నమ్మినవారికి ఆత్మబంధువై...

ABN , First Publish Date - 2022-07-29T07:35:57+05:30 IST

తన కాలంలో... సమాజంలో ఉన్న మూఢ భావాలనూ, ఆచారాలనూ ఏసు క్రీస్తు నిర్మొహమాటంగా ఖండించాడు.

నమ్మినవారికి ఆత్మబంధువై...

న కాలంలో... సమాజంలో ఉన్న మూఢ భావాలనూ, ఆచారాలనూ ఏసు క్రీస్తు నిర్మొహమాటంగా ఖండించాడు. అవి ఎంత ప్రమాదకరమైనవో ఆయనకు తెలుసు. ఒక విషయం మీద సరైన అవగాహన లేకుండా... అమాయకంగా నమ్మడంలో ఈ మూఢత్వం పాత్ర ఇంతా అంతా కాదు. సత్యానికి దూరంగా, హేతు దృక్పథానికి భిన్నంగా, మూర్ఖ విశ్వాసానికి దగ్గరగా... అనాచారాన్నీ, దురాచారాన్నీ పెంచి పోషించే వ్యవస్థకు ప్రాణాధారంలా ఈ మూఢత్వం నిలుస్తుంది. అదే అంధ విశ్వాసం.  ప్రజలను వెలుగుబాటలో నడిపించాలనుకున్న క్రీస్తుకు ఇవన్నీ ముళ్ళకంపల్లా కనిపించాయి. 


తొలి మానవులైన ఆదాం, హవ్వల దగ్గర నుంచి, క్రీస్తు పుట్టే వరకూ.. సంఘంలో కాలూనిన అతి భయానకమైన, జుగుప్సాకరమైన సంఘాచారాలు, మతాచారాలు చాలా ఉన్నాయి. తాము మాత్రమే క్షేమంగా ఉండాలనే స్వార్థంతో ఇచ్చే నరబలుల్లాంటివి వీటిలో ఉన్నాయి. వాటిని నిర్ద్వంద్వంగా, రాజీ పడకుండా క్రీస్తు ఎదుర్కొన్నాడు. మూఢత్వానికి శత్రువుగా నిలిచాడు. అందుకు నిందలు కూడా భరించాడు. నాటి పాలకులకూ, ఛాందసులకూ ఆయన ఒక తిరుగుబాటుదారునిలా, ఒక మహా విప్లవకారునిలా కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. కాలానికీ, స్థలానికీ, వ్యక్తులకూ అతీతంగా... స్థిరంగా నిలిచేదే సత్యం. సత్య బోధకుల మాటలు స్వార్థపరులకు చేదుగా ఉంటాయి. 


గుడిలో వ్యాపారం సాగించేవారిని క్రీస్తు తరిమికొట్టిన ఉదంతం... స్వార్థపరుల తీరుపై ఆయనకు ఉన్న ఆగ్రహాన్నీ, అసహ్యాన్నీ స్పష్టం చేస్తుంది. అందుకే అనేక సామాజిక రుగ్మతల్ని నయంచేసే మహా వైద్యుడిలా ఆయన కనిపించాడు. పాలకుల, ఉన్నతవర్గాల ఛీత్కారాలకూ, చీదరింపులకూ గురవుతున్న సామాన్య జనాన్ని ఆయన అక్కున చేర్చుకొని ఆదరించాడు. క్రీస్తు నావాడు అని నమ్మినవారికి ఆత్మబంధువై నిలిచాడు.

డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - 2022-07-29T07:35:57+05:30 IST