సందేహాన్ని వెల్లడించారు.

కియున్‌ నవ్వుతూ ‘‘అత్యంత విలువైనదాన్ని, అత్యంత ఆవశ్యకమైనదాన్ని కరుణామయుడైన ఆయన నాకు ఇచ్చాడు. ఈ లోకంలో ఇక నాకు కావలసిందేమీ లేదు. కేవలం ఆయన పట్ల కృతజ్ఞత కనబరచడం కోసం ఇలా ఆరాధిస్తూ ఉంటాను, అంతే!’’ అన్నాడు.

మనల్ని కని, పెంచి, పోషించిన తల్లితండ్రుల ఋణం వృద్ధాప్యంలో వారికి తగిన సేవలు చేసి తీర్చుకోవచ్చు కానీ, జ్ఞానాన్ని ఇచ్చిన గురువుల ఋణాన్ని తీర్చుకోవడం ఏ లౌకికమైన పనుల వల్లా, సంపదల వల్లా జరిగే పని కాదంటారు ఓషో. వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడమే మనం చేయగలిగేది. వారి బోధల సారాన్ని గ్రహించి, ఆచరించి, వీలైనంతమందికి అందించడం ద్వారా ఆ కృతజ్ఞతను తెలుపుకోవచ్చు.

కియున్‌ శిష్యుల్లో... ర్యుకి ఇన్‌జెన్‌... చైనా నుంచి జపాన్‌ వెళ్ళి, ఆధ్యాత్మిక ప్రచారం చేశాడు. చివరివరకూ బుద్ధుణ్ణి ఆరాధించిన కియున్‌... బుద్ధుణ్ణే స్మరిస్తూ, క్రీస్తుశకం 850లో... హుయాంగ్బో పర్వతంపైనే తనువు చాలించాడు.

-రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-11-18T02:48:44+05:30 IST