మధుమేహానికి జన్యువులే కారణమా?
ABN , First Publish Date - 2022-02-22T05:30:00+05:30 IST
జీవితాంతం వేధించే మధుమేహం పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిల్లో చాలా అపోహలు ఎటువంటి ఆధారం లేనివే. అవేంటో చూద్దాం... ...
జీవితాంతం వేధించే మధుమేహం పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిల్లో చాలా అపోహలు ఎటువంటి ఆధారం లేనివే.
అవేంటో చూద్దాం...
అపోహ: ఎక్కువ చక్కెర తినడం వల్ల మధుమేహం వస్తుంది.
వాస్తవం: మధుమేహానికి ప్రధాన కారణం చక్కెర తినడం అని శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. కుటుంబ ఆరోగ్య చరిత్ర, అస్తవ్యస్త ఆహార శైలి, అతి తక్కువ లేదా లోపించిన శారీరక శ్రమలే మధుమేహానికి ప్రధాన కారణాలు.
అపోహ: ఆరోగ్యకరమైన ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.
వాస్తవం: అన్ని ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఉంటాయి. సహజసిద్ధంగా శరీరంలో ఉన్న ఇన్సులిన్ అయినా, బయట నుంచి శరీరానికి అందించినదైనా... అది పిండి పదార్థాలను ఉపయోగించుకొని చక్కెర పెరగకుండా నియంత్రిస్తుంది. ఒకవేళ శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోయినా, ఉన్న ఇన్సులిన్‌ను సక్రమంగా ఉపయోగించుకోలేకపోయినా ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అపోహ: కేవలం వైద్య చికిత్స మాత్రమే మధుమేహాన్ని అదుపు చేయగలదు.
వాస్తవం: వైద్య చికిత్సతో పాటు ఆహార నియమాలు తోడైనప్పుడే మధుమేహం అదుపులో ఉంటుంది. వ్యాధిని నయం చేయడంలో మందుల పాత్ర స్వల్పమే. తీసుకున్న మందులు సమర్థంగా పని చేయాలంటే అందుకు తగిన, నియమబద్ధమైన జీవన విధానాన్ని ఆచరించాలి. కనుక సమతుల ఆహారంతో పాటు సక్రమమైన జీవన విధానం అనుసరించడం అవసరం.
అపోహ: మధుమేహులు ప్రత్యేక ఆహారం తీసుకోవాలి.
వాస్తవం: మధుమేహులు అందరూ తినే ఆహారాన్ని తినవచ్చు. కాకపోతే మితంగా తినాలి.
అపోహ: బయట నుంచి ఇన్సులిన్ ఇస్తున్నప్పుడు ఆహార నియమాలు పాటించనవసరం లేదు.
వాస్తవం: ఇన్సులిన్ ఆహారానికి, వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదు. ఇన్సులిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఆహార నియమాలు తప్పక పాటించాలి.
అపోహ: వ్యాయామంతో ఉపయోగం ఉండదు.
వాస్తవం: వ్యాయామంతో పిత్తాశయం ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో ఒత్తిడినీ అదుపులో ఉంచుతుంది. ఈ రెండు అంశాలూ రక్తంలో చక్కెర స్థాయిలను సమంగా ఉంచుతాయి.
అపోహ: మధుమేహులు చక్కెర లేని పదార్థాలన్నీ తినవచ్చు.
వాస్తవం: షుగర్‌ఫ్రీ అంటే వాటిలో కేలరీలు లేవని కాదు. కాబట్టి తినే ప్రతి షుగర్‌ఫ్రీ పదార్థంలో కేలరీలు ఎన్ని ఉన్నాయో పరీక్షించుకోవాలి. అలా లెక్కగట్టడం వల్ల రోజు మొత్తంలో ఎన్ని కేలరీలు శరీరంలోకి చేరతాయో తెలుస్తుంది. దానికి తగ్గట్టు రక్తంలో చక్కెర స్థాయిల పట్ల కూడా స్పష్టత వస్తుంది.
అపోహ: మా కుటుంబంలో ఎవరికీ చక్కెర వ్యాధి లేదు కాబట్టి నాకు వచ్చే అవకాశం లేదు.
వాస్తవం: కొంతమంది మధుమేహం సంక్రమించే ఎక్కువ అవకాశాలతో పుడతారు. మరికొంతమంది అదుపు తప్పిన జీవనవిధానం, ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధిని కొని తెచ్చుకొంటారు. కనుక కుటుంబంలో ఎవరికీ లేకపోయినా, సరైన జీవన విధానాన్ని కొనసాగించకపోతే ఎవరికైనా మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
అపోహ: రోజూ ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళనలతో మధుమేహం రాదు.
వాస్తవం: మానసిక ఒత్తిడి, ఆందోళనలు చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి మధుమేహులు స్వాంతన చెందడానికి తీరిక సమయం
కేటాయించుకోవాలి.