ఆహా.. నేహ!
ABN , First Publish Date - 2022-10-17T10:55:42+05:30 IST
ఆహా.. నేహ!
యాంకర్, స్పోర్ట్స్ ప్రజెంటర్‌గానే మచ్చా నేహ పదేళ్లనుంచి ‘టీవీ’క్షకులకు తెలుసు. వాస్తవానికి ఆమె మల్టీ టాలెంటెడ్ పర్సన్. జిమ్మ్నాస్టిక్స్‌లో జాతీయ స్థాయి క్రీడాకారిణి. రాష్ట్రస్థాయిలో స్విమ్మర్. డ్యాన్సర్, మోడల్, యోగా ట్రైనర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూడా పని చేసిన విభిన్న నేపథ్యం. ఇటీవలే బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా వెళ్లొచ్చిన నేహను ‘నవ్య’ పలకరించగా తన జీవిత విశేషాల్ని, అనేక విషయాల్ని చెప్పుకొచ్చిందిలా..
‘‘జీవితంలో ఏదీ ప్లాన్ చేయలేదు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్లానంతే. ఎలాంటి రిఫరెన్స్ లేకుండా బిగ్‌బాస్ సీజన్-6 లో పాల్గొనే అవకాశం వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేప్పుడు కూల్‌గా వెళ్లా. దగ్గరగా అక్కడి జనాల ఆలోచనలు చూశా. అక్కడి వాళ్ల బాధలు విన్నాక.. మనవి చిన్న కష్టాలే అనిపించింది. ఇంటికెళ్లి ‘అమ్మా..’ అంటే అన్నం పెట్టుకుని వచ్చేది అమ్మ. బిగ్‌బాస్ హౌస్‌లో అలాంటి పరిస్థితి లేదు. మనమే వండుకోవాలి. అలా ఆకలి బాధ తెలిసింది. జీవితంలో కొట్టి నేర్పించినా నేర్చుకోలేని విషయాలు.. బిగ్‌బాస్ హౌస్‌లో నేర్చుకున్నా. మన గురించి మనమే పట్టించుకోవాలి. ఇల్లు శుభ్రం చేయటం..అంట్లుతోమడం నేర్చుకున్నా(నవ్వులు). ఒకటి మాత్రం వాస్తవం.. ప్రపంచాన్ని డిఫరెంట్ వ్యూలో చూడటం నేర్చుకున్నా. ఇకపోతే నేను మాట్లాడిన కొన్ని విషయాలు వేరే విధంగా పోట్రేట్ అయ్యాననే బాధ కొంచెం ఉంది కానీ.. అంత పెద్ద ఫ్లాట్ ఫామ్‌కి వెళ్లటమే అసలైన విజయం సాధించినట్లు!
కష్టాలను తట్టుకోవాలంటే..
ఎవరో వస్తారని.. సాయం చేస్తారని.. నేనెప్పుడూ ఎదురు చూడలేదు. ఖాళీగా కూర్చోకుండా కొత్త పని నేర్చుకోవడం.. కొత్త విషయాల్ని తెలుసుకోవాలనే కుతూహలం నాది. ఏ నేపథ్యమూ లేకుండా ఇక్కడ నిలదొక్కుకోవటం అంత సులువు కాదు. ఈ గుర్తింపు వెనక ఎన్నో కష్టాలున్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం దగ్గర ఉండే గోకినేపల్లి మా ఊరు. మా నాన్న పేరు హరినాథ్‌బాబు, రైతు. అమ్మ పేరు వాణి, గృహిణి. తమ్ముడు సూర్య ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడికి రావటానికి పెద్ద పోరాటమే చేశా. ఇంటి నుంచే అది ఆరంభమైంది. బయటి వాళ్లకు భయపడి ఈ రంగంలోకి వద్దన్నారు నాన్న. మొండిఘటాన్ని కాబట్టి అమ్మ సాయంతో నాన్నను ఒప్పించి ఇటొచ్చా. ఇక ఆ జుట్టు, ఆ మేకప్, ఆ డ్రెస్సుకోవటమేంటీ? అనేవాళ్లు కొందరు. ‘మా అమ్మాయికి ఇష్టం’ అని ఇంట్లో అనేవాళ్లు. ఇన్ని మాటలు పడాలా? ఇవన్నీ భరించాలా? అని అమ్మ దగ్గర ఏడ్చేసేదాన్ని. ‘పక్కనోళ్ల జడ్జిమెంట్ నువ్వు పట్టించుకోవద్దు’ అనేది అమ్మ. అమ్మాయిలు ఈ రంగంలో రాణించాలంటే జీవితాంతం రాళ్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. కష్టాలు ఇక్కడ సర్వసాధారణం. వాటిని తట్టుకోవాలంటే.. మానసికబలమే పనికొస్తుంది. ఇది నాకు స్పోర్ట్స్ నేపథ్యం నుంచే వచ్చింది. ఒక్కమాటలో జీవితమే తట్టి, పట్టి, కొట్టి పాఠాలు నేర్పించింది. ఆ అనుభవపాఠాలు చిన్న వయసులో నేర్చుకున్నా.
జాతీయస్థాయిలో 26 మెడల్స్ గెలుచుకున్నా..
బాల్యంలో నేను ఓవర్ హైపర్. తెగ అల్లరి చేసేదాన్ని. మా అమ్మ కబడ్డీ, కోకో ప్లేయర్. ఒక రోజు వార్తాపత్రికలో వచ్చిన జిమ్నాస్టియన్ ఫొటోను అమ్మ చూపించింది. వెంటనే చేశా. ఖమ్మంలోని జిమ్నాస్టిక్స్ కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లింది. అక్కడ నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ‘ఈ అమ్మాయి నేషనల్ ప్లేయర్ అవుతుంది’ అన్నారు. అప్పటినుంచి ఉదయాన్నే నాలుగింటికి నిద్రలేచేది అమ్మ. పనులన్నీ చేసుకుని.. ప్రతి రోజూ తెల్లారుజామున ఐదున్నరకు బస్సులో ఖమ్మంకు నన్ను తీసుకెళ్లేది. ఎనిమిదిన్నర తర్వాత మళ్లీ ఇంటికి తీసుకొచ్చేది. అమ్మ చేసిన త్యాగం మర్చిపోలేను. జిమ్నాస్టిక్స్ రెండు రకాలుంటాయి. ఒకటి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, రెండోది రిథమిక్ జిమ్నాస్టిక్స్. నేను ఆర్టిస్టిక్ జిమ్నాస్టియన్. కోచింగ్‌లో చేరాక నెల తర్వాత జిల్లాస్థాయిలో పేరు తెచ్చుకున్నా. సాధనకోసం ఖమ్మంకు షిఫ్టు అయ్యాం. ఐదో తరగతిలోనే జాతీయస్థాయికి వెళ్లా. ఏడో తరగతిలో జాతీయస్థాయి మెడల్‌ను జిమ్నాస్టిక్స్‌లో గెలిచా. సబ్ జూనియర్ అయిన నేను సీనియర్స్‌తో పోటీపడేదాన్ని. సౌత్ ఇండియా నేషనల్స్‌లో వరుసగా మూడేళ్లు చాంపియన్‌ను. ఏడేళ్లు రాష్ట్రస్థాయి చాంఫియన్‌ను నేనే. అంత టఫ్‌గా ప్రత్యర్థులకు పోటీ ఇచ్చేదాన్ని. 27 నేషనల్ స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొని 26 నేషనల్ మెడల్స్ గెలుచుకున్నా.
మర్చిపోలేని సంఘటన అది..
ఒకరోజు కర్రపై జిమ్నాస్టిక్స్ చేస్తూ దిగాలనుకున్నప్పుడు.. కింద నుంచి సడెన్‌గా ఒకబ్బాయి పరిగెత్తాడు. తన మీద పడతానేమోనని.. కాలు వెనక్కి అన్నానంతే. కాలు విరిగింది. మూడునెలలు బెడ్‌రెస్ట్ తీసుకోమన్నారు. రోజూ ఫిజియోథెరపీ చేయించుకునేదాన్ని. ఆ సమయంలో నరకం చూశా. నా చేతులు గట్టిగా కొరికి ఏడ్చేదాన్ని. అంతలా మోకాలి నొప్పి ఉండేది. ‘నీ పని అంతే.. ఇక జిమ్నాస్టిక్స్‌కి పనికిరావు’ అన్నారు కొందరు. ‘ఈ గేమ్ కాకుంటే ఇంకో గేమ్’ అనేది మా అమ్మ. ఇంట్లో వాళ్ల సహకారంతో నిలబడ్డా. ఆ తర్వాత రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లోకి వచ్చా. అక్కడా పేరు సంపాదించా. జిమ్నాస్టిక్స్‌తో క్రమశిక్షణ, విల్‌పవర్‌తో పాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. జిమ్నాస్టిక్స్‌లో మజిల్ పవర్ కోసం స్విమ్మింగ్‌కి వెళ్లేదాన్ని. అబ్బాయిలతో పోటీపడి గెలిచేదాన్ని. దీంతో రాష్ట్టస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని నాలుగో స్థానం సంపాదించా. డ్యాన్స్ చేయటం వల్ల మ్యూజిక్ అటాచ్‌మెంట్, గోయింగ్ విత్ ఫ్లో నేర్చుకున్నా. జిమ్మాస్టిక్స్ నా జీవితం. స్విమ్మింగ్ నెక్ట్స్ లెవల్ కాన్ఫిడెన్స్. ఇక యోగా సాధన చేసి.. సర్టిఫికేషన్ కూడా పొందా. యోగా స్థిరత్వాన్ని నేర్పించింది. నేను చదువుల్లో మెరిట్ స్టూడెంట్‌ను కాదు. దీంతో ఇంజనీరింగ్ తర్వాత జిమ్నాస్టిక్స్ కోచ్ అవుదామనుకున్నా. నాన్న అంగీకరించలేదు.
అందుకే యాంకరింగ్‌లోకి..
ఇంటర్‌లో చదివేప్పుడు ఓ వంటల ప్రోగ్రామ్‌లో డ్యాన్స్‌తో పాటు జిమ్నాస్టిక్స్ చేశా. అలా డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ చేయనిదే కుదరదన్నారు నాన్న. ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చేశాం. చదువు పూర్తి అయ్యాక గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది. ఆఫీసు ఉద్యోగం నావల్ల కాలేదు. దీంతో ఆర్నెళ్ల తర్వాత ఉద్యోగం వదిలేశా. సినిమాల్లో ప్రయత్నించా. ‘నల్లగా ఉన్నావు.. బక్కగా ఉన్నావు.. ఎత్తు ఉన్నావు’ అంటూ వంకలు పెట్టేవారు. ఉచిత సలహాలు ఇచ్చేవారు. ప్రతిచోటా తిరస్కరణలే. రిఫరెన్స్ ఎవరూ లేరని బాధపడేదాన్ని. విసుగెత్తిపోయి కోపంతో ఏడ్చేదాన్ని. సినిమాలకు దగ్గరి దారి యాంకరింగ్ అని ఇటువైపు వచ్చా. ఓ చిన్న చానల్‌లో ఎపిసోడ్‌కి 250 రూపాయలు తీసుకునేదాన్ని. ప్రతి ఛానెల్ ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. ఒకే ఛానల్‌కి మూడుసార్లు ఆడిషన్‌కి వెళ్లిన సందర్భాలున్నాయి. రిజెక్టయినా ప్రయత్నాలు వదల్లేదు. ఓ ఛానల్‌కి ఆడిషన్‌కి వెళితే.. వెంటనే లైవ్ షో చేయమన్నారు. అక్కడ మొదలైన ప్రయాణం అనేక మలుపులు తిరిగింది. ఎక్కడా ఆగలేదు. అలా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, లైవ్‌షోలు, డిబేట్స్, వంటల ప్రోగ్రామ్స్, యాంకరింగ్‌తో పాటు వెహికల్ రివ్యూలు చేసేదాన్ని. యాంకరింగ్‌పై ప్రేమ పుట్టింది. వదలకూడదనుకున్నా. మోడల్ అయ్యా. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా రాణించా. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన రైతు బిడ్డను నేను. ఇంత స్థాయికి వస్తానని అనుకోలేదెన్నడూ. ఇపుడిపుడే వెబ్‌సిరీ్‌సల్లో అవకాశాలొస్తున్నాయి. సినిమాల్లో మంచి పాత్రలు చేయాలన్నదే నా కల’’.
మా అమ్మ క్రికెట్‌కి వీరాభిమాని. అలా అమ్మ ద్వారా క్రికెట్ పిచ్చి పట్టింది. కబడ్డీ, క్రికెట్‌కి ప్రజెంటర్‌గా పని చేశా. ఎంటర్‌టైన్‌మెంట్ యాంకరింగ్ కంటే స్పోర్ట్ ప్రెజెంటేషన్ కాస్త కష్టం, విభిన్నం కూడా. ప్రిపరేషన్‌తో పాటు ఆటల మీద ఆసక్తి ఉండాలి. చదువుకునే రోజుల్లో అబ్బాయిలతో కలసి క్రికెట్ ఆడిన నేను.. ఐపిఎల్, ఇంటర్నేషనల్ ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ప్రజెంటర్‌గా పని చేయడం ఊహించనిది.
బైక్ రైడర్‌ను. ఒకసారి వేగంగా వెళ్తుంటే.. కిందపడి బాగా దెబ్బలు తగిలాయి కూడా. సోలో ట్రావెలర్‌ను కూడా. అమ్మాయిలు సోలో ట్రావెలర్స్ తక్కువ కాబట్టి నేను తిరిగి వీడియోలు చేద్దామనుకున్నా. 5 రోజులుండాలని హృషికేశ్ వెళ్లా. అక్కడ వాతావరణం నచ్చి 15 రోజులు ఉన్నా. శ్రీనగర్ నుంచి మనాలి వరకూ బైక్‌మీద సోలోగా ట్రిప్ కొట్టా. ఇదో గొప్ప ఎక్స్‌పీరియన్స్. కాఫీ షాపుల్లో తెలినివాళ్లతో మాట్లాడటం, నచ్చిన చోట ఉండటం మధురానుభూతి. బ్యాక్‌ప్యాక్‌తో వెళ్లిపోయి చాలామంది జీవితాలను చూస్తే నా బాధలు చిన్నవి అనిపించేవి. సోలో ట్రావెలింగ్‌లో వీడియోలు తీశా. కొందరిని ఇంటర్వ్యూలు చూశా. నేచర్ చూశాక.. మనం అధికులం కాదనిపించింది.
రాళ్లపల్లి రాజావలి
ఫొటో: ఆర్.రాజ్ కుమార్
