నడుము నొప్పికి మందు

ABN , First Publish Date - 2022-06-07T07:49:48+05:30 IST

నడుము నొప్పికి మందు

నడుము నొప్పికి మందు

నడుము నొప్పి మొదలైతే ఏ పనీ చేయలేం. పడుకోవడం, కూర్చోవడం లాంటి సాధారణ పనులు కూడా ఇబ్బందికరంగా మారతాయి. స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, తేలికపాటి వ్యాయామాలతో నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే అన్ని రకాల నడుము నొప్పులూ వీటితో అదుపులోకి రావు. పిరుదులు, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం నడుము నొప్పికి కారణమైతే, తేలికపాటి యోగాసనాలతో ఆ కండరాలను వదులు చేస్తే, నడుము నొప్పి మటుమాయం అవుతుంది. 


బాలాసనం: మోకాళ్లు, అరచేతులు నేల మీద ఉంచి, టేబుల్‌ టాప్‌ భంగిమలో కూర్చోవాలి. తర్వాత నడుము పైభాగాన్ని లేపుతూ, నెమ్మదిగా పిరుదులు, పాదాలకు ఆనేలా మోకాళ్లు మీద కూర్చోవాలి. తర్వాత చేతులను తల పై నుంచి, ముందుకు చాపి వంగి, నెమ్మదిగా నేలను తాకించాలి. ఈ భంగిమలో నుదురు కూడా నేలను తాకేలా చూసుకోవాలి. ఈ భంగిమలో 20 నుంచి 30 సెకండ్ల పాటు తిరిగి పూర్వపు స్థానానికి రావాలి. 


మార్జాలాసనం: చేతులు, మోకాళ్లు నేల మీద ఆనించి టేబుల్‌ టాప్‌ భంగిమతో మొదలుపెట్టాలి. తర్వాత వెన్నును పైకి లేపుతూ, తలను పైకి ఎత్తాలి. ఈ భంగిమలో ఐదు నిమిషాలు ఉండి, తర్వాత తలను దింపి నేలను చూస్తూ, వెన్నును కూడా కిందకు వంచాలి. 


సుప్తమత్స్యేంద్రాసనం: వెల్లకిలా పడుకుని, ఒక కాలిని మడిచి, మరొక పాదం నేల మీద ఆనేలా ఉంచాలి. చేతులను పక్కలకు చాపాలి. తర్వాత మడిచిన మోకాలును కుడి పక్కకు వంచాలి. తలను ఎడమ వైపు తిప్పి ఉంచాలి. ఈ భంగిమలో 20 నుంచి 30 సెకండ్ల పాటు ఉండి, రెండో వైపు చేయాలి. 


ఈ ఆసనాలతో నడుము, పిరుదులు, వెన్ను, కాళ్లలోని కండరాలు వదులై, నొప్పి అదుపులోకొస్తుంది. 

Read more